
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువులకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే ప్రభుత్వం పరిష్కరిస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రజలు ఈ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు.
సరుకుల విక్రయంలో మోసాలకు పాల్పడితే కేసులు
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల విక్రయాల్లో మోసాలకు తావు లేకుండా తనిఖీలు నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర వస్తువులు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు అమ్మినా వాటిని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
– పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్
ఇంకా ఆయన ఏమన్నారంటే..
► వాహనాలు, వ్యక్తులకు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి 650 పాస్‌లు ఇచ్చాం.
► ఇప్పటివరకు విద్యుత్, నీటిసరఫరాకు ఎటువంటి ఆటంకం కలగలేదు, పారిశుధ్య సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు.
► 1,060 ఎల్‌పీజీ సరఫరాదారులు వంట గ్యాస్ సరఫరా చేస్తున్నారు.
► బుధవారం నాటికి రాష్ట్రంలో 101 రైతుబజార్లు, 385 వికేంద్రీకరణ రైతుబజార్లు, 277 మొబైల్ రైతుబజార్లు, 868 డోల్ డెలివరీ సర్వీసులు, 34,324 రిటైల్ దుకాణాలు, 11,131 మెడికల్ షాపులు పనిచేస్తున్నాయి.
► రోజుకు 20 వేల క్వింటాళ్ల కూరగాయలు, 22.03 లక్షల లీటర్ల పాలు, 71.57 లక్షల గుడ్లు, 15.09 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,300 టన్నుల పప్పుధాన్యాలు, 4,800 మెట్రిక్ టన్నుల పంచదార అందుబాటులో ఉన్నాయి.