సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనుంది. ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్ని జిల్లాల్లో అమలు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సీనియర్ అధికారులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలకు సంబంధించిన పలు వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు. అదేవిధంగా బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్, రబీ పంట ద్వారా 28.74 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను అధికారులు సీఎం జగన్‌కు చూపించారు. ఈ క్రమంలో సీఎం జగన్ శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లోని నాణ్యమైన బియ్యం నమూనాలను పరిశీలించారు.
కాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడానికి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌చేసిన నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 30 చోట్ల 99 బియ్యం ప్యాకింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందులో 41 సివిల్ సప్లైస్‌వి కాగా, 58 చోట్ల పీపీపీ మోడల్ ప్యాకేజ్‌డ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. నెలకు 2 వేల టన్నుల బియ్యాన్ని ప్యాకేజీ చేసే సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ప్రతి 30, 40 కిలో మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సత్వర పంపిణీ కోసం తగిన సిబ్బంది, వాహనాలను అధికారులు ముందుగానే గుర్తించినట్లు సీఎం జగన్‌కు తెలిపారు. అయితే పర్యావరణానికి హాని జరగకుండా బియ్యాన్ని ప్యాక్‌చేయడానికి వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు అదేశించారు.
ఇక ఏప్రిల్ 1 నుంచే అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ఏప్రిల్ 1 నాటికి 22 నియోజకవర్గాల్లో, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్‌నాటికి 70 నియోజకవర్గాలు, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో దశల వారిగా పంపిణీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: త్వరలో ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం)
Comments
Please login to add a commentAdd a comment