మాంసాహారం లేనిరోజుల్లో నిత్యం గుడ్డు
శాకాహారులకు వేరుగా ఆహారం
సంక్షేమ విద్యార్థులకు సరికొత్త మెనూ
ప్రారంభించిన సీఎం, మంత్రులు
నిర్దేశించిన ప్రకారం భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా డైట్ చార్జీలను ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలకు తగినట్లుగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేలా సరికొత్త మెనూ రూపొందించింది. ప్రతి నెలను నాలుగు వారాలుగా విభజిస్తూ... ఒక్కో వారానికి ఓ విధంగా మెనూను తయారు చేసింది.
అదేవిధంగా రోజువారీగా ఇవ్వాల్సిన ఆహారపదార్థాలపైనా మెనూలో స్పష్టత ఇచ్చిoది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, స్వల్పకాల విరామంలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించే విధంగా మెనూ పొందుపర్చింది. నెలలలో ఆరుసార్లు నాన్‌వెజ్ వడ్డిస్తారు. ప్రతి నెలా మొదటి బుధవారం, నాలుగో బుధవారం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం మాంసాహారాన్ని వడ్డిస్తారు. ఇక ప్రతి రెండో బుధవారం, నాల్గో బుధవారం మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ బిర్యానీ ఇస్తారు.
మాంసాహారం లేని రోజుల్లో నిత్యం ఉడికించిన గుడ్డు లేదా గుడ్డు కూరను అందించనున్నారు. శాకాహారులకు మాత్రం మాంసాహారం ఉన్న రోజుల్లో మెనూలో కాస్త మార్పులు చేసి వారికి మీల్‌మేకర్ ఫ్రై లేదా కర్రీ అందిస్తారు. నూతన మెనూను వసతిగృహాలు, గురుకులాల్లోని డైనింగ్ హాల్‌లో ప్రదర్శించాలని ప్రభుత్వం సంక్షేమ శాఖలను ఆదేశించింది.
నిర్దేశించిన ప్రకారం భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త మెనూను సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో శనివారం నుంచే అమలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా కామన్‌డైట్‌ను ప్రారంభించడంతోపాటు ఆయా హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు.
40 శాతం పెరిగిన డైట్ చార్జీలు
సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చివరిసారిగా డైట్ చార్జీలు 2017లో అప్పటి ప్రభుత్వం పెంచింది.
కోవిడ్–19 తర్వాత మారిన పరిస్థితులు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సంక్షేమ విద్యార్థులకు ఆహారం అందించడంలో నాణ్యత తగ్గుతూ వచ్చిoది. ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు. కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా డైట్ చార్జీలను 40శాతం పెంచారు. అలాగే, కాస్మెటిక్ చార్జీలనూ పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
సంక్షేమ వసతి గృహాల్లో 3 నుంచి 7వ తరగతి వరకున్న విద్యార్థులు : 2,77,877
8 నుంచి 10వ తరగతి వరకున్న విద్యార్థులు: 2,59,328
ఇంటర్ నుంచి పీజీ వరకున్న విద్యార్థులు: 2,28,500
Comments
Please login to add a commentAdd a comment