
స్వామి వారికి పట్టువ్రస్తాలు తీసుకొస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన మంత్రి తుమ్మల, తదితరులు
రాజలాంఛనాలతో ప్రత్యేక పూజలు
సామ్రాట్ కిరీటధారిగా దశరథ రాముడు
వేడుకలకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జగదభిరాముడికి సోమవారం పట్టాభిషేక మహోత్సవం çవైభవోపేతంగా జరిగింది. సీతారాముల కల్యాణం మరుసటి రోజున పుష్యమి నక్షత్రం సందర్భంగా మిథిలా స్టేడియంలో రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం 10 గంటలకు శంఖ, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను పల్లకీ సేవగా బయటికి తెచ్చారు. మేళతాళాలు, కోలాటం, భజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ సింహాసనంపై కొలువుదీర్చారు. వైదిక మంత్రాలతో వశిష్టుడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజ్ఞుడును వేద పండితులు వరింప జేసుకున్నారు.
సప్త సముద్రాలు, సకల నదుల జలాలు
పట్టాభిషేకం జరిగే ప్రధాన మండపానికి ముందు మూడు ఉప మండపాల్లో మూడు కలశాలను ఏర్పాటు చేశారు. ఒక మండపంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. మరో కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు రామ పరివారాన్ని ఆవాహన చేశారు. మరో కలశంలో అష్టదిక్పాలకులను, పట్టాభిషేకానికి ఉపయోగించే వస్తువులతోపాటు ఆది దేవతలను ఆవాహన చేస్తూ చతుర్వేద హవన పురస్కృతంగా మండపత్రయ ఆరాధన నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన చేశారు.
అటు రాజదండం, ఇటు రాజఖడ్గం
మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవాహన చేసిన రాజముద్రికను కుడి చేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు.
స్వర్ణఛత్రం నీడలో ఎడమ వైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడిని అలంకరించారు. తలపై సామ్రాట్ కిరీటంతో గరుత్మంతుడు, వైనేతుడులు అందించే చామరల సేవను ఆస్వాదిస్తూ భక్తులకు రామయ్య దర్శనం ఇచ్చారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తికి మంగళహారతి ఇచ్చారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టువ్రస్తాలు సమర్పించిన గవర్నర్
పట్టాభిషేక వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం గవర్నర్ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు.