గిరిజనులకు ‘సహకారం’ ఏదీ ? | Tribals 'cooperation' none? | Sakshi
Sakshi News home page

గిరిజనులకు ‘సహకారం’ ఏదీ ?

Published Thu, May 8 2014 2:55 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM

గిరిజనులకు ‘సహకారం’ ఏదీ ? - Sakshi

గిరిజనులకు ‘సహకారం’ ఏదీ ?

అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అడవి తల్లినే నమ్ముకుని జీవించే గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం జీసీసీ(గిరిజన సహకార సంస్థ)ని ఏర్పాటు చేసింది. అయితే సంస్థ అధికారుల అనాలోచిత నిర్ణయాలు.. పర్యవేక్షణ  లోపం.. చిత్తశుద్ధి లేకపోవడంతో తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

ఏజెన్సీలో రేషన్ బియ్యం పంపిణీ  చేసేందుకు తప్ప జీసీసీ తమకు మరేవిధంగానూ ఉపయోగపడడం లేదని వారు వాపోతున్నారు. ఒకప్పుడు అడవిలో సేకరించిన పలు రకాల ఉత్పత్తులను జీసీసీ డిపోలకు తీసుకెళ్లి అమ్ముకుని.. బియ్యం, సరుకులు కొనుక్కునే వాళ్లమని.. ఇప్పుడు జీసీసీకి ఏమీ అమ్మాలనిపించడంలేదని అంటున్నారు.

తగ్గిన ఆదరణ...
 గిరిజనుల పట్ల జీసీసీ సిబ్బందికి.. జీసీసీ కొనుగోలు చేసే వస్తువుల సేకరణ పట్ల గిరిజనులకు ఆసక్తి తగ్గిపోయింది. కారణాలేమైనా.. గతంతో పోల్చితే అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయం తగ్గుముఖం పడుతోంది. అత్యంత విలువైన తబ్సి జిగురు, తిరుమాన్ జిగురు, తేనె, తేనెమైనం, ఎండు ఉసిరి పప్పు, నరమామిడి చెక్క, గచ్చకాయలు, విప్ప పలు కు, విప్పపువ్వు వంటి అరుదైన ఉత్పత్తులను సేకరించి జీసీసీకి విక్రయించడాన్ని గిరిజనులు చాలావరకు తగ్గించారు.

ఇక అడవిలో విస్తారంగా ఉండే చింతపండు, కుంకుడుకాయలు, చింతగింజలు, నల్లజీడిగింజలు, కరక్కాయలు, గానుగ గింజలు, ముష్టిగింజలను సేకరిస్తున్నప్పటికీ.. జీసీసీకి అమ్మేం దుకు మాత్రం వెనుకాడుతున్నారు. జీసీ సీ నిబంధనల ప్రకారం డీఆర్ షాపుల సేల్స్‌మెన్‌లతోపాటు గ్రామాల్లో జీసీసీ అధికారులు తిరుగుతూ.. అటవీ ఉత్పత్తులను విక్రయించాలని చాటింపు వేయించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప సరైన గిట్టుబాటు ధర చెల్లించడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటికొచ్చి ఎక్కువ ధర ఇస్తున్నారు..:
గిరిజనులపై జీసీసీ సవతితల్లి ప్రేమ చూపుతుంటే దళారులు మాత్రం గిరిజనుల ఇళ్లకు వచ్చి మరీ అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ నిర్ణయించిన ధరకంటే కాస్త ఎక్కువగానే  చెల్లిస్తున్నారు. ఈ సీజన్‌లో అధికంగా లభించే చింతపండు(గింజ తీయనిది)కు బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.30 ధర పలుకుతుంటే.. అత్యంత నాణ్యమైన అడవి చింతపండుకు జీసీసీ చెల్లించేది రూ.15 మాత్రమే.

అదీ డిపోకు మోసుకుపోయి.. అక్కడ సేల్స్‌మెన్ వచ్చేదాకా ఆగాలి.. డబ్బుల్లేవు, బియ్యం, సరుకులు తీసుకోవాలంటే చేసేదేమీ ఉండదు. కానీ గిరిజనుల ఇళ్ల ముందుకు వచ్చే దళారులు మాత్రం కిలోకు రూ.18 నుంచి 20 వరకు వెలకట్టి అప్పటికప్పుడే పైకం చెల్లిస్తున్నారు. దీంతో గిరిజనులు సేకరించిన చింతపండును దళారులకే విక్రయిస్తున్నారు. దీంతోపాటు మిగిలిన అటవీ ఉత్పత్తులను సైతం చాటుమాటుగా దళారులే కొనుగోలు చేస్తున్నారు. ఇలా జీసీసీ లక్ష్యం దెబ్బతీయడంతో పాటు తూకం లో మోసం చేస్తూ గిరిజనుల శ్రమను కూడా దోచుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా.. జీసీసీ అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీసీసీ సేకరణ స్థాయిని పెంచి.. సంస్థ అభ్యున్నతితోపాటు గిరిజనుల శ్రమకు తగిన ధరను చెల్లించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో లోపించిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శ్రమకు తగిన ఫలితం వ చ్చేలా అధికారులు చూస్తే.. తాము సేకరించిన ఉత్పత్తులన్నీ జీసీసీకే విక్రయిస్తామని గిరిజనులు చెపుతున్నారు. ఈ విషయాన్ని జీసీసీ భద్రాచలం డీఎం వీరస్వామి దృష్టికి తీసుకువెళ్లగా తాను క్యాంపులో ఉన్నానని.. కొనుగోలు ధరల గురించి తనకు తెలియదని సమాధానం దాటవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement