సాక్షి, అమరావతి: అధికారం అండతో పేదల నోళ్లుకొట్టి ఇన్నాళ్లూ దోచుకున్న పౌరసరఫరాల శాఖలోని కొందరు బినామీ డీలర్లు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. కొత్త ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోననే భయంతో ఒక్కొక్కరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం, కృష్ణా, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో దాదాపు 200 మంది బినామీ డీలర్లు ఇప్పటికే సర్దుకున్నట్లు సమాచారం.
బ్లాక్‌మార్కెటింగ్‌లో నిష్ణాతులు
పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి జేబులు నింపుకోవడంలో ఈ బినామీలు సిద్ధహస్తులు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనేకసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చినా అలాంటివి ఎక్కడా జరగలేదని మంత్రులే అడ్డుపడేవారు. దీంతో వారి ఆగడాలకు అంతులేకుండాపోయింది. పలువురు ప్రజాప్రతినిధులకు కూడా వీరి దందాలో భాగం ఉండటంతో బినామీలు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. విజిలెన్స్ విభాగం సైతం చోద్యం చూసినట్లు వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పక్కదారి ఎలా పట్టించారంటే..
ఈ–పోస్ మిషన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మార్పులుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో దాదాపు 260మంది రేషన్ డీలర్లతోపాటు పలువురు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని తేల్చినా వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తారు. ఈ–పోస్ టెక్నీషియన్ల సహాయంతో పంపిణీకి ఆఖరి రెండ్రోజుల్లో అంటే 13, 14 తేదీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆధార్ నంబర్లను ఈ–పోస్ యంత్రాలకు అనుసంధానం చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆ రేషన్‌ను పక్కదారి పట్టించారు. ఇందులో అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన నాయకులు, రేషన్ డీలర్ల ప్రమేయం ఉందని గతంలో గుర్తించారు.
రూ.8కి కొనుగోలు చేసి..
ఇదిలా ఉంటే.. బినామీ డీలర్లపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వారు మరింత చెలరేగిపోయారు. సబ్సిడీ బియ్యాన్ని కార్డుదారుల నుంచే ఏకంగా కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వాటిని నేరుగా మిల్లర్లకు రూ.15కు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. పేదల బియ్యాన్ని కొనుగోలు చేసే రేషన్ డీలర్, బియ్యం విక్రయించిన లబ్ధిదారుడిపై కేసులు నమోదు చేస్తామని సర్కారు జారీచేసిన జీఓ కాగితాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడుతుండడంతో మున్ముందు చర్యలు ఎలా ఉంటాయోనన్న అనుమానంతో బినామీ డీలర్లు ఒకొక్కరుగా తప్పుకుంటున్నారు.
805 షాపులకు బినామీ డీలర్లు
రాష్ట్రం మొత్తం మీద 29 వేల మంది రేషన్ డీలర్లు ఉంటే ఇందులో 805 రేషన్ షాపులకు బినామీ డీలర్లు ఉన్నారు. ఈ షాపులకు వెంటనే రెగ్యులర్ డీలర్లను నియమిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో నాలుగేళ్లుగా బినామీ డీలర్లు సబ్సిడీ బియ్యాన్ని బొక్కేస్తూ వచ్చారు. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే అత్యధికంగా 302 మంది బినామీ డీలర్లు ఉన్నారు. ఆ జిల్లాలో విచ్చలవిడిగా సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోందనే ఆరోపణలు ఉన్నా అధికారులు చేసేదిలేక మిన్నకుండిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే.. రేషన్ మాఫియాను నడుపుతున్న టీడీపీ నాయకుడు బాబూరావును గతంలో పోలీసులు అరెస్టుచేసినా ఫలితంలేదు.
Comments
Please login to add a commentAdd a comment