నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీకి ఉపయోగించనున్న మొబైల్ వాహనం నమూనా , బియ్యం డోర్ డెలివరీకి ఉపయోగించనున్న సంచుల నమూనా
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు. కోవిడ్–19 నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా శుక్రవారం ఆయన పౌరసరఫరాల శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే.
అర్హులందరికీ లబ్ధి కలిగేలా చర్యలు
► అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రేషన్ పంపిణీలో ఉన్న లోటు పాట్లను సరిదిద్ది అవినీతిని రూపుమాపడంతో పాటు పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేసే వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డు అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా సచివాల యాల్లో లబ్ధిదారుల జాబితాను ఉంచా రు. అందులో పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలను కూడా అందుబాటులో ఉంచారు.
► వాటి ఆధారంగా దర ఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి అధికా రులు బియ్యం కార్డులను మంజూరు చేశారు. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నాణ్యతపై దృష్టి
► నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే తాజా ఆదేశాలు జారీ చేశారు.
► రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్ చేయడం, ఇంటికే డోర్ డెలివరీ చేయడాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారి నుంచి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం స్వీకరించింది.
ప్రతి బ్యాగ్‌పై స్ట్రిప్ సీల్, బార్ కోడ్
– కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ.
గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపై స్ట్రిప్ సీల్, బార్ కోడ్ ఉంటుంది. కల్తీ లేకుండా, రవాణాలో అక్రమాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్ యూనిట్లను పెడుతున్నాం. ఇందులోనే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ ఉంటుంది. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తాం. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ను ఓపెన్ చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తాం. బియ్యాన్ని తీసుకోవడం కోసం లబ్ధిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తున్నాం. ప్రతినెలా 2.30 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment