వరంగల్ క్రైం : హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ లాకర్ వ్యవహారం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. బ్యాంక్ లాకర్ 27/2లో లభ్యమైన డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్ వ్యవహారానికి ప్రస్తుత బ్యాంకు మేనేజర్ అయుబ్ ఔట్ అయ్యారు. ఈనెల 8న బ్యాంక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన లాకర్ వ్యవహారం ఎట్టకేలకు బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుంది. బ్యాంక్‌లో తుపాకీ విషయం వెలుగుచూసిన తర్వాత డీసీసీబీ ప్రత్యేక పరిపాలన అధికారి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత హన్మకొండ జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్‌ను బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో వరంగల్ అర్బన్ డీసీఓ కరుణాకర్ బ్యాంకులో 8న లాకర్ 27/2 కలిగిన బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డిని బ్యాంకు మేనేజర్ పిలిపించి లాకర్‌ను అద్దెకు తీసుకోకుండా, లాకర్ తాళంచెవి పోయినందుకు, దాన్ని ఓపెన్ చేయడానికి టెక్నీషియన్ చార్జీలకు సంబంధించిన డబ్బులను ఆగస్టు 8న బ్యాంకులో జమచేయలేదు.
ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విచారణ అధికారులు భావించారు. టెక్నీషియన్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పిస్తోల్, బుల్లెట్ బయటపడిన తర్వాత సమాచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు చేరవేయలేదు? అనే విషయంపై విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల్లో అధికారులు నిబంధనలు పాటించకపోవడంపై కూడా విచారణ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. బ్యాంకు లాకర్ విషయంలో జరిగిన అంశాలతోపాటు ప్రస్తుత పరిస్థితులపై డీసీఓ కరుణాకర్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డీసీసీబీ ప్రత్యేక అధికారి ఎం.హరితకు ఈనెల 24న నివేదిక అందజేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బ్యాంకు వ్యవహారంలో నిబంధనలు పాటించనందుకు బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని బ్యాంకు ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గురువారం బ్యాంకు సీఈఓ అంజయ్య ప్రస్తుత మేనేజర్ ఎండీ.అయూబ్‌బేగ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
కొనసాగుతున్న పోలీసుల విచారణ
బ్యాంకు లాకర్‌లో బయటపడ్డ డమ్మీ పిస్తోల్ వ్యవహారంలో సుబేదారి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాకర్‌లో తుపాకీ ఎవరు పెట్టారు?, అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంత? బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది? రాజకీయ నేతలు ఎవరెవరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే విషయాలపై ఓ వైపు విచారణ సాగుతుండగా, మరోవైపు శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాంకు ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకు లావాదేవీల విషయంలో నిబంధనలు పాటించనందుకు మేనేజర్ అయూబ్ బేగ్ సస్పెండ్ అయ్యారు. డమ్మీ పిస్తోల్ విషయంలో పోలీసులు ఎవరిని దోషులుగా గుర్తిస్తారో వేచిచూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరి కొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment