Gcc officials
-
గిరిజనుల ఉపాధికి జీసీసీ భరోసా
సాక్షి, అమరావతి: అడవినే నమ్ముకుని కొండ కోనల్లో నివసించే గిరిజనులకు రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అండగా నిలుస్తోంది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులతో పాటు పండించే పంటలను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలతో పాటు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సుమారు లక్షన్నర గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. గిరిజనులు జొన్న, సజ్జలు, రాగులు, కంది పంటలతో పాటు అక్కడక్కడా వరి పండిస్తున్నారు. తేనె, కుంకుళ్లు, చింతపండు, ఉసిరి తదితర అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. గిరిజనులు తమ గ్రామాలను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన 962 డిపోల ద్వారా ఆయా ఉత్పత్తులన్నిటినీ జీసీసీ కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.5.23 కోట్ల విలువైన 6,320.30 క్వింటాళ్ల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో మద్దతు ధరను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తోంది. కేవలం అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజన కుటుంబాలకు రూ.98.19 లక్షలు జీసీసీ ద్వారా అందాయి. కాఫీ రైతులకు ప్రోత్సాహం మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహంతో అనువైన చోట కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.21 కోట్ల విలువైన 2,005.16 క్వింటాళ్ల అరబికా ఫార్చెమెంట్, అరబికా చెర్రీ, రోబస్టా చెర్రీ రకం కాఫీ గింజలను జీసీసీ సేకరించింది. అదే సమయంలో 760 గిరిజన కాఫీ రైతు కుటుంబాలకు రూ.1.36 కోట్ల వ్యవసాయ పరపతి కల్పించింది. గిరిజనుల అవసరాలు తీర్చడంపై జీసీసీ దృష్టి కేంద్రీకరిస్తోంది. 16 పెట్రోల్ బంకులు, 10 ఎల్పీ గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 11,704.32 కోట్ల విలువైన పెట్రోల్, గ్యాస్, కందెనల అమ్మకాలు చేపట్టింది. అలాగే ‘గిరిజన్’ బ్రాండ్ కింద అటవీ ఉత్పత్తులతో తయారయ్యే సబ్బులు, కారం, పసుపు పొడుల వంటి వస్తువులకు రూ.16.01 కోట్ల విలువైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. 75 వన్‌ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస్ యోజన ద్వారా 21,280 మంది సభ్యులతో కూడిన 1,125 గ్రూపులతో 75 వన్‌ధన్ వికాస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీసీసీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రామాల్లోనే శుద్ధి (ప్రాసెసింగ్) చేయడం ద్వారా ఉత్పత్తులకు అదనపు విలువను జోడిస్తారు. ఈ విధంగా తయారైన వస్తువులను సభ్యులు తిరిగి జీసీసీకి లేదా తమకు ఇష్టమొచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ వన్‌ధన్ వికాస్ కేంద్రాలు కొత్తగా మరో 188 ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. -
గిరిజనులకు ‘సహకారం’ ఏదీ ?
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అడవి తల్లినే నమ్ముకుని జీవించే గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం జీసీసీ(గిరిజన సహకార సంస్థ)ని ఏర్పాటు చేసింది. అయితే సంస్థ అధికారుల అనాలోచిత నిర్ణయాలు.. పర్యవేక్షణ లోపం.. చిత్తశుద్ధి లేకపోవడంతో తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు తప్ప జీసీసీ తమకు మరేవిధంగానూ ఉపయోగపడడం లేదని వారు వాపోతున్నారు. ఒకప్పుడు అడవిలో సేకరించిన పలు రకాల ఉత్పత్తులను జీసీసీ డిపోలకు తీసుకెళ్లి అమ్ముకుని.. బియ్యం, సరుకులు కొనుక్కునే వాళ్లమని.. ఇప్పుడు జీసీసీకి ఏమీ అమ్మాలనిపించడంలేదని అంటున్నారు. తగ్గిన ఆదరణ... గిరిజనుల పట్ల జీసీసీ సిబ్బందికి.. జీసీసీ కొనుగోలు చేసే వస్తువుల సేకరణ పట్ల గిరిజనులకు ఆసక్తి తగ్గిపోయింది. కారణాలేమైనా.. గతంతో పోల్చితే అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయం తగ్గుముఖం పడుతోంది. అత్యంత విలువైన తబ్సి జిగురు, తిరుమాన్ జిగురు, తేనె, తేనెమైనం, ఎండు ఉసిరి పప్పు, నరమామిడి చెక్క, గచ్చకాయలు, విప్ప పలు కు, విప్పపువ్వు వంటి అరుదైన ఉత్పత్తులను సేకరించి జీసీసీకి విక్రయించడాన్ని గిరిజనులు చాలావరకు తగ్గించారు. ఇక అడవిలో విస్తారంగా ఉండే చింతపండు, కుంకుడుకాయలు, చింతగింజలు, నల్లజీడిగింజలు, కరక్కాయలు, గానుగ గింజలు, ముష్టిగింజలను సేకరిస్తున్నప్పటికీ.. జీసీసీకి అమ్మేం దుకు మాత్రం వెనుకాడుతున్నారు. జీసీ సీ నిబంధనల ప్రకారం డీఆర్ షాపుల సేల్స్మెన్లతోపాటు గ్రామాల్లో జీసీసీ అధికారులు తిరుగుతూ.. అటవీ ఉత్పత్తులను విక్రయించాలని చాటింపు వేయించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప సరైన గిట్టుబాటు ధర చెల్లించడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికొచ్చి ఎక్కువ ధర ఇస్తున్నారు..: గిరిజనులపై జీసీసీ సవతితల్లి ప్రేమ చూపుతుంటే దళారులు మాత్రం గిరిజనుల ఇళ్లకు వచ్చి మరీ అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ నిర్ణయించిన ధరకంటే కాస్త ఎక్కువగానే చెల్లిస్తున్నారు. ఈ సీజన్లో అధికంగా లభించే చింతపండు(గింజ తీయనిది)కు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.30 ధర పలుకుతుంటే.. అత్యంత నాణ్యమైన అడవి చింతపండుకు జీసీసీ చెల్లించేది రూ.15 మాత్రమే. అదీ డిపోకు మోసుకుపోయి.. అక్కడ సేల్స్‌మెన్ వచ్చేదాకా ఆగాలి.. డబ్బుల్లేవు, బియ్యం, సరుకులు తీసుకోవాలంటే చేసేదేమీ ఉండదు. కానీ గిరిజనుల ఇళ్ల ముందుకు వచ్చే దళారులు మాత్రం కిలోకు రూ.18 నుంచి 20 వరకు వెలకట్టి అప్పటికప్పుడే పైకం చెల్లిస్తున్నారు. దీంతో గిరిజనులు సేకరించిన చింతపండును దళారులకే విక్రయిస్తున్నారు. దీంతోపాటు మిగిలిన అటవీ ఉత్పత్తులను సైతం చాటుమాటుగా దళారులే కొనుగోలు చేస్తున్నారు. ఇలా జీసీసీ లక్ష్యం దెబ్బతీయడంతో పాటు తూకం లో మోసం చేస్తూ గిరిజనుల శ్రమను కూడా దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. జీసీసీ అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీసీసీ సేకరణ స్థాయిని పెంచి.. సంస్థ అభ్యున్నతితోపాటు గిరిజనుల శ్రమకు తగిన ధరను చెల్లించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో లోపించిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శ్రమకు తగిన ఫలితం వ చ్చేలా అధికారులు చూస్తే.. తాము సేకరించిన ఉత్పత్తులన్నీ జీసీసీకే విక్రయిస్తామని గిరిజనులు చెపుతున్నారు. ఈ విషయాన్ని జీసీసీ భద్రాచలం డీఎం వీరస్వామి దృష్టికి తీసుకువెళ్లగా తాను క్యాంపులో ఉన్నానని.. కొనుగోలు ధరల గురించి తనకు తెలియదని సమాధానం దాటవేశారు.