కేరళ రాష్ట్ర పౌర సరఫరాల బృందంతో కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం
కొరిటెపాడు(గుంటూరు): కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బృందం గుంటూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం సందర్శించింది. బృందంలోని సభ్యులు కమిషనర్ డాక్టర్ డి.సజిత్‌బాబు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంజీబ్‌కుమార్ పట్జోషి, కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రైవేటు సెక్రటరీ ప్రదీప్‌కుమార్ యార్డును సందర్శించిన వారిలో ఉన్నారు.
వారికి గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి సాదర స్వాగతం పలికారు. మిర్చి యార్డులోని మిర్చి కమీషన్ షాపులను కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు. యార్డు పనితీరు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఛాంబర్‌లో కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ.. ప్రపంచంలోని సుమారు 15 దేశాలకు గుంటూరు నుంచి మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో మిర్చి పంట సాగును బృందం పరిశీలించింది. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి పద్మశ్రీ, ఉద్యానశాఖ అధికారి ఎన్.సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment