సాక్షి, అమరావతి: ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల నమోదైందని, ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తక్కువ రేట్లకు నిత్యావసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. మరోవైపు ధరల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకు నిల్వలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ http://fcain foweb.nic.in/psp లో నమోదు చేయాలని సూచించినట్టు తెలిపారు.
ధరల జాబితా ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపు కోసం 24, 26 కిలోల పరిమాణంలో వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని, వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి, సరుకు నిల్వలు లేకపోవడం, స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్టు తెలిపారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కందుల దిగుమతులు మందగించాయన్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి నాణ్యమైన రకాల బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment