సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాను పూర్తిగా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని బియ్యంగా మార్చే ప్రక్రియలోకి పీడీఎస్ బియ్యం వచ్చి చేరకుండా జాగ్రత్త పడుతోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎంఆర్ మిల్లుల విద్యుత్ వినియోగం, కస్టమ్ మిల్లింగ్ జరిగిన బియ్యం పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది.
ఇందులో భాగంగానే 8 జిల్లాల్లో సుమారు 46 మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం పరిమాణం కంటే విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తించింది. తక్కువ విద్యుత్ వాడి ఎక్కువ మొత్తంలో మిల్లింగ్ చేయడం ఎలా సాధ్యమైందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా ఆయా మిల్లులను వెంటనే తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది.
తగ్గిన అక్రమ రవాణా
మరోవైపు విజిలెన్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలావరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. దీనికి తోడు 6ఏ కేసులను త్వరగా విచారించి పట్టుబడ్డ బియ్యాన్ని తిరిగి బహిరంగ వేలం ద్వారా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్, డీసీఎస్‌వో, పౌర సరఫరాల శాఖ ఏఎం, మార్కెటింగ్ శాఖ ఏడీలతో ప్రత్యేక కమిటీలను నియమించింది. వీరు సంబంధిత తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం నాణ్యత, రకాన్ని బట్టి అప్‌సెట్ ధరను నిర్ణయించి బహిరంగ వేలానికి వెళ్తున్నారు.
అక్రమ రవాణాలో దొరికిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు బయటకు పంపించేలా ప్రతి నెలలో రెండు సార్లు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణంలో రికార్డులకు మించి స్టాక్ ఉంటే దానిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. ఇటువంటి నిల్వలకు మోక్షం కలి్పంచి పీడీఎస్ ధరకే ప్రజా పంపిణీలోకి తీసుకొస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రైవేట్ గోడౌన్లు, దుకాణాలు, లారీల్లో స్వా«దీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం బహిరంగ వేలానికి పెడుతున్నారు.
నిల్వలతో సమస్య
అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో సరుకును నిల్వ చేస్తున్నారు. అయితే, కేసుల విచారణ జాప్యంతో నిల్వలు పేరుకుపోయి బియ్యం ముక్కిపోవడం, రంగు మారడం, పురుగులు పట్టి ప్రజా వినియోగానికి పనికిరావట్లేదు. వీటి ప్రభావం ఎంఎల్‌ఎస్ పాయింట్లలోని తాజా సరుకులపైనా పడుతోంది.
ఒక్కోసారి ఈ నిల్వలు సాధారణ పీడీఎస్‌లో కలిసిపోతుండటంతో సరైన లెక్కలు ఉండట్లేదు. వీటిని అరికట్టేందుకు జిల్లాల్లో ఒకట్రెండు ఎంఎల్‌ఎస్ పాయింట్లను గుర్తించి వాటిలో మాత్రమే అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ చౌక బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో సరుకు విలువ రూ.50 లక్షలకు పైబడి ఉంటే కలెక్టర్, రూ.50 లక్షలు లోపు ఉంటే జాయింట్ కలెక్టర్ విచారించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులు మినహా మిగిలిన వాటిని జిల్లా స్థాయిలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు.
సీఎంఆర్‌పై ప్రత్యేక దృష్టి
పౌరసరఫరాల శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మిల్లుల కరెంటు వాడకం, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం పరిమాణాన్ని పోల్చి చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో సీఎంఆర్ చేసి ఇచ్చిన బియ్యానికి, వాడిన కరెంట్‌కు పొంతన లేదు.
తక్కువ కరెంట్‌తో ఎక్కువ బియ్యం సీఎంఆర్ చేసినట్టు చూపిస్తున్నారు. దీనిపై ఆయా జిల్లాల జేసీలను తనిఖీ చేయాలని ఆదేశించాం. వారిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసఫరాల శాఖ కమిషనర్
వేగంగా కేసులను డిస్పోజ్ చేస్తున్నాం
రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో చాలా వరకు రేషన్ అక్రమ రవాణా తగ్గింది. దీనితో పాటు ఇప్పటివరకు నమోదైన 6ఏ కేసులను కూడా త్వరగా విచారించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం.
కొన్నేళ్లుగా విచారణకు నోచుకోని కేసులు, భారీగా పేరుకుపోయిన నిల్వలను క్లియర్ చేస్తున్నాం. సరైన పత్రాలు లేకుండా తరలిస్తూ పట్టబడ్డ బియ్యానికి బహిరంగ వేలం నిర్వహించి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తున్నాం. – విజయ సునీత, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment