Bhadrachalam Area Hospital
-
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్‌కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్‌లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్‌కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్‌బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్‌కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
50 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది
అశ్వారావుపేట రూరల్: ఐదు పదులు దాటిన వయసులో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన రాములమ్మ, రాముడు దంపతులకు 36 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అనంతరం రాములమ్మకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం రాములమ్మ, రాముడు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం రాములమ్మకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో గ్రామంలోని ఓ ఆశ కార్యకర్త వద్దకు వెళ్లి మాత్ర తెచ్చుకుని వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత నొప్పి అధికం కావడంతో ఇంటి వద్దే ఉన్న బాత్రూమ్కు వెళ్లి ప్రసవించింది. ఆడబిడ్డ జన్మించింది. గమనించిన కుటుంబీకులు ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె 108 ద్వారా తల్లీబిడ్డలను అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తల్లికి రక్తహీనత.. శిశువు కేవలం 800 గ్రాముల బరువు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ వైద్యురాలు నీలిమను వివరణ కోరగా.. రాములమ్మ పెద్ద వయసులో ప్రసవించడం ఆశ్చర్యకరమేనని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స గురించి ఆమె స్పష్టంగా చెప్పలేకపోతోందని తెలిపారు. -
చింతూరు దుర్ఘటనలో బాలుడి మృతి
సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : హోటల్లోకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన రెండేళ్ల బాలుడు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. మండలంలోని చట్టి జంక్షన్లో ఓ లారీ శనివారం అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందగా బాలుడితో పాటు డ్రైవర్, క్లీనర్‌కు గాయాలైన సంఘటన విదితమే. గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న బాలుడిని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ బాలుడిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నేండ్రకు చెందిన ముచ్చిక అభిరాం (2)గా గుర్తించారు. అభిరాం తల్లి సుబ్బమ్మ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఆమె రెండేళ్ల కొడుకు కూడా మృతి చెందడం చూపరులను కంటతడి పెట్టించింది. బాలుడి మృతితో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన నాలుగో మహిళను నేండ్ర గ్రామానికి చెందిన ముచ్చిక ముత్తి (50)గా గుర్తించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ మయారాం, క్లీనర్ దిలీప్ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఎటపాక సీఐ హనీష్, చింతూరు ఎస్సై సురేష్‌బాబు పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల కోసం వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ప్రభుత్వాస్పత్రుల ప్రక్షాళన
భద్రాచలం : వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రాత్రి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బస చేసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతంలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’ అనే దుస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వాల శాపం, వారు చేసిన పాపం వల్ల ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగం అభివృద్ధికి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆస్పత్రికి రూ.కోటి చొప్పున మంజూరు చేశామన్నారు. వైద్య సేవల వికేంద్రీకరణ దిశగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేస్తున్నానని తెలిపారు. ఐదు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పారు. రిఫరల్ విధానానికి స్వస్తి పలకాలని, 30 శాతం ఉన్న ఆస్పత్రుల సేవలను 50 నుంచి 60 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. వైద్యులు రోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ప్రతి పీహెచ్సీ వైద్యుడికి ప్రత్యేక వాహనం కేటాయిస్తామని, ఇందుకోసం నెలకు రూ. 25 వేలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పీహెచ్‌సీల స్థాయి పెంపు... రాష్ట్రంలో అవసరమైన చోట్ల పీహెచ్‌సీల స్థాయిని పెంచేందుకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 31 పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల కల్పనకు కోసమని ఒక్కో కేంద్రానికి రూ.40 లక్షలు విడుదల చేస్తున్నామని, రూ.30 కోట్లతో పలు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. వైద్యులకు కూడా ప్రొటోకాల్ ఉండేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాచలం ఆసుపత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రం... మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.18.30 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి రూ.10 కోట్లు కేటాయించామన్నారు. మలేరియా, డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదయ్యే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోగుల నాడిపట్టిన రాజయ్య.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పలువురు రోగులను మంత్రి రాజయ్య నాడిపట్టి పరీక్షించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్యశాఖపై సమీక్ష :- పర్యటనలో భాగంగా రాత్రి పది గంటల తరువాత వైద్య శాఖపై ఏరియా ఆసుపత్రిలోనే సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారిణి ఆనందవాణి, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, క్లస్టర్ అధికారిణి కోమల తదితరులు ఉన్నారు. మంత్రి రాత్రి బస నేపథ్యంలో కొత్తగూడెం డీఎస్పీ సురేందర్ నేతృత్వంలో భద్రాచలం, పాల్వంచ సీఐలు ఆంజనేయలు, షుకూర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఏదీ ‘రక్తనిధి’ !?
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఏజెన్సీకి పెద్దాస్పత్రిగా పేరొందిన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం మూత పడింది. రక్త హీనతతో బాధపడుతూ ప్రసవం కోసం వచ్చే అనేకమంది గర్భిణులకు ఈ కేంద్రం ఆపన్న హస్తం అందించేది. కానీ ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కేంద్రానికి ఏకంగా తాళాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.... వంద పడకలు ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ ఐదు వందలమందికి పైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రసవం కోసం నెలకు క నీసం మూడు వందలమందికి పైగా గర్భిణులు వస్తుంటారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో గిరిజనులే ఉంటారు. ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, దుమ్ముగూడెం వంటి మండలాల నుంచి వచ్చే రోగుల్లో ఎక్కువగా రక్తహీనత లోపం ఉంటుంది. ఈ నేపథ్యంలో గిరిజన రోగులతో పాటు అత్యవసర సేవల అవసరార్థం ఏరియా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఆర్ఎంవో స్థాయి వైద్యుడు ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా, రక్తాన్ని సేకరించేందుకు గాను ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ప్రతీ రోజు పది మందికి పైగానే ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు, అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అందించేందుకు తప్పని సరిగా పది బాటిళ్ల వరకూ రక్తం అవసరం ఉంటుంది. అయితే ఆస్పత్రి నిర్వాహకుల పుణ్యమా అని ఈ కేంద్రం మూతపడడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్తం నిల్వలు లేకపోవటంతో ఇక్కడి వైద్యులు రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. దీంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చే గిరిజనుల అవస్థలు అన్నీఇన్నీ కావు. గత నెల రోజులుగా ఇదే తంతు జరుగుతున్నా ఏరియా ఆసుపత్రి నిర్వాహకులు చోద్యం చూస్తుండటం వారి పనితీరుకు అద్దం పడుతుంది. గిరిజనులకు రక్తనిధి కేంద్రం నుంచి రక్తం ఎంతో అవసరమని తెలిసి కూడా అధికారులు దీనిపై దృష్టి సారించకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎందుకిలా జరిగిందంటే.... వాస్తవంగా రక్తనిధి కేంద్రం నిర్వహించాలంటే హైదరాబాద్‌లో ఉన్న బ్లడ్‌బ్యాంక్ సెల్ నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తనిధికేంద్రంలో అవసరమైన పరికరాలు లేవంటూ ఎన్ఓసీ ఇచ్చేందుకు వారు నిరాకరించారు. ఆసుపత్రిలో రెండు రిఫ్రిజిరేటర్లు, ఒక బ్లడ్ కలెక్షన్ మానిటర్, బాటిల్ సీలర్ ఉండాలి. కానీ ఆస్పత్రిలో ఇక రిప్రిజరేటర్ మాత్రమే ఉంది. మిగతా పరికరాలు ఏవీ అందుబాటులో లేవు. వీటిని కొనుగోలు చేసేందుకు కనీసం రూ.5 నుంచి 6 లక్షల వరకూ నిధులు అవసరం. ఈ నేపథ్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏరియా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని గత నెల 6న సీజ్ చేశారు. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు పట్టించుకోకపోవటంతోనే.... భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి 2000 సంవత్సరం నుంచి కూడా ఎన్వోసీ లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి నోటీసులు వచ్చినప్పడల్లా ఇక్కడి రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో పనిచేసిన వైద్యులు పరిస్థితిని ఐటీడీఏ పీవో, ఏపీవీవీపీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదో రూపేణా బ్లడ్ బ్యాంక్మూత పడకుండా నడిపించారు. కొత్తగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా ఇదే రీతిన నడిపిస్తున్నారు. కానీ భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రస్తుత నిర్వాహకులు దీనిపై తమకు సంబంధం లేనట్లు వ్యవహరించటంతోనే కేంద్రం మూత వేసే వరకూ వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి రక్త నిధి కేంద్రాన్ని తక్షణమే తెరిచేలా తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : విజయారావు, సూపరింటెండెంట్ నిర్వహణ కోసం తగిన పరికరాలు లేవనే కారణంతో రక్తనిధి కేంద్రాన్ని మూసివేయమని డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఈవిషయాన్ని ఐటీడీఏ పీవో వీరపాండియన్ దృష్టికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం కొన్ని పరికరాలు వచ్చాయి. త్వరలోనే రక్తనిధి కేంద్రాన్ని తెరిపిస్తాం. ప్రసవానికి వచ్చి...రక్తం లేక వేచిచూపులు... అశ్వాపురం మండలం మొండికుంట నుంచి తెల్లం తులసి అనే గిరిజన మహిళ సోమవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఆమెకు పరీక్షలు నిర్వహించగా రక్తం తక్కువగా ఉందని తేలింది. రక్తం ఎక్కిస్తేనే గానీ ప్రసవం చేసే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. అయితే ఇక్కడ రక్తనిధి కేంద్రం మూతబడడంతో ఆమెకు పడిగాపులు తప్పలేదు. దాతలు ముందుకొచ్చి రక్తం ఇస్తే తప్ప ఆమెకు ప్రసవం అయ్యే అవకాశం లేదు. మంగళవారం వరకూ ఆమెను పరిశీలనలో ఉంచి ఆ తరువాత అవసరమైతే కొత్తగూడెం లేదా ఖమ్మం పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు.