సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదంలో 54, హోమియోలో 33, యునానిలో 69 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆగస్టు ఏడో తేదీ ఉదయం 10.30 గంటల నుంచి అదే నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకోసం mhsrb.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 37, మల్టీ జోన్–2లో 17 పోస్టులను భర్తీ చేస్తారు. హోమియో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 23, మల్టీ జోన్–2లో 10 పోస్టులను భర్తీ చేస్తారు.
యునానీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 36, మల్టీ జోన్–2లో 33 భర్తీ చేస్తారు. అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18–44 ఏళ్ల వయసుగల వారై ఉండాలి. ఈ పోస్టుల పేస్కేల్ రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. ఖాళీలను చేర్చడం లేదా తొలగించడం.. ఏదైనా ఉంటే ఫలితాల ప్రకటన వరకు చేస్తారు.
100 పాయింట్ల ఆధారంగా ఎంపిక..
అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. సంబంధిత అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు.
మెరిట్ జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సందర్భంగా అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలను కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, సంబంధిత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), లోకల్ ఏరియా కోసం స్టడీ సర్టిఫికెట్ (1 నుంచి 7వ తరగతి), కమ్యూనిటీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ), బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ కోరే దరఖాస్తుదారులకు తాజా ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము కింద ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు తప్పని సరిగా రూ. 200 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత రిఫరెన్స్ ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు.
Comments
Please login to add a commentAdd a comment