రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గత కొన్ని నెలల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న నక్సలైట్లు, భద్రతా దళాలతో పోరాడేందుకు కొత్త వ్యూహాలు పన్నారు. భద్రతా దళ సిబ్బందిని తప్పుదారి పట్టించేందుకు మనుషుల దిష్టిబొమ్మలు, నకిలీ తుపాకులను వారు ఉపయోగిస్తున్నారు. జవాన్లను ఉచ్చులోకి దింపేందుకు వ్యూహాత్మకంగా ఈ దిష్టిబొమ్మలను అడవుల్లో అక్కడక్కడా పెట్టారు. గత ఎనిమిది రోజుల్లోనే సుక్మా జిల్లాలో ఇలాంటి 13 దిష్టిబొమ్మలను స్వాధీనం చేసుకున్నామని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. గత కొన్ని నెలల్లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకుని ఉండొచ్చని ఎస్పీ చెప్పారు.
వియత్నాం యుద్ధంలో ఇలాంటి పద్ధతిని నాటి సైనికులు వినియోగించారనీ, అయితే నక్సల్స్ ఈ వ్యూహాన్ని అమలు చేయడం మాత్రం ఇదే తొలిసారని మీనా వెల్లడించారు. చింతగుహ అడవుల్లో దొరికిన ఓ దిష్టిబొమ్మ వద్ద అత్యాధునిక పేలుడు పదార్థాన్ని కూడా అమర్చారనీ, సైనికులపై దొంగదాడి చేసేందుకు లేదా వారిని పేలుడు పదార్థాలతో చంపేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహానికి తెరతీసి ఉండొచ్చన్నారు. పలు హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీలు చూసి నక్సల్స్ ఈ తరహా కొత్త వ్యూహాలు పన్ని ఉండొచ్చని భద్రతా నిపుణుడొకరు చెప్పారు. పూర్తి వ్యూహం తయారుచేసే ముందు దిష్టిబొమ్మలకు భద్రతా దళ సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే వారు ఇలా చేసి ఉంటారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment