లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో అతి కీలకమైన బిల్లింగ్ విభాగానికి యాజమాన్యం సరికొత్త హంగులను సమకూర్చింది. ఆస్పత్రిలో మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగానికి మోక్షం లభించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్‌పేషేంట్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులను ఈ విభాగం నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విభాగం పాత బిల్డింగ్‌లో ఓ మూలకు ఉన్నట్టుగా ఉండేది.
ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే రోగులు డిశ్చార్జి సమయంలో తీవ్ర జాప్యం ఎదురయ్యేది. బిల్లింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ విభాగం ఆరంభంలో రోజుకి కేవలం 400 మంది రోగులు మాత్రమే ఓపీ సేవలు పొందేవాళ్లు. ప్రస్తుతం దాదాపుగా మూడు వేల మంది వరకు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రి పడకల సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం 1500 పడకల వరకు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు. అయినా బిల్లింగ్ విభాగం మాత్రం నానాటికి సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. గతంలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ విభాగంలో విధులు నిర్వహించే పరిస్థితి. వాళ్లలో 11 మంది పదవీ విరమణ చెందారు. ఆ స్థానంలో ఎలాంటి భర్తీలు చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది పాటి సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ విభాగం ఆధారపడి పని చేస్తుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ఓ మూలకు ఉండే బిల్లింగ్ విభాగానికి సర్వ హంగులు కల్పిస్తూ.. సరికొత్త విభాగాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్రావు చొరవతో తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ నిర్మించిన ఈ విభాగాన్ని సోమవారం ఉదయం ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించనున్నారు. పేషెంట్ కేర్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లింగ్ విభాగాన్ని ఆధునీకరించిన విధంగా ఆ విభాగం సిబ్బందిని కూడా బలపేతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఆ దిశగా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పుడు రోగులకు సకాలంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment