సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీలకు ఈ ఏడాది రంజాన్ కానుక అందేలా లేదు. రంజాన్ తోఫా పేరిట నాలుగేళ్లుగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 11 లక్షల ముస్లిం కుటుంబాలకు ఉచితంగా కొన్ని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు కూడా నెయ్యితో కూడిన పిండి వంటలు తినాలనే ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 5 కిలోల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ప్రకారం ఇప్పటివరకూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీన రంజాన్ పండుగ ఉండటంతో ఆలోగా సరుకుల సేకరణ, పంపిణీకి సంబంధించి ఇదివరకే టెండర్లు కూడా పిలిచారు.
ఇందులో భాగంగానే 5,500 టన్నుల గోధుమ పిండి, 2,200 టన్నుల చక్కెర, 1,100 టన్నుల సేమియా, 110 కిలోలీటర్ల నెయ్యిని సేకరించి ఒక్కో లబ్దిదారుడికి నిర్ణయించిన ప్రకారం విడివిడిగా ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రెండు నెలలకు ముందు ప్రారంభిస్తే రంజాన్ పండుగలోపు లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కనీసం వాటి గురించి ప్రస్తావనే కన్పించడం లేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందని పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.
ఈ నెల 23న చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయమై కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించారు. రంజాన్ తోఫా సరుకుల సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోని విషయమై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వరప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఇంకా సమయం ఉందని తెలిపారు.
రంజాన్ తోఫా లేనట్లే!
Published Wed, May 8 2019 4:10 AM | Last Updated on Wed, May 8 2019 7:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment