చెన్నూర్ : వసతిగృహా విద్యార్థులకు మంచిరోజులు రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు దొడ్డు బియ్యానికి బదులు ఫైన్‌రైస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రాతిపాదనలు తయారు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 245 బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 41,381 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 50, ఎస్సీ 72, ఎస్టీ 123 చొప్పున బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయి.
ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు వచ్చే ఏడాది 2015 నుంచి సన్న రకం బియ్యంతో భోజనం పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలాల్లో ఉన్న వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో నివేదిక సమర్పించాలని తహశీల్దార్లకు మంచిర్యాల ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్ల వారీగా ఎంతకోటా బియ్యం అవసరమో నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అప్పగించారు.
తిండికి తిప్పలు ఉండదు
ప్రభుత్వం ప్రస్తుతం వసతి గృహాలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ బియ్యంతో విద్యార్థులు తిండికి తిప్పలు పడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం తినలేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు కొందరు ఈ భోజనం చేయలేక చదువులను మానేసిన ఘటనలు సైతం ఉన్నాయని పలువురు సంక్షేమాధికారులు చెప్పడం విశేషం. ప్రభుత్వం వసతి గృహాలకు ఫైన్ రైస్‌ను సరఫరా చేస్తే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు సన్న రకం బియ్యంతో భోజనం చేయనున్నారు.
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం
Published Sun, Dec 14 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement