8,774 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు | Purchase of grain in 8774 Rythu Bharosa centres Andhra Pradesh | Sakshi
Sakshi News home page

8,774 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు

Published Thu, Oct 28 2021 4:47 AM | Last Updated on Thu, Oct 28 2021 4:47 AM

Purchase of grain in 8774 Rythu Bharosa centres Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మిల్లర్ల పాత్రను పూర్తిగా తగ్గిస్తూ రైతులకు మరింత మేలు చేకూర్చేలా ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విజయవాడలో భేటీ అయ్యింది. మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం విజయవాడలో సమావేశమై ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఇకనుంచి ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఒక్క రైతు కూడా తాను పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పక్క గ్రామానికి వెళ్లే అవసరం లేకుండా స్వగ్రామంలోనే అమ్ముకునేలా ఏర్పాట్లు చేయబోతున్నారు.

వరి సాగయ్యే ప్రాంతాల్లో ఉన్న 8,774 ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్‌ మొదటి వారం నుంచి ఆర్బీకేల్లో కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణకు నోడల్‌ ఏజెన్సీగా ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నూటికి నూరుశాతం కనీస మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై సీఎంకి నివేదిక సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు విధివిధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు ‘సాక్షి’కి చెప్పారు.

బంద్‌ చేస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటాం: మంత్రి కొడాలి
రేషన్‌ డీలర్లు బంద్‌ చేసినంత మాత్రాన బియ్యం సరఫరా నిలిచిపోదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.   నవంబర్‌ 1వ తేదీ నుంచి బంద్‌ చేస్తామంటూ డీలర్లు మొండిపట్టుపడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గన్నీ బ్యాగులు, యూజర్‌ చార్జీల విష యంలో రేషన్‌ డీలర్లకు సమస్య ఉందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రం ఇచ్చే బియ్యం కాకుండా కేంద్రం కూడా రేషన్‌ ఇస్తోందని చెప్పారు. కేంద్రం కిలోకి 35 పైసల కమీషన్‌ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 65 పైసలు కలిపి రూపాయి కమీషన్‌ ఇస్తోందని తెలిపారు.

కేంద్రం నుంచి రావాల్సిన పేమెంట్‌ పెండింగ్‌లో ఉందని చెప్పారు. సమస్యలు ఉంటే చర్చించుకోవాలే తప్ప ధర్నాలు, బంద్‌లు చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కృషిచేస్తామని, అయితే డెడ్‌లైన్లు పెడితే కుదరదన్నారు.  ప్రజలకు బియ్యం వెళ్లకుండా చేస్తాం.. అంటే ఊరుకునేది లేదని, రేషన్‌ డీలర్లు 1వ తేదీన బంద్‌ చేస్తామంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement