భద్రాచలం, న్యూస్‌లైన్ : ఏజెన్సీకి పెద్దాస్పత్రిగా పేరొందిన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం మూత పడింది. రక్త హీనతతో బాధపడుతూ ప్రసవం కోసం వచ్చే అనేకమంది గర్భిణులకు ఈ కేంద్రం ఆపన్న హస్తం అందించేది. కానీ ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కేంద్రానికి ఏకంగా తాళాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే....
వంద పడకలు ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ ఐదు వందలమందికి పైగా రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రసవం కోసం నెలకు క నీసం మూడు వందలమందికి పైగా గర్భిణులు వస్తుంటారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో గిరిజనులే ఉంటారు. ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, దుమ్ముగూడెం వంటి మండలాల నుంచి వచ్చే రోగుల్లో ఎక్కువగా రక్తహీనత లోపం ఉంటుంది. ఈ నేపథ్యంలో గిరిజన రోగులతో పాటు అత్యవసర సేవల అవసరార్థం ఏరియా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఆర్‌ఎంవో స్థాయి వైద్యుడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, రక్తాన్ని సేకరించేందుకు గాను ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్‌లు ఉన్నారు.
ప్రతీ రోజు పది మందికి పైగానే ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు, అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అందించేందుకు తప్పని సరిగా పది బాటిళ్ల వరకూ రక్తం అవసరం ఉంటుంది. అయితే ఆస్పత్రి నిర్వాహకుల పుణ్యమా అని ఈ కేంద్రం మూతపడడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్తం నిల్వలు లేకపోవటంతో ఇక్కడి వైద్యులు రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. దీంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చే గిరిజనుల అవస్థలు అన్నీఇన్నీ కావు. గత నెల రోజులుగా ఇదే తంతు జరుగుతున్నా ఏరియా ఆసుపత్రి నిర్వాహకులు చోద్యం చూస్తుండటం వారి పనితీరుకు అద్దం పడుతుంది. గిరిజనులకు రక్తనిధి కేంద్రం నుంచి రక్తం ఎంతో అవసరమని తెలిసి కూడా అధికారులు దీనిపై దృష్టి సారించకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఎందుకిలా జరిగిందంటే....
వాస్తవంగా రక్తనిధి కేంద్రం నిర్వహించాలంటే హైదరాబాద్‌లో ఉన్న బ్లడ్‌బ్యాంక్ సెల్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తనిధికేంద్రంలో అవసరమైన పరికరాలు లేవంటూ ఎన్‌ఓసీ ఇచ్చేందుకు వారు నిరాకరించారు. ఆసుపత్రిలో రెండు రిఫ్రిజిరేటర్‌లు, ఒక బ్లడ్ కలెక్షన్ మానిటర్, బాటిల్ సీలర్ ఉండాలి. కానీ ఆస్పత్రిలో ఇక రిప్రిజరేటర్ మాత్రమే ఉంది. మిగతా పరికరాలు ఏవీ అందుబాటులో లేవు. వీటిని కొనుగోలు చేసేందుకు కనీసం రూ.5 నుంచి 6 లక్షల వరకూ నిధులు అవసరం. ఈ నేపథ్యంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఏరియా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని గత నెల 6న సీజ్ చేశారు. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆసుపత్రి నిర్వాహకులు పట్టించుకోకపోవటంతోనే....
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి 2000 సంవత్సరం నుంచి కూడా ఎన్‌వోసీ లేదు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నుంచి నోటీసులు వచ్చినప్పడల్లా ఇక్కడి రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో పనిచేసిన వైద్యులు పరిస్థితిని ఐటీడీఏ పీవో, ఏపీవీవీపీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదో రూపేణా బ్లడ్ బ్యాంక్‌మూత పడకుండా నడిపించారు. కొత్తగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా ఇదే రీతిన నడిపిస్తున్నారు. కానీ భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రస్తుత నిర్వాహకులు దీనిపై తమకు సంబంధం లేనట్లు వ్యవహరించటంతోనే కేంద్రం మూత వేసే వరకూ వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి రక్త నిధి కేంద్రాన్ని తక్షణమే తెరిచేలా తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : విజయారావు, సూపరింటెండెంట్
నిర్వహణ కోసం తగిన పరికరాలు లేవనే కారణంతో రక్తనిధి కేంద్రాన్ని మూసివేయమని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఈవిషయాన్ని ఐటీడీఏ పీవో వీరపాండియన్ దృష్టికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం కొన్ని పరికరాలు వచ్చాయి. త్వరలోనే రక్తనిధి కేంద్రాన్ని తెరిపిస్తాం.
ప్రసవానికి వచ్చి...రక్తం లేక వేచిచూపులు...
అశ్వాపురం మండలం మొండికుంట నుంచి తెల్లం తులసి అనే గిరిజన మహిళ సోమవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఆమెకు పరీక్షలు నిర్వహించగా రక్తం తక్కువగా ఉందని తేలింది. రక్తం ఎక్కిస్తేనే గానీ ప్రసవం చేసే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. అయితే ఇక్కడ రక్తనిధి కేంద్రం మూతబడడంతో ఆమెకు పడిగాపులు తప్పలేదు. దాతలు ముందుకొచ్చి రక్తం ఇస్తే తప్ప ఆమెకు ప్రసవం అయ్యే అవకాశం లేదు. మంగళవారం వరకూ ఆమెను పరిశీలనలో ఉంచి ఆ తరువాత అవసరమైతే కొత్తగూడెం లేదా ఖమ్మం పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు.
ఏదీ ‘రక్తనిధి’ !?
Published Tue, Dec 10 2013 5:32 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement