
వసతుల లేమితో సామాన్య భక్తుల ఇక్కట్లు
ప్రధాన ఉత్సవాల సమయంలో కష్టాలు డబుల్
సిబ్బంది, ప్రముఖులకే వసతి గదులు, కాటేజీలు
పదేళ్లయినా అమలుకు నోచుకోని మాస్టర్ ప్లాన్
6న సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్ రాక
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ఘనతకెక్కిన భద్రాచలంలో రాములోరి భక్తులకు సీతమ్మ కష్టాలు తప్పటం లేదు. శతాబ్దాలుగా పెద్దగా అభివృద్ధికి నోచుకోకపోవటంతో ప్రధాన ఉత్సవాల సమయంలో తరలివచ్చే లక్షల మంది భక్తులకు మౌలిక వసతులలేమి తీవ్ర సమస్యగా మారుతోంది. శ్రీరామ నవమి వంటి ఉత్సవాల సమయంలో సామాన్య భక్తులకు కనీసం తలదాచుకొనేందుకు చోటు లేక గోదావరి ఇసుక తిన్నెలు, కరకట్ట వెంట సేద తీరాల్సి వస్తోంది.
17వ శతాబ్దంలో కుతుబ్‌షాహీల కాలంలో భద్రగిరిపై కంచర్ల గోపన్న నిర్మించిన ఆలయం ప్రధాన గోపురానికి కొద్దిపాటి మార్పులు తప్ప పూర్తిస్థాయిలో దేవస్థానాన్ని ఆధునీకరించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్ట ఆలయంతో పాటు భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది. ప్రముఖ అర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్ సైతం సిద్ధం చేశారు. కానీ, అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. అదే సమయంలో యాదగిరిగుట్ట ఆలయ పునఃనిర్మాణం మాత్రం పూర్తయింది.
మాస్టర్‌ప్లాన్‌లో మళ్లీ కదలిక
పదేళ్లుగా మూలన పడిన మాస్టర్ ప్లాన్‌ను కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు మళ్లీ బయటికి తీసింది. ఈ నెల 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పట్టువ్రస్తాలు సమర్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిలో ప్రధానమైన మాడ వీధుల విస్తరణకు భూ, ఇళ్ల నిర్వాసితుల పరిహారం కోసం ప్రభుత్వం రూ.34 కోట్లు విడుదల చేసింది. ఈ అభివృద్ధి పనులకు 6న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశముంది. మాస్టర్‌ప్లాన్‌లో ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాలు, మౌలిక వసతులకు చోటు కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
వసతులు కల్పిస్తే మరింత ఆదరణ
ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తే భద్రాచలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. భద్రాచలంలో ఏటా ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వీటికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతోపాటు భద్రాచలం ఏజెన్సీలో ప్రకృతి అందాల వీక్షణకు పర్యాటకులు వస్తున్నారు. కానీ, సరిపడా వసతులు లేక వారు ఇబ్బందులు పడుతున్నా రు.
ఉత్సవాల సమయంలో భద్రాచలంలోని వసతి గదులు ముప్పావు భాగం విధుల కోసం వచ్చే సిబ్బందికే సరిపోతా యి. కాటేజీలు దాతలకు, వీఐపీలకే పరిమితం. దీంతో రెండురోజుల వసతి కోసం ప్రైవేటు లో రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించలే ని సామాన్య భక్తులు గోదావరి ఇసుక తిన్నెలు, కరకట్ట ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. ప్రధాన ఆలయం, గోదావరి, ఉపాలయాలను కలిపి స్పెషల్ కారిడార్ రూపొందిస్తే భక్తులు, పర్యాటకుల రాక పెరుగుతుందని స్థానికులు అంటున్నారు.
‘భద్రాచలం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ స్పెషల్ అథారిటీ’ని ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. 1964లో సీతారాముల కల్యాణం కోసం నిర్మించిన మిథిలా స్టేడియం నేడు సరిపోవటంలేదు. ఈ స్టేడియాన్ని పునఃనిర్మించి, గోదావరి నుంచి మోతెగడ్డ ద్వీపంలోని శివాలయానికి బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అలాగే, పర్ణశాల ఆలయ అభివృద్ధిపైనా దృష్టి సారించాలని, కరకట్టపై సోలార్ షెడ్ నిర్మిస్తే భక్తులకు నీడతో పాటుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సూచిస్తున్నారు.
శ్రీరామ నవమికి పటిష్ట భద్రత
క్యూఆర్ కోడ్‌తో భద్రగిరి సమస్త సమాచారం
భద్రాచలం అర్బన్/కొత్తగూడెంటౌన్: భద్రాచలంలో ఈనెల 6న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు 200 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడించారు. ఈనెల 6న శ్రీసీతారాముల కల్యాణం, 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో భక్తుల భద్రత కోసం పోలీసు శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పార్కింగ్ స్థలాలు, ఆలయం, కల్యాణ మండపం, లడ్డూ, తలంబ్రాల కౌంటర్లను చేరుకోవడంతో పాటు తాగునీటి వసతి ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ రూపొందించామని వెల్లడించారు. అంతేకాక ఆన్‌లైన్ లింక్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా భక్తులు సులభంగా తమకు అవసరమైన ప్రాంతాలకు చేరుకోవచ్చని చెప్పారు. రెండు రోజులపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విధించే ఆంక్షలకు భద్రాచలం పట్టణవాసులు సహకరించాలని ఎస్పీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు.