సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు రేషన్ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.
రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయి తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు–కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల–బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వారు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిలాల్లో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు.
ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణ
నెల్లూరు, తిరుపతి సహా తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాణ, పశు నష్టం జరిగినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ కూడా ప్రారంభం కావాలన్నారు.
రైతులకు కలెక్టర్ల భరోసా..
మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాలతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ల నుంచి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయికి వెళ్లింది. దగ్గరుండి సహాయక చర్యలను చేపట్టింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు కల్లాల్లో ధాన్యం గుట్టలను సందర్శించి అవి తడవకుండా టార్పాలిన్లు కప్పేలా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధైర్యపడాల్సిన అవసరంలేదని, మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు కలెక్టర్లు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment