
సాక్షి, విజయవాడ : బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగిన దారుణాలను ఖండిస్తున్నామని ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించమని హెచ్చరించారు. డిపార్ట్‌మెంట్‌లో వివక్షత ప్రస్తావన లేవనెత్తడం హేయమైన చర్య అన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు మహిళ కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లోని మహిళ ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో వార్డెన్‌లు సైతం కొంత మంది వేధిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు వాసిరెడ్డి పద్మ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రక్షణ కల్పించాలని సంకల్పించారని, మహిళ భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల్లోని మహిళ ఉద్యోగులతో చర్చించామని తెలిపారు. ఈ రోజు ముప్పై మంది మహిళా అధికారులు విచారించారని, మహిళ కమిషన్‌కు ప్రతి రోజు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మహిళ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. నేరస్థులకు ఇరవై ఒక రోజులో శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో మహిళ ఉద్యోగుల భద్రతకు జగన్ ప్రభుత్వం ఏళ్ల వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment