distribution of ration rice
-
Telangana: పేదలందరికీ.. సన్నబియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దొడ్డు బియ్యం దురి్వనియోగంతో.. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నెలకు 2 ఎల్ఎంటీలు అవసరం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్ నుంచే మిల్లింగ్ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించింది. రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్ నెట్‌వర్క్‌లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్లైన్లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్‌కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది. 84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు. -
సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా.. సమర్థంగా రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు రేషన్ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయి తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు–కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల–బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వారు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిలాల్లో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణ నెల్లూరు, తిరుపతి సహా తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాణ, పశు నష్టం జరిగినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ కూడా ప్రారంభం కావాలన్నారు. రైతులకు కలెక్టర్ల భరోసా.. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాలతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయికి వెళ్లింది. దగ్గరుండి సహాయక చర్యలను చేపట్టింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కల్లాల్లో ధాన్యం గుట్టలను సందర్శించి అవి తడవకుండా టార్పాలిన్లు కప్పేలా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధైర్యపడాల్సిన అవసరంలేదని, మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు కలెక్టర్లు భరోసా ఇచ్చారు. -
రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, అమరావతి: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించొద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మంగళగిరిలో చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ఉచిత బియ్యం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. సమీపంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎండీయూ వాహన సేవలు, బియ్యం నాణ్యతపై అభిప్రాయాణలను సేకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని వాహనాల్లో ఇంటి వద్దకే అందించడం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. చాలా మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న రూపాయికే కిలో బియ్యంతో కడుపు నింపుకుంటున్నట్టు చెప్పారన్నారు. -
గిరిజనులకు ‘సహకారం’ ఏదీ ?
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అడవి తల్లినే నమ్ముకుని జీవించే గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం జీసీసీ(గిరిజన సహకార సంస్థ)ని ఏర్పాటు చేసింది. అయితే సంస్థ అధికారుల అనాలోచిత నిర్ణయాలు.. పర్యవేక్షణ లోపం.. చిత్తశుద్ధి లేకపోవడంతో తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు తప్ప జీసీసీ తమకు మరేవిధంగానూ ఉపయోగపడడం లేదని వారు వాపోతున్నారు. ఒకప్పుడు అడవిలో సేకరించిన పలు రకాల ఉత్పత్తులను జీసీసీ డిపోలకు తీసుకెళ్లి అమ్ముకుని.. బియ్యం, సరుకులు కొనుక్కునే వాళ్లమని.. ఇప్పుడు జీసీసీకి ఏమీ అమ్మాలనిపించడంలేదని అంటున్నారు. తగ్గిన ఆదరణ... గిరిజనుల పట్ల జీసీసీ సిబ్బందికి.. జీసీసీ కొనుగోలు చేసే వస్తువుల సేకరణ పట్ల గిరిజనులకు ఆసక్తి తగ్గిపోయింది. కారణాలేమైనా.. గతంతో పోల్చితే అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయం తగ్గుముఖం పడుతోంది. అత్యంత విలువైన తబ్సి జిగురు, తిరుమాన్ జిగురు, తేనె, తేనెమైనం, ఎండు ఉసిరి పప్పు, నరమామిడి చెక్క, గచ్చకాయలు, విప్ప పలు కు, విప్పపువ్వు వంటి అరుదైన ఉత్పత్తులను సేకరించి జీసీసీకి విక్రయించడాన్ని గిరిజనులు చాలావరకు తగ్గించారు. ఇక అడవిలో విస్తారంగా ఉండే చింతపండు, కుంకుడుకాయలు, చింతగింజలు, నల్లజీడిగింజలు, కరక్కాయలు, గానుగ గింజలు, ముష్టిగింజలను సేకరిస్తున్నప్పటికీ.. జీసీసీకి అమ్మేం దుకు మాత్రం వెనుకాడుతున్నారు. జీసీ సీ నిబంధనల ప్రకారం డీఆర్ షాపుల సేల్స్మెన్లతోపాటు గ్రామాల్లో జీసీసీ అధికారులు తిరుగుతూ.. అటవీ ఉత్పత్తులను విక్రయించాలని చాటింపు వేయించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప సరైన గిట్టుబాటు ధర చెల్లించడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికొచ్చి ఎక్కువ ధర ఇస్తున్నారు..: గిరిజనులపై జీసీసీ సవతితల్లి ప్రేమ చూపుతుంటే దళారులు మాత్రం గిరిజనుల ఇళ్లకు వచ్చి మరీ అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ నిర్ణయించిన ధరకంటే కాస్త ఎక్కువగానే చెల్లిస్తున్నారు. ఈ సీజన్లో అధికంగా లభించే చింతపండు(గింజ తీయనిది)కు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.30 ధర పలుకుతుంటే.. అత్యంత నాణ్యమైన అడవి చింతపండుకు జీసీసీ చెల్లించేది రూ.15 మాత్రమే. అదీ డిపోకు మోసుకుపోయి.. అక్కడ సేల్స్‌మెన్ వచ్చేదాకా ఆగాలి.. డబ్బుల్లేవు, బియ్యం, సరుకులు తీసుకోవాలంటే చేసేదేమీ ఉండదు. కానీ గిరిజనుల ఇళ్ల ముందుకు వచ్చే దళారులు మాత్రం కిలోకు రూ.18 నుంచి 20 వరకు వెలకట్టి అప్పటికప్పుడే పైకం చెల్లిస్తున్నారు. దీంతో గిరిజనులు సేకరించిన చింతపండును దళారులకే విక్రయిస్తున్నారు. దీంతోపాటు మిగిలిన అటవీ ఉత్పత్తులను సైతం చాటుమాటుగా దళారులే కొనుగోలు చేస్తున్నారు. ఇలా జీసీసీ లక్ష్యం దెబ్బతీయడంతో పాటు తూకం లో మోసం చేస్తూ గిరిజనుల శ్రమను కూడా దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. జీసీసీ అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీసీసీ సేకరణ స్థాయిని పెంచి.. సంస్థ అభ్యున్నతితోపాటు గిరిజనుల శ్రమకు తగిన ధరను చెల్లించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో లోపించిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శ్రమకు తగిన ఫలితం వ చ్చేలా అధికారులు చూస్తే.. తాము సేకరించిన ఉత్పత్తులన్నీ జీసీసీకే విక్రయిస్తామని గిరిజనులు చెపుతున్నారు. ఈ విషయాన్ని జీసీసీ భద్రాచలం డీఎం వీరస్వామి దృష్టికి తీసుకువెళ్లగా తాను క్యాంపులో ఉన్నానని.. కొనుగోలు ధరల గురించి తనకు తెలియదని సమాధానం దాటవేశారు.