
భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుక
పట్టువ్రస్తాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి పర్యటన, ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బంది పడిన భక్తులు
నేడు శ్రీరాముడికి పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా సాగింది. తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకలకు హాజరై జానకి రాములకు పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాచలం తరలివచ్చారు.
12:01 గంటలకు అభిజిత్ లగ్నంలో..
జై శ్రీరామ్ నినాదాల మధ్యన సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఉదయం పది గంటల సమయంలో మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ముందుగా కల్యాణ వేడుకకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా విష్వక్సేన పూజ చేశారు. ఆ తర్వాత పుణ్యవాచనం, శ్రీయోద్వాహం, యో్రక్తాబంధనం, అలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:01 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో వధూవరులైన సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు.
12:13 గంటల సమయంలో మాంగళ్య ధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాల వేడుక నిర్వహించారు. చివరిగా మధ్యాహ్నం 12:36 గంటల సమయంలో హారతి ఇవ్వడంతో పెళ్లి తంతు ముగిసింది. సీఎంతో పాటు ఆయన సతీమణి గీత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు.
నేడు పట్టాభిషేకం..
సోమవారం శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది. కల్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ జిషు్ణదేవ్ వర్మ ముఖ్య అతిథిగా రానున్నారు.
తలంబ్రాలపై శ్రీరామ నామం
జనగామ: జనగామకు చెందిన కె.శ్రీలత శ్రీరామ నవమిని పురస్కరించుకొని వారం రోజులు కష్టపడి 5,100 బియ్యం గింజల (తలంబ్రాలు)పై శ్రీరామ సూక్ష్మ అక్షరాలు రాసి వేద పండితులకు అందజేశారు.
భక్తులకు ట్రాఫిక్ ఇక్కట్లు..
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:20 గంటల వరకు మొత్తంగా 3.20 గంటల పాటు ముఖ్యమంత్రి భద్రాచలంలో ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసుల ఆంక్షలు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. 3:30 గంటలకు ఆంక్షలు ఎత్తివేయడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచి్చన వాహనాలతో పట్టణంలో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
రాములోరికి తలంబ్రాలు సమర్పించిన ముస్లిం అధికారి
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీసీతారాముల కల్యాణ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ నుంచి తలంబ్రాలు తీసుకొచ్చే ఆనవాయితీ ఉంది. అయితే స్థానిక తహసీల్దార్ ఖయ్యూం ఈ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నారు. దీంతో ఆదివారం ఆయన కులమత భేదాలను పక్కనపెట్టి తలంబ్రాలను తీసుకొచ్చి రాములోరి వివాహంలో పాల్గొన్నారు.

రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం
వేములవాడలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం
భారీగా తరలివచ్చిన భక్తజనం
వేములవాడ: హరిహర క్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి జాతరను తలపించేలా దాదాపు లక్షన్నరకుపైగా భక్తులు హాజరయ్యారు. శనివారం రాత్రికే వేములవాడ చేరుకున్న భక్తులు, వసతి గదులు దొరక్క రోడ్లపైనే తలదాచుకున్నారు.
వేములవాడలోని వీధులన్నీ భక్తజనంతో సందడిగా మారాయి. మున్సిపాలిటీ తరఫున కమిషనర్ అన్వేశ్, అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్‌రెడ్డి, ఆలయ అర్చకులు పట్టువ్రస్తాలు అందించారు.
ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివపార్వతులు నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలంతో, అక్షింతలు చల్లుకుంటూ రాజన్నను వివాహమాడారు. గుడిచెరువు ఖాళీ స్థలంలో 25వేల మందికి ఉచిత అన్నదానం అందించారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, తదితరులు హాజరయ్యారు.
కిక్కిరిసిన యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామనవమితో పాటు ఆదివారం సెలవు రోజు కలిసి రావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు, ముఖ మండపం, బస్టాండ్, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు.
దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, వీఐపీ దర్శనానికి 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కాగా వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.29,36,468 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.