సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయన్న అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటులో ఎక్కడా బెడ్స్ దొరకకపోవడం, భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంతో సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 107 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం 17,081 పడకలను సిద్ధం చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను అందజేసింది.
ప్రస్తుత పరిస్థితి, కరోనా చికిత్స కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆ నివేదికలో వివరించింది. మొత్తం పడకల్లో 15,465 ఐసోలేషన్‌వి కాగా, వాటిల్లో 3,537 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేశారు. మిగిలిన 11,928 బెడ్స్‌కు కూడా ఆక్సిజన్ లైన్స్ వేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. ఇవిగాక ఐసీయూ పడకలు 1145, వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పడకలు 500 సిద్ధంగా ఉంచినట్లు సర్కారు కేంద్రానికి వివరించింది.
పరీక్షల సామర్థ్యం 13,405...
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీల్లో ప్రతీ రోజూ కరోనా నిర్దారణ చేసే పరీక్షల సామర్థ్యం 13,405 ఉన్నట్లు నివేదికలో తెలిపింది. అందులో ప్రభుత్వ లేబరేటరీల్లో 5 వేలు కాగా, ప్రైవేటు లేబరేటరీల్లో 8,405 ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 13 లేబరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, 18 ప్రైవేటు లేబరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది.
4,489 మంది వైద్య సిబ్బంది భర్తీ...
ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు 4,489 మంది సిబ్బంది భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఇప్పటికే చాలావరకు భర్తీ పూర్తయిందని సర్కారు తెలిపింది. గాంధీ ఆసుపత్రికి అదనంగా 665 మందిని, అన్నిచోట్లా కలిపి స్టాఫ్ నర్సులు 1,640 మంది, టిమ్స్‌లో 662 మంది, కోవిడ్ లేబరేటరీలకు 111 మందిని అదనంగా భర్తీ చేస్తున్నారు. వాటిల్లో చాలావరకు భర్తీ ప్రక్రియ పూర్తయింది.
హైదరాబాద్‌లో మిగిలినచోట్ల 1,367 వైద్య సిబ్బందిని, 44 మంది ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నారు. ఇదిలావుంటే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వెంటిలేటర్లు, ఐసోలేషన్ పడకలు, ఇతరత్రా యంత్ర పరికరాల కోసం ప్రభుత్వం రూ. 475 కోట్లు మంజూరు చేసినట్లు నివేదికలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి రెండు చొప్పన కోటి క్లాత్ మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపింది.
గాంధీ ఆసుపత్రిలో పడకల సామర్థ్యం 2,100కు పెంపు
కోవిడ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా గాంధీ ఆసుపత్రిని మార్చినట్లు సర్కారు తెలిపింది. అందులో ఇప్పటికే పడకల సామర్థ్యాన్ని 1012 నుంచి 1500కు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని 2,100 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో వెయ్యి పడకలకు ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఉంది. అదనంగా మరో 700 పడకలకు ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అందులో 350 వెంటిలేటర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment