![Firangipuram SI arrested by ACB officers - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/8/ACB_.jpg.webp?itok=Omicc2zb)
ఫిరంగిపురం(తాడికొండ): ఓ కేసులో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఫిరంగిపురం ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్‌లు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన షేక్.ఖాసిం వినుకొండలో నివాసం ఉంటున్నాడు. గతేడాది కె.జాషువా అనే వ్యక్తి మోటారు సైకిల్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కేసులో జాషువా, అతని స్నేహితుడు ఖాసిం ప్రమాదానికి ముందు కలిసి మద్యం సేవించారు. దీని ఆధారంగా పోలీసులు ఖాసింపై అనుమానితుడిగా కేసు నమోదు చేశారు.
మృతుడు జాషువా కుటుంబ సభ్యులు ఖాసింపై ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోయినా కేసు నుంచి తప్పించాలంటే రూ. లక్ష ఇవ్వాలని ఎస్‌ఐ అజయ్‌బాబు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 80 వేలకు మాట్లాడుకున్నారు. చివరకు ఖాసిం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఎస్‌ఐ అజయ్‌బాబుకు రూ.40 వేలను ఇచ్చేందుకు ఖాసిం వెళ్లాడు. దీంతో ఎస్‌ఐ స్టేషన్‌లోని హెడ్‌కానిస్టేబుల్ రామకోటేశ్వరరావుకు అందజేయాలని చెప్పాడు. వాటిని తమ డ్రైవర్ షఫీకి ఇవ్వమని రామకోటేశ్వరరావు తెలిపాడు. నగదు చేతులు మారుతున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్‌లపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment