సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్‌పై రైతులు పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఆరంభమై ఇరవై రోజులైనా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో రైతులు ఆశలు వదులుకుంటున్నారు. బోనస్ లేక ప్రోత్సాహకాలకు కేంద్రం విధించిన నిబంధనలు అడ్డుగా మారడం, అదనంగా ఒక్క రూపాయి చెల్లించినా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తామన్న హెచ్చరికలతో ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లే ధైర్యం చేయట్లేదు. భారీగా వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్ర ఆహారసంస్థ చేతులెత్తేస్తే, రాష్ట్రంపై పెనుభారం పడే అవకాశాలుండటంతో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువేనని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి.
పుంజుకోని కొనుగోళ్లు
రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి 85.69 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాలని లక్ష్యం. 6,491 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటివరకు 3,600 కేంద్రాలు ప్రారంభించారు. వీటి ద్వారా 1.52 లక్షల మంది రైతుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించారు. రోజూ 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులకు మించి సేకరణ జరగట్లేదు. ఇప్పటికే చాలా జిల్లాలో వరికోతలు పుంజుకున్నా సన్నాలకు ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధంతో రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తేవట్లేదు. దీంతో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు మాత్రమే కేంద్రాలకు వచ్చాయి.
ప్రస్తుతం చాలా రకాల సన్నాలకు క్వింటాలుకు రూ.1,888 చెల్లిస్తున్నారు. భువనగిరి, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 17 శాతానికి మించి తేమ ఉందని, తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు రూ.1,700కే కొంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో రూ.1,868 ధర చెబుతున్నా తేమ 17 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, ధాన్యం రంగుమారినా, తాలు, చెత్త ఎక్కువగా ఉన్నా క్వింటాల్‌కు 3–4 కిలోల చొప్పున తీసేస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 60 కిలోల మేర తరుగుపోతోంది. గతంలో ఎకరాకు 22–25 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, ఈ ఏడాది దోమకాటుతో 15 క్వింటాళ్లకు మించి దిగుబడి లేదు. దీంతో సన్నాలకు రూ.2,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రంగు మారిన సన్నరకం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడం మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
‘బోనస్’ ఆశ నిరాశేనా?
ఇటీవల రైతు వేదికల ప్రారంభం సందర్భంగా సన్నాలకు రూ.100 లేక రూ.150 బోనస్ ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నాలు 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరించాలని లక్ష్యం. క్వింటాలుకు రూ.100 బోనస్ ప్రకటించినా ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. అయితే, కేంద్రం నిబంధనల వల్ల బోనస్ ప్రకటన సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక, దీపావళికి ముందు రోజు జరిగిన భేటీలోనూ సన్నాలకు బోనస్‌పై చర్చ జరిగినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
రాష్ట్రం సేకరించే వరి ధాన్యానికి తాము నిర్ణయించిన ధరకు అదనంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలు ఇవ్వదలిస్తే ఆ భారాన్ని రాష్ట్రమే మోయాల్సి ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. ధాన్యానికి మద్దతు ధరకంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలను చెల్లిస్తే రాష్ట్రం మొత్తంగా సేకరించాల్సిన ధాన్యంలో సెంట్రల్‌పూల్ కింద సేకరించాల్సిన ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు తాము సేకరిస్తామని, మిగతా ధాన్యాన్ని సేకరించబోమని తేల్చిచెప్పింది. ఈ షరతులే రాష్ట్రానికి గుదిబండగా మారాయని నాటి భేటీలో కేబినెట్ అభిప్రాయపడినట్టు తెలిసింది.
సెంట్రల్‌పూల్ కింద సేకరించే ధాన్యానికి మాత్రమే ఆర్‌బీఐ రుణం పరిమితం కావాలని ఒప్పందపత్రంలో కేంద్రం షరతు విధించింది. దీని ప్రకారం రాష్ట్రం సేకరించే అదనపు ధాన్యానికి రుణాలు తీసుకొనే వెసులుబాటు ఉండదని పౌర సరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుతం సెంట్రల్‌పూల్ కింద నిర్ణయించిన మేరకు ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తోంది. మిగతా ధాన్యాన్ని రాష్ట్రం కొని బియ్యంగా మార్చి ఇస్తే దాన్ని ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ దానికి సంబంధించిన డబ్బును రాష్ట్రానికి ఇస్తోంది. అయితే ప్రస్తుతం మద్దతు ధరకన్నా ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినా కేవలం తాము సెంట్రల్‌పూల్ కింద కొనాల్సిన దాన్నే కొంటామని, మిగతా ధాన్యంతో తమకు సంబంధం ఉండదని కేంద్రం చెబుతోంది. ఇక్కడే సన్నాలకు బోనస్ ఇద్దామన్నా, ప్రోత్సాహకం ఇద్దామన్నా సమస్య ఎదురవుతోంది’అని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment