BC welfare hostels
-
‘వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించం’
సాక్షి, విజయవాడ : బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన దారుణాలను ఖండిస్తున్నామని ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించమని హెచ్చరించారు. డిపార్ట్మెంట్లో వివక్షత ప్రస్తావన లేవనెత్తడం హేయమైన చర్య అన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు మహిళ కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లోని మహిళ ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో వార్డెన్లు సైతం కొంత మంది వేధిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు వాసిరెడ్డి పద్మ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రక్షణ కల్పించాలని సంకల్పించారని, మహిళ భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల్లోని మహిళ ఉద్యోగులతో చర్చించామని తెలిపారు. ఈ రోజు ముప్పై మంది మహిళా అధికారులు విచారించారని, మహిళ కమిషన్‌కు ప్రతి రోజు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మహిళ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. నేరస్థులకు ఇరవై ఒక రోజులో శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో మహిళ ఉద్యోగుల భద్రతకు జగన్ ప్రభుత్వం ఏళ్ల వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. -
బాత్రూంలో బడి బియ్యం
చంచల్‌గూడ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే వసతి గృహాల్లో విద్యార్థులకు వండిపెట్టాల్సిన సన్న బియ్యం బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని నాంపల్లి, గోషామహల్ వసతి గృహాలు యాకుత్ పురా నియోజకవర్గం కుర్మగూడలోని ఓ భవనంలో కొనసాగుతున్నాయి. పౌరసరఫరా శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహాల్లో సరుకులు, బియ్యం నిల్వలకు సంబంధించి సోదా లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న మధ్యాహ్నం కుర్మగూడ లోని వసతి గృహాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, వంటశాలను కూడా పరిశీలించారు. బాత్రూంలో 16 సంచుల బియ్యం. తనిఖీలు నిర్వహించిన అధికారులు అంతా సక్రమంగానే ఉందని నిర్థారణకు వచ్చారు. అయితే అధికారులు వెనుదిరిగిన అనంతరం భవనంలోని ఓ బాత్రూమ్లో 16 సంచుల బియ్యం దర్శనం ఇచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాత్రూమ్లో బియ్యం బస్తాలను గుర్తించిన విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తుంది. స్టోర్ రూమ్‌లో ఉండాల్సి బియ్యాన్ని బాత్రూమ్లోకి ఎందుకు తరలించారనే వాదన వినిపిస్తోంది. దీంతో హాస్టల్ వార్డన్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తుత్తి తనిఖీలేనా...? రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు వసతి గృహంలో చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిస్తోంది. దాదాపు 8 నుంచి 10 క్వింటళ్ల బియ్యం బాత్రూంలో నిల్వ చేసినా తనిఖీలకు వచ్చిన అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. అసలు వసతి గృహంలో తనిఖీలు జరుగుతున్నట్లు హాస్టల్ వార్డెన్‌కు ముందుగానే సమాచారం అందినట్లు తెలుస్తెంది. ఈ అంశంపై సివిల్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. తనిఖీలు జరిగాయి.. తనిఖీల విషయమై జిల్లా బీసీ సంక్షేమాధికారి విమలాదేవిని ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్లో సంప్రదించగా కుర్మగూడలోని (నాంపల్లి, గోషామహాల్) వసతి గృహాల్లో ఈ నెల 13న సివిల్ సప్లయ్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే దీనిపై కమిషనర్‌కు నివేదిక అందజేస్తారని ఆమె వివరించారు.–విమలాదేవి,జిల్లా బీసీ సంక్షేమ అధికారి -
బీసీ హాస్టళ్లలో నిఘా నేత్రం
సత్తుపల్లిటౌన్: ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెనూ సక్రమంగా అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాలోని 24 బీసీ హాస్టళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 26 హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 18 హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. మిగతా బీసీ హాస్టళ్లలో వారం రోజుల్లో అమర్చేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో హాస్టల్లో ఆరు సీసీ కెమెరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ హాస్టళ్లు ఇక సీసీ నిఘాతో పని చేయనున్నాయి. బీసీ హాస్టల్లోని విద్యార్థులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసింది. ఒక్కో హాస్టల్లో ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, మరుగుదొడ్లు, కిచెన్, ఆఫీస్రూం, డైనింగ్ హాల్ ఆరు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బీసీ హాస్టల్లో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు..? సంక్షేమ అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంతో సీసీ కెమెరాలను ఆన్లైన్ అనుసంధానం చేశారు. సెట్విన్ కంపెనీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు చేపడుతున్నారు. అక్రమాలకు చెక్ హాస్టళ్లలో సంక్షేమ అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు, విద్యార్థుల హాజరును ఇకపై ఉన్నతాధికారులు నిఘా నేత్రాల సహకారంతో ఆన్లైన్లోనే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా హాస్టల్లోకి ఇతర వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా..? హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్తున్నారా?, స్టోర్ రూంలో సరుకుల నిల్వలు, కిచెన్‌లో వంట పనుల తీరు, ఇలా సమగ్రంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. దీనివల్ల హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
నిధులు కరువు.. లేదు అరువు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు సంకటంలో పడ్డాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 776 పాఠశాల వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది చిన్నారులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్న భోజనం మాత్రం పాఠశాలల్లో తీసుకుంటారు. ఈ క్రమంలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనంతోపాటు పాలు, చిరుతిళ్లకు సంబంధించిన బిల్లులను సదరు హాస్టల్ వార్డెన్‌కు ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. 82కోట్లు బకాయిలు బీసీ సంక్షేమ హాస్టళ్లలో బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెద్దగా నిధులివ్వలేదు. ప్రాధాన్యత క్రమంలో కొన్ని హాస్టళ్లకు నిధులిచ్చినప్ప టికీ వాటిని గతేడాది బకాయిల తాలూకు బిల్లులుగా చెల్లించినట్లు వసతిగృహ సంక్షేమాధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం బీసీ హాస్టళ్లకు సంబంధించి రూ.82 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా మెస్ చార్జీలకు సం బంధించినవే ఉన్నాయి. ఇవిగాకుండా వసతిగృహ నిర్వ హణ కేటగిరీలోనూ బకాయిలు భారీగానే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలతోపాటు హాస్టల్ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించిన బిల్లులు సైతం ఆర్నెల్లుగా అందలేదు. మెస్ చార్జీలతో పాటు ఇతర బిల్లులేవీ రాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులకు ఇబ్బం దులు తీవ్రమయ్యాయి. వరుసగా 5నెలల బిల్లులు రాకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ భారమవుతోంది. విద్యార్థులకు క్రమం తప్పకుండా స్నాక్స్, భోజనం ఇచ్చేందుకు కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొసు ్తన్నారు. 5 నెలలుగా సరుకులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా దుకాణదారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు కూరగాయల కొనుగోలుపైనా ఇదే ప్రభావం పడింది. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వక పోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తోందని రం గారెడ్డి జిల్లాకు చెందిన ఓ వసతి గృహ సంక్షేమాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు గత పది నెలలుగా కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. కేసీఆర్ కిట్ల పేరుతో ప్రత్యేకంగా కాస్మెటిక్ కిట్లు ఇస్తామని అధి కారులు ప్రకటిం చినప్పటికీ, అవి కేవలం గురుకులాలకు మాత్రమే పరిమితమయ్యాయని, హాస్టల్ విద్యార్థులకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వసతిగృహ నిర్వహణ నిధులు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులను కలిసి వినతులు సమర్పిం చినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. -
కంచానికీ.. కరువాయె...!
జనాభాలో అధిక శాతం కలిగిన బీసీ విద్యార్థుల సంక్షేమం అటకెక్కింది. బీసీ హాస్టళ్లలో ఉంటున్న వారికి ప్లేట్లు, గ్లాసులు, ట్రంకుపెట్టెలను కూడా పాలకులు అందించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప రూరల్: జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల హాస్టళ్లు మొత్తం 57 ఉన్నాయి. అందులో 6 వేల మంది బాల బాలికలు ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి నాలుగు జతల దుస్తులు, ఒక విద్యార్థికి ఒక ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. పౌష్టికాహరాన్ని అందించాలి. విద్యాభివృద్ధికి కృషి చేయాలి. అయితే ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహకారం లభించడంలేదు. ఏడాది దాటినా ... విద్యార్థులకు అందించే ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది.గడువు దాటగానే కొత్తవి అందించాలి. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం వాటికి నిధులను కేటాయించలేదు. ప్రభుత్వం నిధులను కేటాయిస్తేనే ఆ శాఖ అధికారులు టెండర్ల ద్వారా వాటిని తీసుకొని విద్యార్ధులకు అందజేస్తారు. అయితే అలా జరగడంలేదు. కాలం చెల్లిన వాటితోనే... సాధారణంగా హాస్టళ్లకు సరఫరా చేసే వస్తువులు నాసిరకంతో ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో సరఫరా చేసిన ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు కూడా దాదాపు నాసిరకానివి అనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్టలకు ఉన్న చిలుకులు ఊడిపోయాయి. దీంతో చాలా మంది విద్యార్థులు తమ ఇంటి నుంచే వస్తువులు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది పాత వాటితోనే సర్దుకుపోతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా బీసీ విద్యార్ధుల సంక్షేమం ఇలా కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బడ్జెట్ రాగానే చర్చలు చేపడుతాం.. నేను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా గడిచిన ఏప్రెల్‌లో బాధ్యతులు చేపట్టాను. అప్పుడే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇందుకు సంబంధించి నిధులు విడుదల కాగానే చర్యలు చేపడుతా.– లక్ష్మీకాంతమ్మ,జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి. -
బీసీలను ఓట్లేసే మిషన్లుగానే చూశాయి: కర్నె
హైదరాబాద్: ప్రముఖ రచయత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సి.నారాయణరెడ్డి మృతికి టీఆర్ఎస్ఎల్పీ తరపున ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గత పాలకులంతా బీసీలను ఓటేసే మర యంత్రాలుగా చూశారని, ఓబీసీ కమీషణ్‌కు చట్టబద్దత తేవాలని ప్రయత్నిస్తే రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీసీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురకుల పాఠశాలలు ప్రారంభిస్తుండడం చారిత్రాత్మకం అన్నారు. కాంగ్రెస నేతలది మాత్రం ఓట్ల రాజకీయ విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన కోదండరాం అపద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం ఏఆధారాలతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ప్రశ్నించారు. కోదండరాం మాటలు కాంగ్రెస్ మాటలకు జిరాక్స్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మియాపూర్ కుంభకోణాన్ని ప్రభుత్వమే వెలుగులోకి తెచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బీసీ హాస్టళ్లకు సండే స్పెషల్
⇒ ఆదివారాలు, పండుగ రోజుల్లో మాంసాహారం వడ్డన ⇒ ఉత్తర్వులు జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్: బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకో శుభవార్త. హాస్టళ్లలోని విద్యార్థులందరికీ ఆదివారం, పండుగ వేళల్లో మాంసాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ జి.డి. అరుణ సెప్టెంబర్ 26వ తేదీన అన్ని జిల్లాల డిప్యూటీ డెరైక్టర్లు, సంక్షేమ అధికారులకు మెమో (నెంబర్ డి/2080/2016) జారీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సెప్టెంబర్ 1వ తేదీన మంత్రి జోగు రామన్నను కలిసి విద్యార్థులకు మాంసాహారం వడ్డించే అంశంపై చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందజేయగా, మంత్రి అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి రామన్న ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 470 ప్రి మెట్రిక్, 252 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు అన్నింటిలో అందుబాటులో ఉన్న బడ్జెట్లో మాంసాహారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ కమిషనర్ ఆదేశాలు కార్యరూపం దాలిస్తే దసరా సెలవుల తరువాత హాస్టళ్లలోని విద్యార్థులకు ఆదివారాలు, పండుగ రోజుల్లో మాంసాహారంతో చేసిన పదార్థాలు అందుబాటులో ఉంటాయి. -
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం
చెన్నూర్ : వసతిగృహా విద్యార్థులకు మంచిరోజులు రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు దొడ్డు బియ్యానికి బదులు ఫైన్‌రైస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రాతిపాదనలు తయారు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 245 బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 41,381 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 50, ఎస్సీ 72, ఎస్టీ 123 చొప్పున బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు వచ్చే ఏడాది 2015 నుంచి సన్న రకం బియ్యంతో భోజనం పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలాల్లో ఉన్న వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో నివేదిక సమర్పించాలని తహశీల్దార్లకు మంచిర్యాల ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్ల వారీగా ఎంతకోటా బియ్యం అవసరమో నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అప్పగించారు. తిండికి తిప్పలు ఉండదు ప్రభుత్వం ప్రస్తుతం వసతి గృహాలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ బియ్యంతో విద్యార్థులు తిండికి తిప్పలు పడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం తినలేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు కొందరు ఈ భోజనం చేయలేక చదువులను మానేసిన ఘటనలు సైతం ఉన్నాయని పలువురు సంక్షేమాధికారులు చెప్పడం విశేషం. ప్రభుత్వం వసతి గృహాలకు ఫైన్ రైస్‌ను సరఫరా చేస్తే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు సన్న రకం బియ్యంతో భోజనం చేయనున్నారు. -
చండ్రుగొండలో అదృశ్యం... తిరుపతిలో ప్రత్యక్షం..
చండ్రుగొండ, న్యూస్‌లైన్: స్థానిక బీసీ సంక్షేమ హాస్టల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండు రోజుల క్రితం అదృశ్యమై తిరుపతికి వెళ్లినట్లు తెలిసింది. సోమవారం పాఠశాలకు వచ్చిన వీరు మధ్యాహ్న భోజన సమయం నుంచి కన్పించకుండా పోయారు. ఈ విషయంపై వారి తల్లిదండ్రులు మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చండ్రుగొండ గ్రామానికి చెందిన పల్లోజి వంశీకృష్ణ, దోరేపల్లి నాగేంద్రబాబు, లక్ష్మీశెట్టి సాయిఫణికుమార్లు స్థానిక బీసీ సంక్షేమ హాస్టల్లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి పాఠశాలకని చెప్పి వెళ్లారు. కానీ మధ్యాహ్నం నుంచి పాఠశాలకు మాత్రం రాలేదని ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు. అసలు దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి వసతి గృహానికే రాలేదని వార్డెన్ శ్రీధర్ తెలిపారు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు దర్యాప్తు చేపట్టారు. లభించిన ఆచూకీ... రెండు రోజుల క్రితం అదృశ్యమైన వీరు తిరుపతిలో ఉన్నట్లు తెలిసింది. వీరు ముగ్గురు తిరుపతి రైల్వే పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. దీంతో అక్కడి పోలీసులు వీరిని విచారించగా పేర్లతో సహా చిరునామాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో రైల్యే పోలీసులు వారిని తిరుపతి - మచిలీపట్నం రైలులో ఎక్కించి విజయవాడలో పోలీసులకు అప్పగించాలని కోరినట్లు ట్రైన్ టీసీ శివారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటీన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.