Free rice scheme
-
Telangana: పేదలందరికీ.. సన్నబియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దొడ్డు బియ్యం దురి్వనియోగంతో.. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నెలకు 2 ఎల్ఎంటీలు అవసరం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్ నుంచే మిల్లింగ్ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించింది. రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్ నెట్‌వర్క్‌లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్లైన్లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్‌కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది. 84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు. -
FCI data: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యం నిల్వలు ఏడాదిలో భారీగా తగ్గాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సెంట్రల్ ఫూల్ కింద సేకరించి పెట్టిన గోధుమ, బియ్యం నిల్వలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు అక్టోబర్ గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 2017లో బియ్యం, గోధుమల మొత్తం నిల్వలు 4.33 కోట్ల మెట్రిక్ టన్నుల కనిష్టానికి పడిపోగా, ప్రస్తుతం అదేరీతిన నిల్వలు 5.11 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గత ఏడాది నిల్వలు 8.16 కోట్లతో పోల్చినా 37 శాతం నిల్వలు తగ్గడం, ఇందులో ముఖ్యంగా గోధుమల నిల్వలు ఏకంగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఉచితంతో బియ్యం.. దిగుబడి తగ్గి గోధుమలకు దెబ్బ.. దేశంలో కరోనా నేపథ్యంలో కేంద్రం 2020 ఏప్రిల్ నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81 కోట్ల జనాభాకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇప్పటికే ఆరు విడతలుగా అమలు చేసిన బియ్యం పథకం కింద 11.21 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. ప్రస్తుత అక్టోబర్ నుంచి మరో మూడు నెలలు ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. ఈ మూడు నెలల కాలానికి మరో 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరాలు ఉంటాయని అంచనా వేసింది. ఉచిత బియ్యం పథకం నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా బియ్యం నిల్వలు కేంద్రం వద్ద తగ్గాయి. గత ఏడాది కేంద్రం వద్ద అక్టోబర్‌లో 3.47 కోట్ల బియ్యం నిల్వలు ఉండగా, అది ఈ ఏడాది 2.83 కోట్లకు పడిపోయింది. అయితే బియ్యం నిల్వలు తగ్గినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏం లేదని, కేంద్ర పథకాల కొనసాగింపునకు ఇదేమీ అడ్డుకాదని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఖరీఫ్ పంటల కోతలు ఆరంభం అయినందున వీటితో మళ్లీ నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని అంటోంది. అయితే గోధుమల పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. గోధుమల నిల్వలు గతంతో పోల్చితే తీవ్రంగా తగ్గాయి. 2017లో గోధుమల నిల్వలు 2.58 కోట్ల టన్నులు, 2018లో 3.56 కోట్లు, 2019లో 3.93 కోట్లు, 2020లో 4.37 కోట్లు, 2021లో 4.68 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉండగా, అవి ఈ ఏడాది ఏకంగా 2.27 కోట్ల టన్నులకు తగ్గాయి. కరోనా పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా కరువు పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎగుమతులు పెరగ్గా, దేశంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో కేంద్రం వద్ద నిల్వలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది మే నెలలో గోధుమల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినప్పటికీ మే నుంచి అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంట దిగుమతులు తగ్గాయి. దీంతో అనుకున్న స్థాయిలో కేంద్రం నిల్వలు సేకరించలేకపోయింది. డిమాండ్‌ను గుర్తించి వ్యాపారులు ముందస్తు నిల్వలు చేశారు. ఈ ప్రభావం స్టాక్‌లపై పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారుల గోధుమ నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశాలివ్వడం, దేశీయ లభ్యతను పెంచడానికి స్టాక్ పరిమితులను విధించడం వంటి చర్యలను కేంద్రం పరిగణించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
మిగులు నుంచే ‘ఉచిత’ సర్దుబాటు!
ఉచిత బియ్యం పథకం అమలుకు టీ సర్కారు కసరత్తు బోగస్ ఏరివేతతో బియ్యం, కిరోసిన్ సబ్సిడీలో రూ.400 కోట్ల మిగులు ఉచిత బియ్యం పంపిణీకి అదనంగా అయ్యేది రూ.200 కోట్లే మిగులు నిధుల నుంచి ఈ వ్యయం భరించాలని యోచన హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉచిత బియ్యం పంపిణీకి.. ప్రస్తుతం అవుతున్న వ్యయం కంటే అదనంగా మరో రూ.200 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బోగస్ కార్డుల ఏరివేతతో మిగులుతాయని భావిస్తున్న రూ.400 కోట్ల నుంచి ఈ సొమ్మును సర్దుబాటు చేయవచ్చని సర్కారు భావిస్తోంది. ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే దిశగా ఇప్పటికే ప్రాథమిక చర్చలు ప్రారంభించిన కేబినెట్ సబ్‌కమిటీ.. ఇదే అంశంపై మరోమారు అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక ఓ నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎఫ్‌సీఐ కోటా కింద 10.94 లక్షల మెట్రిక్ టన్నులు (ఏపీఎల్-6.56, బీపీఎల్-4.38 లక్షల మెట్రిక్ టన్నులు) కేటాయిస్తుండగా, మరో 7 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రం సమకూరుస్తోంది. ఈ బియ్యం పంపిణీ కింద రాష్ట్రం ఏటా సుమారుగా రూ.1,400 కోట్ల మేర సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 11 లక్షల బోగస్ కార్డులను ఏరివేయడం ద్వారా సుమారు 51 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను తొలగించింది. ఈ ఏరివేసిన కార్డులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ సరఫరాలను పూర్తిచేయడంతో అవన్నీ మిగులులో ఉన్నట్టే. సెప్టెంబర్ లెక్కల ప్రకారం నెలకి సుమారు 16 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 2,460 కిలోలీటర్ల కిరోసిన్ మిగులు చేకూరింది. అంటే ఏడాదిలో ఇంకా పూర్తిస్థాయిలో ఏరివేత పూర్తయితే రాష్ట్రానికి మొత్తం సబ్సిడీ భారం రూ.400 కోట్ల మేర తగ్గుతుందని పౌర సరఫరాల శాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం స్థానంలో ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఏటా మరో రూ.200 కోట్ల కంటే ఎక్కువ భారం పడదని, దీన్నిసైతం మిగులులోంచి సర్దుబాటు చేయొచ్చన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందని చెబుతున్నారు. ఇక బియ్యం కోటాను సైతం కుటుంబానికి 20 కేజీల నుంచి 30-35 కేజీల వరకు పెంచే అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సర్కారు.. బియ్యం లభ్యత, కేంద్ర సహకారం, ఆర్థిక భారాల లెక్కలు తేలాకే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది.కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ దీనిపై అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకున్నాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పామాయిల్ పునరుద్ధరణ దిశగా... గత ఐదు నెలలుగా రేషన్‌కార్డుదారులకు నిలిచిపోయిన పామాయిల్ సరఫరాను తిరిగి పునరుద్ధరించే అంశంపై కూడా సర్కారు సమాలోచనలు చేస్తోంది. పామాయిల్‌పై కేంద్ర సబ్సిడీ ఎత్తివేసిన అనంతరం దీన్ని పునరుద్ధరించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనర్హుల ఏరివేత పూర్తికావడం, పామాయిల్‌కు లబ్ధిదారుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉన్న దృష్ట్యా దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ప్రజాప్రతినిధుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులకు వినతులు వెళ్లాయి. పామాయిల్ సబ్సిడీ భారం నెలకు రూ.19 కోట్లు, ఏటా రూ.230 కోట్ల వరకు ఉంటుందని గతంలోనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే బోగస్ ఏరివేత పెద్ద ఎత్తున జరిగినందున ఈ భారం రూ.180 కోట్లకే పరిమితం కావచ్చని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ భారాన్ని కూడా మిగులు సబ్సిడీ నుంచి సర్దుబాటు చేయాలని సబ్ కమిటీ యోచిస్తోంది.