రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ ఆగేనా? | Uttamkumar Reddy: Strict Action for Recycling of Ration Rice | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ ఆగేనా?

Published Tue, Dec 26 2023 2:39 AM | Last Updated on Tue, Dec 26 2023 2:39 AM

Uttamkumar Reddy: Strict Action for Recycling of Ration Rice - Sakshi

రేషన్‌ బియ్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ తీరు పై సమీక్షించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... పీడీ ఎస్‌ బియ్యం సరఫరా తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా వా కబు చేశారు.

అయితే ప్రతి నెలా పేదలకు పంపిణీ అవుతు న్న 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంలో ఏకంగా 70 శా తం వరకు బియ్యం పక్కదారి పడుతోందని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. పీడీఎస్‌ బియ్యంలో నాణ్యత లోపించడం వల్లే ఇలా జరుగుతోందని తేల్చిన మంత్రి దీనికి ప్రధాన కారణం మిల్లర్లేనని సమావేశంలోనే చెప్పారు. హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు మిల్లర్ల చేతివాటం గురించి పూర్తి అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే సోమవారం హుజూర్‌నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన... రేషన్‌ బియ్యం దురి్వనియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీడీఎస్‌ రైస్‌ సరఫరా చేయడంతోపాటు బియ్యం పక్కదారి పట్టడాన్ని నిలువరించడంపై దృష్టి పెట్టారు. 

మిల్లర్ల కొనుగోళ్ల చక్రం! 
రాష్ట్రంలోని 90.14 లక్షల ఆహార భద్రతా కార్డులకుగాను 2.83 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వారికి ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3,580 కోట్లు రాయితీ కింద వెచ్చిస్తోంది. అంటే నెలకు రూ. 298 కోట్లు. మొత్తంగా కిలో బియ్యానికి సగటున రూ. 39 వెచ్చిస్తూ సరఫరా చేస్తున్న ఈ బియ్యాన్ని కార్డుదారులకు ఒక్కో యూనిట్‌ (ఒక్కొక్కరికి)కి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది.

అయితే ఈ బియ్యాన్ని కార్డుదారుల్లో కొందరు తిరిగి రేషన్‌ దుకాణాల్లోనే విక్రయించే విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కిలోకు రూ. 6–9 వరకు చెల్లించి కొందరు రేషన్‌ దుకాణదారులు కొంటుండగా వారి నుంచి కిలోకు రూ. 10–13 చెల్లించి దళారులు కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపుతున్నట్లు తెలుస్తోంది.

పక్క రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్‌ వంటి జిల్లాల్లో రేషన్‌ డీలర్లు బియ్యాన్ని దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ తతంతంలో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని.. డీలర్లు, దళారుల నుంచి మామూళ్లు తీసుకొని బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఐపీఎస్‌ అధికారి నియామకంతో... 
ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి డీఎస్‌ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్‌ కూడా కమిషనర్‌కు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌహాన్‌కు గతంలో ఎఫ్‌సీఐలో పనిచేసిన అనుభవం ఉంది.

రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

మంత్రి ఉత్తమ్‌ హెచ్చరిక 
హుజూర్‌నగర్‌లోని ఓ రేషన్‌ దుకాణం తనిఖీ

హుజూర్‌నగర్‌: రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యానికి రూ. 39 ఖర్చుపెట్టి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తోందని, ఆ బియ్యాన్ని మిల్లర్లుగానీ, ఇతరులెవరైనా రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని 33వ నంబరు రేషన్‌ షాపును తనిఖీ చేశారు.

రేషన్‌ బియ్యం నాణ్యతను పరిశీలించి డీలర్ల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కొందరు రేషన్‌ బియ్యాన్ని కోళ్ల దాణాకు, బీర్ల తయారీకి అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్‌ చేయించి తిరిగి వాటినే ప్రభుత్వ (ప్రొక్యూర్‌మెంట్‌) సేకరణకు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిందని, మాఫియాలా కొనసాగుతోందని మండిపడ్డారు. ఇక నుంచి రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. 

గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నష్టాలు... 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే పౌరసరఫరాల సంస్థ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో, రూ. 11 వేల కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు. అప్పులపై ఏటా రూ. 3 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు.

గత ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల దగ్గర రూ. 22 వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పెట్టడంపై సమీక్షిస్తున్నామని... మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం రికవరీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్‌ తెలిపారు. ధాన్యం సేకరణ పద్ధతులను, రేషన్‌ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి వెంట ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న 
తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement