1,099 వైద్య సిబ్బంది పోస్టులు | Telangana Health Department Recruitment | Sakshi
Sakshi News home page

1,099 వైద్య సిబ్బంది పోస్టులు

Published Tue, May 9 2017 2:52 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

1,099 వైద్య సిబ్బంది పోస్టులు

1,099 వైద్య సిబ్బంది పోస్టులు

మెడికల్‌ కాలేజీలకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఉస్మానియా బోధనాసుపత్రికి 299 పోస్టులు
గాంధీ మెడికల్‌ కాలేజీకి 169 పోస్టులు మంజూరు
ఎంసీఐ నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తున్నట్లు వెల్లడి
టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు..
ఆలస్యమైతే కాంట్రాక్టు ప్రాతిపదికన..


సాక్షి, హైదరాబాద్‌
వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటి పరిధిలోని బోధనాసుపత్రులకు 1,099 వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల యూనిట్లు, బోధన సిబ్బందిని పెంచాల్సిన అవసరమున్నందున వీటిని మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వైద్యులపై పని ఒత్తిడి పెరగడం, సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల తల్లీబిడ్డల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో సర్కారు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులోని 111 అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యమైతే తక్షణం కాంట్రాక్టు ప్రాతిపదికన కూడా భర్తీ చేసే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

ఉస్మానియాకు 299 పోస్టుల మంజూరు
ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, దాని పరిధిలోని ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా 30 యూనిట్లు మంజూరు చేసింది. గైనకాలజీ విభాగంలో ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి 10 అసోసియేట్, 20 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేసింది. పీడియాట్రిక్స్‌ విభాగంలో 4 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 8 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆసుపత్రికి 42 స్టాఫ్‌నర్సులు, ఇతర పోస్టులను మంజూరు చేసింది. పేట్లబుర్జు ఆసుపత్రికి పీడియాట్రిక్స్‌ విభాగంలోనే 10 స్టాఫ్‌నర్సు పోస్టులను మంజూరు చేశారు. ఇక సైకియాట్రీ విభాగంలో ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, రెండు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను, ఈఎన్‌టీ విభాగంలో రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేశారు. ఆర్థోపెడిక్స్‌ విభాగంలో ఒక అసోసియేట్, రెండు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేశారు. రేడియో డయాగ్నసిస్‌ విభాగంలో నాలుగు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 8 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను, అనస్థీషియా విభాగంలో 8 అసోసియేట్, 16 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేశారు.

‘కాకతీయ’కు 252 పోస్టులు
గాంధీ మెడికల్‌ కాలేజీకి 169 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగా 16 యూనిట్లు నెలకొల్పిన నేపథ్యంలో అక్కడ వైద్య సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనిక్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, అనస్థీషియా, రేడియో థెరపీల్లో పోస్టులను మంజూరు చేసింది. అలాగే కాకతీయ మెడికల్‌ కాలేజీ, దాని పరిధిలోని ఎంజీఎం ఆసుపత్రి సహా మరికొన్నింటికి 25 యూనిట్లు కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 10 విభాగాల్లో 252 పోస్టులను మంజూరు చేసింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ మెడికల్‌ కాలేజీకి కొత్తగా 20 యూనిట్లు, 189 పోస్టులను మంజూరు చేసింది. నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 20 యూనిట్లు, 190 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

మెడికల్‌ కాలేజీల వారీగా యూనిట్లు, పోస్టుల వివరాలు
మెడికల్‌ కాలేజీ            యూనిట్లు           పోస్టులు
1) ఉస్మానియా               30                 299
2) గాంధీ                        16                 169
3) కాకతీయ                   25                 252
4) ఆదిలాబాద్‌ రిమ్స్‌        20                189
5) నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ    20    190
మొత్తం                        111              1,099

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement