నిఖేశ్‌ లీలలు ఇన్నిన్ని కాదయా! | Nikesh Kumar ACB custody to end today | Sakshi

నిఖేశ్‌ లీలలు ఇన్నిన్ని కాదయా!

Published Sun, Dec 15 2024 4:28 AM | Last Updated on Sun, Dec 15 2024 4:28 AM

Nikesh Kumar ACB custody to end today

స్నేహితులు, బంధువుల పేర్ల మీద ఆస్తులు

వారికి తెలియకుండానే బినామీలుగా మార్చేసిన నిఖేశ్‌కుమార్‌

ఆస్తుల కొనుగోళ్లన్నీ నగదుతోనే జరిపిన ఏఈఈ 

ఏసీబీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి

నేటితో ముగియనున్న నిఖేశ్‌కుమార్‌ ఏసీబీ కస్టడీ 

సాక్షి, హైదరాబాద్‌: అనతి కాలంలో అంతులేని అవినీతితో వందల కోట్లకు పగడలెత్తిన నీటి పారుదల ఏఈఈ నిఖేశ్‌కుమార్‌ లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. తనవద్దకు పనికోసం వచ్చిన ప్రజలతోపాటు చిన్ననాటి స్నేహితులు, సొంత కుటుంబ సభ్యులను కూడా ఆయన మోసగించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తన మిత్రులు, కుటుంబ సభ్యులకు తెలియకుండానే వారిని నిఖేశ్‌ బినామీ లుగా మార్చు కున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిఖేశ్‌కుమార్‌ను.. ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు శనివారం కూడా ప్రశ్నించారు. 

చిన్న పని ఉందంటూ.. 
అవినీతిలో నిఖేశ్‌కుమార్‌ స్టైలే వేరుగా ఉన్నది. తన పదేళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన 2020 – 2024 మధ్యే ఎక్కువ ఆస్తులు పోగేశాడు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బాగా పీక్‌లో ఉన్నప్పుడు ఆయన గండిపేట్‌లో పనిచేశాడు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వటంలో కీలకంగా మారాడు. ఫీల్డ్‌ లెవల్‌ ఆఫీసర్‌ కాబట్టి ఏ స్థలం ఎఫ్‌టీఎల్‌లోకి వస్తుంది..ఏది రాదు అన్నది ఆయనే మార్క్‌ చేయాల్సి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచి కోట్లలో డబ్బులు గుంజాడు. 

ఒక్కో ఫైల్‌ క్లియర్‌ చేసేందుకు లక్షల్లో లంచంగా తీసుకున్నాడు. నగదు రూపంలో మాత్రమే లంచాలు తీసుకొనేవాడు. ఆ డబ్బును స్థిరాస్తులుగా మార్చుకోవడానికి తన చిన్ననాటి స్నేహితులను వాడడం ప్రారంభించాడు. ఏదో ఒక సాకుతో, లేదంటే చిన్న పని ఉందని చెప్పి తన ఇంటర్మీడియెట్‌ స్నేహితుల నుంచి ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు తీసుకున్నాడు. తన సొంత అన్న, ఇతర కుటుంబ సభ్యుల ఆధార్, పాన్‌ కార్డులను కూడా తీసుకుని ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

లా బినామీలను పిలిచి విచారించగా.. ‘అసలు మేం ఎప్పుడు ఈ ఆస్తులు కొన్నాం? మాకు ఏమీ తెలియదు? ఏదో పని ఉందని మా దగ్గరి నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తీసుకున్నాడు’ అని వారు సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా చదువులు కూడా పూర్తికాని తన కుటుంబ సభ్యుల పేర్లమీద కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. 

సాక్షుల స్టేట్‌మెంట్లు రికార్డు 
సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను విశ్లేషించిన ఏసీబీ అధికారులు.. వాటి గురించి నిఖేశ్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఆయన ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిఖేశ్‌కుమార్‌ ఆస్తులు కొనుగోలు చేసిన పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ప్రతినిధులను పిలిచి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మైలాన్, బ్లిస్, కపిల్‌ ఇన్‌ఫ్రా కంపెనీల్లో నిఖేశ్‌కుమార్‌ మొత్తం నగదు రూపంలోనే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 

ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. పలు బ్యాంకు లాకర్లలో నిఖేశ్‌ దాచి ఉంచిన బంగారం ఇతర ఖరీదైన వస్తువులు, ఆస్తుల పత్రాలపైనా వివరాలు సేకరించారు. కాగా నిఖేశ్‌ను ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనున్నది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement