
కొందరు వ్యాపారుల ఇష్టారాజ్యం
అనారోగ్యంతో ఉన్న, మృతి చెందిన జీవాల వధ
విక్రయాల్లో అడుగడుగునా దగానే!
ధరను పెంచి అడ్డగోలుగా అమ్మకాలు
చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం
కర్నూలు(అగ్రికల్చర్): మాంసం లేనిదే నాన్ వెజ్ ప్రియులకు ముద్ద దిగదు. కొందరు ఆదివారం కోసం ఎదురు చూస్తుంటారు. మరి కొందరు వారంలో రెండు, మూడు రోజులు మాంసాహారమే తీసుకుంటారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇటీవల మటన్ తినేవారు ఎక్కువయ్యారు. అయితే అడిగిందే ఇస్తున్నారా.. ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను కోస్తున్నారా.. ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల నాణ్యతలేని మటన్‌ను ధర పెంచి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నిబంధనలు బేఖాతర్..
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో దేవరలు జరుగుతుండటంతో మటన్‌కు డిమాండ్ పెరిగింది. ఒక మోస్తరు గ్రామంలో దేవర జరుగుతుందంటే 2,000, పెద్ద గ్రామంలో అయితే 4,000 వరకు జీవాలు కట్ అవుతాయి. దీనినే అవకాశంగా తీసుకొని అనారోగ్యానికి గురైన వాటిని కూడా వ్యాపారులు మాంసానికి వినియోగిస్తున్నారు. ధర పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మటన్ కొనలేకపోతున్నారు. నిబంధనలు పాటించకుండా కొందరు మాంసం వ్యాపారులు మోసం చేస్తున్నారు. మాంసానికి వినియోగించే జీవాల ఆరోగ్యాన్ని నిబంధనల ప్రకారం శానిటరీ ఇన్‌స్పెక్టర్, పశు సంవర్ధక శాఖ వైద్యుడు పరిశీలించాలి. వీరి పర్యవేక్షణలో వధించిన మాంసంపై ముద్ర (రౌండ్ సీల్) వేసినది మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.
నిబంధనలు పాటించే విధంగా నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చొరువ తీసు కోవాల్సి ఉంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు తనిఖీలు చాలా తక్కువ చేస్తున్నారు. దీంతో సగానికిపైగా వ్యాపారులు ఇళ్లు, దుకాణాల వద్దనే గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను వధిస్తున్నారు. అంతేకాకుండా రోగాల బారినపడినవి, వయసు పైబడిన వాటిని కూడా వధించి విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. ముఖ్య పట్టణాల్లో లైసెన్సు కలిగిన దుకాణాల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన, మురికి కాలువల పక్కన అపరిశుభ్ర వాతావరణంలోనే అమ్మకాలు సాగిస్తున్నారు. ధరల వివరాల పట్టిక కనిపించకపోయినా ఎవరూ అడగడం లేదు.
వినియోగం ఇలా..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 80 శాతం అంటే 12 లక్షల కుటుంబాలు మాంసాహారాన్ని ఇష్టంగా తీసుకుంటాయి. ఇందులో 60 శాతం కుటుంబాలు (7.20 లక్షలు) చికెన్‌తో సరిపుచ్చుకుంటాయి. మిగిలిన 4.80 లక్షల కుటుంబాలు మటన్ తీసుకుంటాయి. వారం విడిచి వారం కిలో ప్రకారం వినియోగించినా... 24 వేల టన్నుల వరకు మాంసం అవసరమవుతోంది. బర్డ్‌ప్లూ తర్వాత హోటళ్లలో చికెన్ వినియోగం కొంతవరకు తగ్గింది. మటన్‌పై వినియోగదారులు దృష్టి పెట్టారు. కొన్ని హోటళ్లలో వినియోగించే మటన్ నాణ్యత కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.
పెరిగిన ధరలు..
బర్డ్‌ప్లూ వెలుగు చూసిన తర్వాత కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో మటన్ కిలో ధర రూ.900 పెంచేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో కిలో రూ.1000 వరకు అమ్ముతున్నారు. ఇంత ధర పెట్టినప్పటికి మాంసంలో నాణ్యత ఉంటుందా అంటే అదీ లేదు. పరీక్షలు లేవు... వధించింది పొట్టేలా..గొర్రెనా.. మేకనా.. అనేది తెలియదు. కొన్ని చోట్ల అనార్యాగంతో అపుడో, ఇపుడో చనిపోయే వాటిని కూడా మాంసానికి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో మరణించిన జీవాలను కూడా కొందరు వ్యాపారులు మాంసానికి వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఇలా చేయాలి...
⇒ మురుగు కాలువల సమీపంలో, అపరిశుభ్ర వాతావారణం ఉన్న దుకాణాల్లో మాంసం తీసుకోవద్దు.
⇒ మాంసానికి వినియోగిస్తున్న జీవాలు ఆరోగ్యంగా ఉంటున్నాయా... అనే దానిని పట్టించుకోవాలి.
⇒ అధికారుల ముద్ర (రౌండ్ సీల్) వేసిన మాంసం మాత్రమే విక్రయించాలి. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన దానిని అస్సలు కొనొద్దు.
⇒ తూకం వేసేటప్పుడు పరిశీలించాలి. అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment