dummy pistol
-
డమ్మీ గన్ ప్రాణాలు తీయడమేంటి?
సినిమాల్లో వాడే ఆయుధాలు డమ్మీవనే అపోహ చాలామందికి ఉంటుంది. అఫ్కోర్స్.. అందులో కొంత వాస్తవమూ లేకపోలేదు. సాధారణంగా సినిమాలకు ఉత్తుత్తి తుపాకులనే వినియోగిస్తుంటారు. కానీ, వాటివల్లా ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. తాజాగా ‘రస్ట్’ షూటింగ్ లో డమ్మీ తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) మరణించిన విషయం తెలిసిందే!. మరి డమ్మీ తుపాకులతో కూడా చనిపోతారా? అనే అనుమానం కలగొచ్చు. వాస్తవానికి ఆ తుపాకులతోనూ తీవ్రమైన పరిణామాలు కలుగుతుంటాయి. టెక్నికల్ కోణంలో అదెలాగంటే.. వినోద రంగంలో వాడే ఏదైనా మారణాయుధాలను ‘ప్రాప్’ ఆయుధాలు అంటారు. థియేటర్ ప్రొడక్షన్స్, రేంజ్ కోసం వాటిని వాడుతుంటారు. చాలా మంది అవి పనిచేయవని అనుకుంటారు. కేవలం తుపాకుల్లా కనిపించేవాటిని మాత్రమే వాడుతుంటారని పొరపడుతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో వాడేవి నిజమైన తుపాకులే. యస్.. క్లోజప్ షాట్స్ లో ఒరిజినల్ ఫీలింగ్ కలిగేందుకు వాటిని వాడుతుంటారు. అయితే గన్స్‌ను హ్యాండిల్ చేసే నిపుణుల సమక్షంలోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అద్దెకు తెచ్చేవే అయినా వీటిని ఉపయోగించడానికి అయ్యే ఖర్చు.. దాదాపు రియల్ గన్లను ఉపయోగించడానికి అయ్యేంతగా ఉంటుందట!. ప్రాప్ గన్స్(ప్రతీకాత్మక చిత్రం) How Prop Gun Works.. ఇక నిజమైన తుపాకీని వాడేటప్పుడు.. బుల్లెట్లు లేకుండా కేవలం కార్ట్రిడ్జ్‌ను లోడ్ చేస్తారు. మిగతావన్నీ తుపాకీ సెటప్‌కు తగ్గట్లే ఉంటాయి. అంటే బుల్లెట్లు లేకపోయినా.. కేసింగ్, గన్ పౌడర్, ఫైరింగ్ పిన్ వంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ క్రమంలో తుపాకీ పేల్చినప్పుడు పెద్ద శబ్దంతో గన్ పౌడర్ మండుతుంది. వీటిని హ్యాండిల్ చేయడంలో ఏమైనా పొరపాటు జరిగితే కాల్చేవారికి మాత్రమే కాదు.. దగ్గరగా ఉన్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి చనిపోవచ్చు కూడా. ‘రస్ట్’ సినిమా షూటింగ్లో జరిగింది కూడా ఇదే అని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రాప్ గన్ను అలెక్ బాల్డ్విన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. జోన్-ఎరిక్ హెక్సమ్(ఎడమ), బ్రాండన్ లీ(బ్రూస్లీ కొడుకు మధ్యలో), హల్యానా హచిన్స్(కుడి) గతంలోనూ.. ప్రాప్ గన్ విషాదాలు గతంలోనూ జరిగాయి. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ కొడుకు బ్రాండన్ లీ కేవలం 28 సంవత్సరాల వయసులోనే మృత్యువాత పడ్డాడు. అందుకు కారణం.. ప్రాప్ గన్. 1993లో ‘ది క్రౌ’ షూటింగ్ సందర్భంగా ప్రాప్ గన్ పేలి చనిపోయాడు. తుపాకీ పేలిన తర్వాత లీ కుప్పకూలగానే.. అంతా అది నటనేమో అనుకున్నారట. కానీ, షాట్ కట్ అయిన తర్వాత కూడా కదలిక లేకపోవడంతో అసలు విషయం గుర్తించి.. ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. ఇక 1984లో యూకే నటుడు జోన్-ఎరిక్ హెక్సమ్.. ఓ టీవీ షో సెట్స్‌లో షూటింగ్ ఆలస్యం అవుతోందన్న ఫ్రస్టేషన్లో జోక్ చేయడం ప్రారంభించాడు. కాసేపటికే ఆయన తుపాకీ తలకు గురిపెట్టి షూటింగ్ మొదలుపెడతారా? కాల్చుకోమంటారా? అంటూ సరదాగా కామెంట్లు చేశాడు. చివరకు డమ్మీ గన్నే కదా అని ట్రిగ్గర్ నొక్కడంతో అది కాస్త ‘ఫాట్’మని పేలి ఆయన్ని గాయపరిచింది. అయితే ఆ దెబ్బకు ఆయన పుర్రెకు బలమైన గాయమైంది. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాక చివరకు ఆయన ప్రాణాలు విడిచాడు. ఇక ఇప్పుడు పొరపాటున అలెక్ బాల్డ్విన్ చేతిలో ప్రాప్ గన్ పేలి.. హల్యానా హచిన్స్ ప్రాణం విడిచింది. బాల్డ్విన్(ఎడమ), హల్యానా(కుడి) బాల్డ్విన్ అరెస్ట్ చేయాల్సిందే ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్విన్(63) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో ‘అరెస్ట్ చేయాల్సిందేన’ని సోషల్ మీడియా కూస్తోంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి దర్యాప్తు అయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ బయట బాల్డ్విన్ ఘటన జరిగిన వెంటనే బాల్డ్విన్ స్వయంగా శాంటా ఫే కౌంటీ పోలీస్ స్టేషన్ కు వచ్చారని, విచారణకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆయన తన డిటెక్టివ్ లతో మాట్లాడుతున్నారని, ఘటన గురించి తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చారని పర్సనల్ మేనేజర్ మీడియాకు తెలిపారు. కాగా, హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్. కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్‌లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్‌లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ కిందటి ఏడాది రిలీజ్ అయ్యింది కూడా. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
కలకలం సృష్టించిన డమ్మీ గన్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నంబర్– 10లోని సింగాడికుంట బస్తీ అధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఆదివారం రాత్రి డమ్మీ గన్‌తో నిర్వహించిన ర్యాలీ స్థానికంగా సంచలనం సృష్టించింది. గన్ను చూపిస్తూ స్థానికులను భయభ్రాతులకు గురి చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఎజాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఎజాజ్, ఆయన కుమారుడిపై స్థానికంగా కొంతమంది కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. దాడి చేసిన వారికి ఇటీవలే బెయిల్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎజాజ్ డమ్మీ గన్ చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ర్యాలీ ఎందుకు నిర్వహించింది, డమ్మీగన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. -
‘సాయం చేయండి.. ఊపిరాడటం లేదు’
వాషింగ్టన్ : అతివేగం పనికి రాదంటూ ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా చెవికెక్కించుకోకుండా.. ప్రమాదాల బారిన పడుతుంటారు. అలానే సరదా కోసమో.. లేక బెదిరిద్దామనే ఉద్దేశంతో చేసే పనులు చివరకు మన మెడకే చుట్టుకుంటాయి. ఈ రెండు సంఘటనలు ఓ యువతి జీవితంలో చోటు చేసుకోవడం.. ఆనక ఆమె మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలు.. హన్నా విలియమ్స్(17) అనే టీనేజర్ ఈ నెల 5న అతి వేగంగా కారును డ్రైవ్ చేస్తూ పోలీసుల కంటబడింది. ఆమెను ఆపడానికి ట్రై చేసిన పోలీసు వాహనాన్ని ఢీకొట్టి చాలా స్పీడ్‌గా వెళ్లి పోయింది. దాంతో సదరు పోలీసు అధికారి తరువాతి చెక్‌పోస్ట్‌లో ఉన్న అధికారికి హన్నా గురించి సమాచారం ఇచ్చాడు. వేగంగా వస్తోన్న హన్నా వాహనాన్ని గుర్తించి ఆపడానికి వెళ్లాడు సదరు అధికారి. సదరు అధికారి కారు దిగుతూనే గన్ చేతిలో పట్టుకుని.. వాహనాన్ని ఆపమని హన్నాను హెచ్చరించాడు. అధికారి చేతిలో గన్ను చూసిన హన్నా.. అతడిని బెదిరించడానికి డమ్మీ తుపాకీ తీసుకుని షూట్ చేయడానికి రెడీ అన్నట్లు నిల్చూంది. ఇంతలో ఆఫీసర్ హన్నా కాళ్ల మీద కాల్చడం.. ఆమె కింద పడిపోవడం వెంటవెంటనే జరిగాయి. అయితే అధికారి ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపాడనే విషయం గురించి సరిగా తెలియలేదు. ఆ తర్వాత హన్నా ‘నాకు ఊపిరాడటం లేదు.. సాయం చేయండి’ అంటూ అర్థించింది. దాంతో సదరు అధికారి.. మరో ఆఫీసర్‌కు కాల్ చేసి సంఘటన జరిగిన చోటుకు రప్పించాడు. అనంతరం అధికారుల్దిదరూ కలిసి హన్నాకు ప్రథమ చికిత్స చేసి వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తర్వాత హన్నా చేతి నుంచి కింద పడిన గన్ను పరిశీలించగా.. అది డమ్మీ తుపాకిగా తేలింది. ఆస్పత్రిలో చేరిన హన్నా చికిత్స పొందుతూ.. మరణించింది. ఈ విషయం గురించి హన్నా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘కొద్ది రోజులుగా మా కుమార్తె మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స కూడా తీసుకుంటుంది. అందుకే వీలనైంత వరకూ తనను ఒంటరిగా ఎక్కడికి పంపం. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు తాను బయటకు వెళ్లడం తన ప్రాణం తీసింది’ అంటూ వాపోయారు. ఈ విషయం గురించి పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. ‘ఎవరైనా ఓ వ్యక్తి మా వైపు గన్ గురిపెట్టి ఉన్నప్పుడు అతని బారినుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడమే కాక సదరు వ్యక్తి పారిపోకుండా చూడాలి. సెకన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్నది నిజమైనా ఆయుధమా కాదా అని అనుమానిస్తూ ఉండలేం కదా. అలానే ఇక్కడ అధికారి కూడా హన్నా చేతిలో ఉన్నది నిజం తుపాకీ అనుకుని కాల్పులు జరిపాడు. ఏది ఏమైనా దర్యాప్తు కొనసాగుతుంద’ని తెలిపారు. -
నక్సల్స్ దిష్టిబొమ్మల వ్యూహం!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గత కొన్ని నెలల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న నక్సలైట్లు, భద్రతా దళాలతో పోరాడేందుకు కొత్త వ్యూహాలు పన్నారు. భద్రతా దళ సిబ్బందిని తప్పుదారి పట్టించేందుకు మనుషుల దిష్టిబొమ్మలు, నకిలీ తుపాకులను వారు ఉపయోగిస్తున్నారు. జవాన్లను ఉచ్చులోకి దింపేందుకు వ్యూహాత్మకంగా ఈ దిష్టిబొమ్మలను అడవుల్లో అక్కడక్కడా పెట్టారు. గత ఎనిమిది రోజుల్లోనే సుక్మా జిల్లాలో ఇలాంటి 13 దిష్టిబొమ్మలను స్వాధీనం చేసుకున్నామని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. గత కొన్ని నెలల్లో భద్రతా దళాల ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకుని ఉండొచ్చని ఎస్పీ చెప్పారు. వియత్నాం యుద్ధంలో ఇలాంటి పద్ధతిని నాటి సైనికులు వినియోగించారనీ, అయితే నక్సల్స్ ఈ వ్యూహాన్ని అమలు చేయడం మాత్రం ఇదే తొలిసారని మీనా వెల్లడించారు. చింతగుహ అడవుల్లో దొరికిన ఓ దిష్టిబొమ్మ వద్ద అత్యాధునిక పేలుడు పదార్థాన్ని కూడా అమర్చారనీ, సైనికులపై దొంగదాడి చేసేందుకు లేదా వారిని పేలుడు పదార్థాలతో చంపేందుకు నక్సల్స్ ఈ కొత్త వ్యూహానికి తెరతీసి ఉండొచ్చన్నారు. పలు హాలీవుడ్ సినిమాలు, డాక్యుమెంటరీలు చూసి నక్సల్స్ ఈ తరహా కొత్త వ్యూహాలు పన్ని ఉండొచ్చని భద్రతా నిపుణుడొకరు చెప్పారు. పూర్తి వ్యూహం తయారుచేసే ముందు దిష్టిబొమ్మలకు భద్రతా దళ సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే వారు ఇలా చేసి ఉంటారని ఆయన తెలిపారు. -
డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్..!
వరంగల్ క్రైం : హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ లాకర్ వ్యవహారం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. బ్యాంక్ లాకర్ 27/2లో లభ్యమైన డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్ వ్యవహారానికి ప్రస్తుత బ్యాంకు మేనేజర్ అయుబ్ ఔట్ అయ్యారు. ఈనెల 8న బ్యాంక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన లాకర్ వ్యవహారం ఎట్టకేలకు బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుంది. బ్యాంక్‌లో తుపాకీ విషయం వెలుగుచూసిన తర్వాత డీసీసీబీ ప్రత్యేక పరిపాలన అధికారి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత హన్మకొండ జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్‌ను బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో వరంగల్ అర్బన్ డీసీఓ కరుణాకర్ బ్యాంకులో 8న లాకర్ 27/2 కలిగిన బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డిని బ్యాంకు మేనేజర్ పిలిపించి లాకర్‌ను అద్దెకు తీసుకోకుండా, లాకర్ తాళంచెవి పోయినందుకు, దాన్ని ఓపెన్ చేయడానికి టెక్నీషియన్ చార్జీలకు సంబంధించిన డబ్బులను ఆగస్టు 8న బ్యాంకులో జమచేయలేదు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విచారణ అధికారులు భావించారు. టెక్నీషియన్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పిస్తోల్, బుల్లెట్ బయటపడిన తర్వాత సమాచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు చేరవేయలేదు? అనే విషయంపై విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల్లో అధికారులు నిబంధనలు పాటించకపోవడంపై కూడా విచారణ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. బ్యాంకు లాకర్ విషయంలో జరిగిన అంశాలతోపాటు ప్రస్తుత పరిస్థితులపై డీసీఓ కరుణాకర్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డీసీసీబీ ప్రత్యేక అధికారి ఎం.హరితకు ఈనెల 24న నివేదిక అందజేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బ్యాంకు వ్యవహారంలో నిబంధనలు పాటించనందుకు బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని బ్యాంకు ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గురువారం బ్యాంకు సీఈఓ అంజయ్య ప్రస్తుత మేనేజర్ ఎండీ.అయూబ్బేగ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కొనసాగుతున్న పోలీసుల విచారణ బ్యాంకు లాకర్లో బయటపడ్డ డమ్మీ పిస్తోల్ వ్యవహారంలో సుబేదారి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాకర్లో తుపాకీ ఎవరు పెట్టారు?, అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంత? బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది? రాజకీయ నేతలు ఎవరెవరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే విషయాలపై ఓ వైపు విచారణ సాగుతుండగా, మరోవైపు శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాంకు ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకు లావాదేవీల విషయంలో నిబంధనలు పాటించనందుకు మేనేజర్ అయూబ్ బేగ్ సస్పెండ్ అయ్యారు. డమ్మీ పిస్తోల్ విషయంలో పోలీసులు ఎవరిని దోషులుగా గుర్తిస్తారో వేచిచూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరి కొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
బొమ్మ తుపాకీ అనుకుని..అమ్మను కాల్చింది!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ బాలిక నిజమైన తుపాకీని బొమ్మగా పొరబడి, దాంతో తన తల్లిని కాల్చింది. హుగ్లీ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో బాలిక తల్లి తీవ్రంగా గాయపడగా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆదివారం ఉదయం కకోలీ జన అనే మహిళకు తమ ఇంటి పెరట్లో ఈ తుపాకీ దొరికింది. దానిని బొమ్మగా భావించిన ఆమె తన కూతురికి ఆడుకోడానికి ఇచ్చింది. బాలిక ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా తుపాకీ నుంచి ఓ బుల్లెట్ మహిళ వీపు భాగంలోకి దూసుకుపోయింది. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి షాక్‌లో ఉందని పోలీసులు తెలిపారు. -
సెల్ఫీ ఖరీదు ప్రాణం..!
బొమ్మ తుపాకీ పట్టుకున్న బాలురపై పాక్ పోలీసు కాల్పులు లాహోర్: డమ్మీ తుపాకీతో సెల్ఫీ దిగాలనుకుని ఓ బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో సోమవారం జరిగింది. ఫర్హాన్(15), ఫహాద్(14) బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగి సోషల్ సైట్లలో తమ ఫొటోలు పెట్టాలని భావించారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే తుపాకీతో ఉన్న వీరిద్దరినీ చూసిన ఓ పోలీసు అధికారి.. వారిని దొంగలుగా భావించి ఎటువంటి హెచ్చరికలూ లేకుండా కాల్పులకు దిగాడు. దీంతో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఫర్హాన్ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దోపిడీకి ప్రయత్నించారని భావించి తాను వారిపై కాల్పులు జరిపినట్టు ఎస్‌హెచ్‌వో ఫర్యాద్ చీమా తెలిపాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి చీమా, మరో నలుగురు అధికారులను అరెస్ట్ చేశామని, వారిపై హత్య కేసు నమోదు చేశామని పంజాబ్ న్యాయ శాఖ మంత్రి రానా సనావుల్లా తెలిపారు. -
మావోయిస్టుల పేరిట ముగ్గురి హత్యకు కుట్ర
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల ప్రాంతంలో ముగ్గురిని హతమార్చి మావోయిస్టు పార్టీని పునర్నిర్మించేందుకు కొందరు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఆయుధాల అన్వేషణలో డమ్మి పిస్టల్‌ను కొనుగోలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. మావోయిస్టుల పేరిట ముందస్తుగానే వాల్‌పోస్టర్లు అంటించి కలకలం సృష్టించిన ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోస్టర్ల వెనుక జరిగిన కుట్రను ఛేదించారు. ముగ్గురి హత్యలతో ఉద్యమం వేములవాడ మండలం మారుపాక వద్ద హత్యకు గురైన సుద్దాలకు చెందిన మాజీ సర్పంచ్ ఏనుగు వేణుగోపాల్‌రావు ఉరఫ్ ప్రభాకర్‌రావు హత్య కేసులో నిందితులుగా ఉన్న మొండయ్య, కుంటయ్య, లక్ష్మణ్‌ను హత్య చేసి మావోయిస్టుల పేరిట ఉద్యమం నడపాలన్న కుట్రను పోలీసులు కనిపెట్టారు. ఆ ముగ్గురిని హత్య చేస్తే రూ.15 లక్షలు సమకూర్చుతానని వేణుగోపాల్‌రావు తనయుడు హామీ ఇచ్చినట్లు పోలీసుల విచారణ తేలింది. భారీ మొత్తంలో డబ్బు రావడంతో ఆయుధాలు కొనుగోలు చేసి మావోయిస్టుల పేరిట విప్లవోద్యమాన్ని నడిపించేందుకు ఐదుగురు యువకులు కుట్ర పన్నారు. గడువులోగా ఆ ముగ్గురిని హతమార్చితే అనుకున్న సొమ్మును అప్పగించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో గడువు దాటిపోయి.. విషయం బయటకు రావడంతో పోలీసులు లోతుగా విశ్లేషించి కుట్ర చేసిన ఐదుగురిని పట్టుకున్నట్లు సమాచారం. డమ్మీ పిస్టల్‌తో వసూళ్లు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన కిషన్, నాగరాజు, మల్కపేటకు చెందిన బోయిని రాజేందర్, శ్రీకాంత్, కొలనూరుకు చెందిన విష్ణులు డమ్మీ పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ పిస్టల్‌ను చూపించి ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. 30 వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ డబ్బులతో నిజమైన ఆయుధం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఆయుధాలను సేకరించే మార్గం లభించకపోవడంతో మాజీ నక్సలైట్లను కలిసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మావోయిస్టుల పేరిట హత్యలకు పన్నిన కుట్రలు చేసే వ్యవహారం బయటపడింది. ఇటీవల కోనరావుపేట మండలం ధర్మారంతోపాటు పలు గ్రామాల్లో మావోయిస్టుల పేరిట పోస్టర్లు వేశారు. ముందుగా పోస్టర్లు వేసి భయం కలిగించి హత్యలతో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సదరు యువకులు వ్యూహం పన్నినట్లు తెలిసింది. హత్య కుట్ర కేసును ఛేదించే క్రమంలో మావోయిస్టుల పేరిటపోస్టర్లు వేసిన వ్యవహారం బయటపడింది. లోతుగా విచారిస్తున్న పోలీసులు ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యవహారంలో పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. శాస్త్రీయంగా ఫోన్ సంభాషణలను సేకరించి హత్య వెనుక కుట్రను ఆరా తీస్తున్నారు. కరీంనగర్ ఓఎస్డీ ఎల్.సుబ్బారాయుడు, సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, రూరల్ సీఐ మహేశ్, కోనరావుపేట ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.