సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈ గా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితిని 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదనపు డీఎంఈ పదోన్నతి ప్రక్రియను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
డీఎంఈ (వైద్య విద్య డైరెక్టర్), అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ పోస్టుల వయోపరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో మంత్రి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే గవర్నర్ తిరస్కరించినా దీన్ని ఎలా అమలు చేస్తారన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ స్పష్టత ఇవ్వలేదు.
బిల్లును తిరిగి గవర్నర్‌కు పంపే ప్రక్రియను ప్రారంభిస్తారా? లేక ఏం చేస్తారన్న దానిపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నిర్ణయంతో డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ పోస్టుల్లో ఉన్న వారి వయో పరిమితి పెరుగుతుంది. డీఎంఈ రమేష్‌రెడ్డి కొనసాగింపునకు ఎలాంటి అవరోధం ఉండదని చెబుతున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పదోన్నతి
బుధవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ల బదిలీల విషయంలో ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డీఎంఈ రమేష్ రెడ్డిని ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తిచేసి వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు.
వైద్య విధాన పరిషత్‌లోని మొత్తం 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అందులోనే 371 నర్సు పదోన్నతుల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే 10 రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నెల రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని వెల్లడించారు.
అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్‌కు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
పీఎంపీ, ఆర్‌ఎంపీలకు శిక్షణ
ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు శిక్షణ ఇచ్చే విషయంపై వైద్యాధికారులకు హరీశ్‌రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై వారం రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక రూపొందించేలా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పీఎంపీ, ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం సరికాదని జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు.
కాగా, డెంగీ వ్యాధి చికిత్సలో ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ మిషన్లను రూ.10 కోట్లతో వెంటనే కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వీటివల్ల సకాలంలో రోగ నిర్ధారణ జరిగి సత్వరం చికిత్స అందించడానికి వీలవుతుంది. కాగా, కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు, 204 అత్యవసర 108 వాహనాలు, భౌతికకాయాలను తీసుకెళ్లే 34 వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment