బీసీ హాస్టళ్లకు సండే స్పెషల్
⇒ ఆదివారాలు, పండుగ రోజుల్లో మాంసాహారం వడ్డన
⇒ ఉత్తర్వులు జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ కమిషనర్
హైదరాబాద్: బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకో శుభవార్త. హాస్టళ్లలోని విద్యార్థులందరికీ ఆదివారం, పండుగ వేళల్లో మాంసాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ జి.డి. అరుణ సెప్టెంబర్ 26వ తేదీన అన్ని జిల్లాల డిప్యూటీ డెరైక్టర్లు, సంక్షేమ అధికారులకు మెమో (నెంబర్ డి/2080/2016) జారీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సెప్టెంబర్ 1వ తేదీన మంత్రి జోగు రామన్నను కలిసి విద్యార్థులకు మాంసాహారం వడ్డించే అంశంపై చర్చించారు.
ఈ మేరకు వినతిపత్రం అందజేయగా, మంత్రి అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి రామన్న ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 470 ప్రి మెట్రిక్, 252 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు అన్నింటిలో అందుబాటులో ఉన్న బడ్జెట్‌లో మాంసాహారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ కమిషనర్ ఆదేశాలు కార్యరూపం దాలిస్తే దసరా సెలవుల తరువాత హాస్టళ్లలోని విద్యార్థులకు ఆదివారాలు, పండుగ రోజుల్లో మాంసాహారంతో చేసిన పదార్థాలు అందుబాటులో ఉంటాయి.