Billing
-
నిమ్స్ బిల్లింగ్ విభాగానికి మోక్షం
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో అతి కీలకమైన బిల్లింగ్ విభాగానికి యాజమాన్యం సరికొత్త హంగులను సమకూర్చింది. ఆస్పత్రిలో మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగానికి మోక్షం లభించింది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్పేషేంట్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపులను ఈ విభాగం నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ విభాగం పాత బిల్డింగ్‌లో ఓ మూలకు ఉన్నట్టుగా ఉండేది. ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి వెళ్లే రోగులు డిశ్చార్జి సమయంలో తీవ్ర జాప్యం ఎదురయ్యేది. బిల్లింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యమవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ విభాగం ఆరంభంలో రోజుకి కేవలం 400 మంది రోగులు మాత్రమే ఓపీ సేవలు పొందేవాళ్లు. ప్రస్తుతం దాదాపుగా మూడు వేల మంది వరకు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రి పడకల సామర్ధ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 1500 పడకల వరకు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు. అయినా బిల్లింగ్ విభాగం మాత్రం నానాటికి సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. గతంలో 18 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ విభాగంలో విధులు నిర్వహించే పరిస్థితి. వాళ్లలో 11 మంది పదవీ విరమణ చెందారు. ఆ స్థానంలో ఎలాంటి భర్తీలు చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది పాటి సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ విభాగం ఆధారపడి పని చేస్తుందన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓ మూలకు ఉండే బిల్లింగ్ విభాగానికి సర్వ హంగులు కల్పిస్తూ.. సరికొత్త విభాగాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు చొరవతో తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ నిర్మించిన ఈ విభాగాన్ని సోమవారం ఉదయం ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించనున్నారు. పేషెంట్ కేర్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్లింగ్ విభాగాన్ని ఆధునీకరించిన విధంగా ఆ విభాగం సిబ్బందిని కూడా బలపేతం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఆ దిశగా యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పుడు రోగులకు సకాలంలో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ విభాగం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఆన్లైన్ అంతంతే!
డిస్కంలో 11 శాతం మించని ఆన్లైన్ చెల్లింపులు ఈ సేవా, ఈఆర్ఓ కేంద్రాలపైనే ఆధారపడుతున్న ప్రజలు అవగాహన లేనందునే: నిపుణులు సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్పీడీసీఎల్)లో ఆన్లైన్ బిల్లింగ్ అంతంత మాత్రంగానే నమోదవుతోంది. వినియోగదారులు ఇంటి నుంచే నేరుగా విద్యుత్ బిల్లు చెల్లించే అవకాశాన్ని డిస్కం కల్పించినప్పటికీ..ఆన్లైన్ బిల్లింగ్ ప్రక్రియపై ఇప్పటికీ చాలా మందికి అవగాహక లేదు. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్న వారు సైతం ఇప్పటికీ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్ఓ), ఈ సేవా కేంద్రాలపైనే ఆధారపడుతుండటం విశేషం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 40 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో గృహ, వాణిజ్య కనెక్షన్లు 36 లక్షలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల రూపంలో ప్రతి నెలా వీటి నుంచి రూ.440–445 కోట్లు సమకూరుతోంది. డిస్కం ఖాతాలోకి ఆన్లైన్ ద్వారా 11 శాతం మాత్రమే రెవెన్యూ వచ్చి చేరుతోంది. రంగారెడ్డి నార్త్ సర్కిల్లో ఆన్లైన్ బిల్లింగ్ రికార్డుస్థాయిలో 20.5 శాతం నమోదవుతుండగా, హైదరాబాద్ నార్త్ సర్కిల్లో 17 శాతం, హైదరాబాద్ సెంట్రల్, సౌత్‌లో 12 శాతం, రంగారెడ్డి ఈస్ట్ సర్కిల్లో 6 శాతం, రంగారెడ్డి సౌత్‌లో అత్యల్ప ంగా రికార్డవుతోంది. వాట్సాప్ సర్వీసుపై కొరవడిన నిఘా: క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. ఇందులో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కూడా వీలు పడటం లేదు. అత్యవసర సమయంలో ఫోన్ చేస్తే క్షేత్రస్థాయి అధికారులు ఎత్తడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల సత్వర పరిష్కారం కోసం పోలీసుశాఖ సహా జీహెచ్ఎంసీ, జలమండలి ఇప్పటికే వాట్సాప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కీలకమైన విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు దీనిపై దృష్టి సారించక పోవడం గమనార్హం. రూ.50 వేలకుపైగా బకాయి పడిన వినియోగదారుల పేర్లు, సర్వీసు నెంబర్ వగైరా వివరాలను ఆన్లైన్లో ఉంచుతున్న అధికారులు, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయక పోవడంతో బిల్లు చెల్లించిన వినియోగదారుల వివరాలు కూడా బకాయిదారుల జాబితాలో కన్పిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో చెల్లింపులు ఇలా.. ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత గుగూల్లోకి వెళ్లాలి. టీఎస్ఎస్పీడీసీఎల్ క్లిక్ చేస్తే మెనూ డిసిప్లే అవుతోంది. ఆన్లైన్ సర్వీసులో బిల్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత బిల్‌డెస్క్, పే యువర్ మనీ, సిట్రూస్ ఆప్షన్స్ వస్తాయి. జిల్లా, ఈఆర్ఓ, సర్వీసు నెంబర్, యూనిక్ సర్వీసు నెంబర్ యాడ్ చేయాలి. క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డు ఆప్షన్స్‌లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. చెల్లించాల్సి మొత్తాన్ని ఎంటర్ చేసి, ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. కార్డ్ నెంబర్, తేదీ, నెల, సంవత్సరం, పేరు వగై రా వివరాలన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇలా చెల్లించిన విద్యుత్ బిల్లు నేరుగా డిస్కం ఖాతాలోకి వెళ్తుంది. ఇందుకు చెల్లించే సర్వీస్ టాక్స్ ఈసేవ కేంద్రాల్లో చెల్లించే దాంతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో సమయం ఆదా అవడంతో పాటు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం ఉండదు. -
ఇక బిల్లింగ్ లేని షాపింగ్!
• వస్తువుల్ని గుర్తించి బిల్లు తీసుకునే టెక్నాలజీ... • అమెరికాలో అమెజాన్ కొత్త స్టోర్ • అదే దిశగా ఇతర దిగ్గజాల ప్రయత్నాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపులోకి వెళ్లేటపుడు మీ మొబైల్‌ని అక్కడుండే కియోస్క్‌పై ఒకసారి ఉంచి... లోపలికి వెళ్ళిపోయారనుకోండి. ఇక లోపలికెళ్లి కావాల్సినవి బ్యాగులో వేసుకుని... ఎవ్వరితో పనిలేకుండా... ఎలాంటి బిల్లింగ్ లేకుండా బయటకు బ్యాగు పట్టుకుని ఎంచక్కా వచ్చేశారనుకోండి!! ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి!!. ఇది కేవలం ఊహలకే పరిమితం కాదు. ప్రయోగాల దశ నుంచి అమలుకు కూడా వచ్చేసింది. తొలిసారిగా అమెరికాలోని తన సొంత స్టోర్‌లో అమెజాన్ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వివరాలు చూడండి... ఇపుడు చాలా షాపుల్లో ప్రధాన సమస్య బిల్లింగే. ఎంతమంది వచ్చినా పెద్ద దుకాణాలైతే ఐదారు బిల్లింగ్ కౌంటర్లుంటాయి. జనం ఎక్కువ కనక క్యూలో నిల్చోక తప్పదు. చాలామంది కొనుగోలుదారులను చికాకు పరిచే అంశమిదే. వారాంతాల్లో అయితే క్యూలు మరీ పెద్దగా ఉంటాయి. అందుకే అమెజాన్ వంటి సంస్థలు దీన్ని టెక్నాలజీతో పరిష్కరించడానికి నడుం కట్టాయి. ‘అమెజాన్ గో’తో ఆరంభం... ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్... రిటైల్ రంగంలో ఈ టెక్నాలజీ సంచలనానికి తెరలేపుతూ ‘అమెజాన్ గో’ పేరిట అమెరికాలోని సీటెల్‌లో ఓ దుకాణం తెరిచింది. ఈ షాప్‌లో బిల్లింగ్ కౌంటర్లుండవు. వినియోగదారు ఔట్‌లెట్‌లోకి వెళ్లగానే తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ‘గో’ యాప్‌ను తెరిచి ఎంట్రెన్స్‌లోని కియోస్క్‌పై స్కాన్ చేయాలి. ఆ తరవాత లోపలికి వెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకుని బ్యాగులో వేసుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలానే కంప్యూటర్ విజన్, సెన్సార్ ఫ్యూషన్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీని కంపెనీ వాడింది. అరల నుంచి కస్టమర్ ఏ ఉత్పత్తి తీసినా, అక్కడే తిరిగి పెట్టినా ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది. కస్టమర్ దగ్గరున్న వస్తువుల్ని ఇట్టే తెలుసుకుంటుంది. ఇవన్నీ వర్చువల్ కార్ట్‌లో నమోదవుతాయి. షాప్ నుంచి బయటకు వస్తున్నపుడే... ఎగ్జిట్ వద్ద వినియోగదారు తాలూకు అమెజాన్ ఖాతా నుంచి చెల్లింపులు పూర్తయిపోతాయి. ఎలాంటి బిల్లింగ్ సమస్యా లేకుండా బయటకు వచ్చేయొచ్చు. అదీ కథ. లైన్లు ఉండకూడదనే.. ‘‘క్యూ లైన్లు, చెక్ ఔట్లు లేకుండా కస్టమర్లకు షాపింగ్ అనుభూతి కల్పించాలన్న ఆలోచన నాలుగేళ్ల కిందటే వచ్చింది. అవసరమున్నవి తీసుకొని వెళ్లిపోయేలా జస్ట్ వాకౌట్ టెక్నాలజీతో స్టోర్‌ను డిజైన్ చేయాలనుకున్నాం. దానికి ప్రతీకే అమెజాన్ గో. ప్రస్తుతానికి ఈ సేవలు సంస్థ ఉద్యోగులకు మాత్రమే అందిస్తున్నాం. 2017 ప్రారంభం నుంచీ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఇలాంటివి 2,000 స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది మా ఆలోచన’’ అని అమెజాన్ వెల్లడించింది. యూకేలోనూ అమెజాన్ గో ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది. అదే బాటలో వాల్‌మార్ట్... అమెజాన్ మాదిరే క్రోగర్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు కూడా ఈ–కామర్స్, డిజిటల్ విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. అమెరికన్ రిటైల్ దిగ్గజం క్రోగర్... ఇప్పటికే పలు ఔట్లెట్లలో స్కాన్–బ్యాగ్–గో టెక్నాలజీని పరీక్షించింది. వాల్‌మార్ట్‌కు చెందిన రిటైల్ చైన్ సామ్స్ క్లబ్... స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్కాన్ అండ్ గో టెక్నాలజీని వాడుతోంది. కస్టమర్ తాను తీసుకున్న వస్తువుల్ని యాప్‌లోని బార్కోడ్ రీడర్‌తో స్కాన్ చేయాలి. యాప్ నుంచే క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లించాలి. ఎగ్జిట్ డోర్ దగ్గరున్న స్టోర్ ఉద్యోగికి స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ బిల్లు చూపిస్తే చాలు. ఈ టెక్నాలజీలన్నీ వినియోగంలోకి వస్తే... అవి భారత్‌కు రావటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!!. -
జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?
♦ సందేహాలున్నాయి: నాస్కామ్ ♦ బిల్లింగ్, రివర్స్ చార్జీపై స్పష్టతకు డిమాండ్ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు 2017 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో... క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాలు సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ ప్రకటించింది. దిగుమతి చేసుకునే సేవలపై విధించే రివర్స్ చార్జీ... ఎగుమతుల్ని దెబ్బతీసేలా ఉండరాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో జీఎస్టీ ఆమోదంపై హర్షం ప్రకటిస్తూ... నూతన బిల్లు పన్నుల వ్యవస్థను గాడిలో పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, దీన్ని మరింత పారదర్శకంగా మార్చాలని కోరింది. నాస్కామ్ అభ్యంతరాలు ⇔ దేశవ్యాప్తంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రం వద్ద నమోదు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం. ⇔ క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాల కారణంగా ఐటీ రంగం ఎగుమతి పోటీతత్వంపై ప్రభావం పడుతుంది. ⇔ ఎగమతి చేసే సేవల కోసం దిగుమతి చేసుకునే సర్వీసులపై విధించే రివర్స్ చార్జీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పన్ను రూపంలో చెల్లింపులతో మూలధనం వినియోగించుకునే వీలు లేకుండా పోతుంది. బిల్లులో ఏమున్నదో చూడాలి ‘ఎగుమతి ఆధారిత కంపెనీలు దిగుమతి చేసుకునే సేవలపై (ఈఆర్పీ లెసైన్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ) సేవాపన్ను పడుతుంది. అయితే, తర్వాత ఈ పన్ను రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇది సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు రివర్స్ చార్జీ కేవలం సేవలపైనే ఉంది. జీఎస్టీతో ఇది సరుకులకూ విస్తరిస్తుంది. అయితే, ఏవి సరుకులు, ఏవి సేవలు అనే దానిపై ఏం చెప్పారో చూడాల్సి ఉంది’ - సలోనీ రాయ్, డెలాయిట్ సీనియర్ డెరైక్టర్ వినియోగదారుడు.. పరిశ్రమకూ మేలే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల మాట న్యూఢిల్లీ: జీఎస్టీతో సరఫరా వ్యవస్థ స్థీరీకరణ చెందుతుందని, సరుకుల రవాణా భారం తగ్గుతుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారులు పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ మరింత సులభంగా మారుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమ) తెలిపింది. లావాదేవీల ఖర్చు, రవాణా వ్యయం తగ్గడం ద్వారా స్థానిక తయారీ రంగం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రయోజనం.. పన్ను రేటు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఇది క్రమంగా వినియోగదారుడికి బదిలీ అవుతుంది. సరఫరా వ్వవస్థ్థీరీకరణకు, రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు మా వంటి బ్రాండెడ్ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. - మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ వినియోగదారుడికి లాభం.. ధరల పరంగా వినియోగదారుడికి ప్రయోజనం. పరిశ్రమకు సానుకూల పరిణామం. - ఎరిక్ బ్రగాంజా, హెయర్ ఇండియా ప్రెసిడెంట్ వృద్ధి పెరుగుతుంది: మూడిస్ న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు దేశ ఆర్థిక వృద్ధికి అనుకూలమని, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. అయితే, రెవెన్యూ న్యూట్రల్ శ్రేణికి అనుగుణంగా పన్ను రేట్లున్నపుడే ఇది సాధ్యమని స్పష్టం చేసింది. రెవెన్యూ న్యూట్రల్ శ్రేణి అంటే... కొత్త పన్ను వ్యవస్థను అమలు చేసినా కేంద్రం, రాష్ట్రాలు ప్రస్తుతం వస్తున్న ఆదాయం కోల్పోకుండా ఉండేంత స్థాయి. అదే సమయంలో ఇతర వివాదాస్పద సంస్కరణల్లో ప్రగతి నిదానంగా ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం... సంస్కరణల్లో ప్రగతి... కాస్త నిదానంగా రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంటుందన్న తమ అంచనాల ప్రకారమే జరుగుతున్నట్లు మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మారీ డిరోన్ అన్నారు. . ఒకే పన్నుతో ‘ఆటో’ జోరు... స్వాగతమన్న ఆటోమొబైల్స్ జీఎస్టీ విషయంలో ఆటోమొబైల్ రంగం యావత్తూ సానుకూలంగా స్పందిం చింది. ప్రస్తుత భిన్న రకాల పన్నుల వ్యవస్థ స్థిరీకరణ చెందుతుందని ఈ రంగం అభిప్రాయపడింది. ఆటోమోటివ్ పరిశ్రమ ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో లబ్ధి పొందుతుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుగాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రస్తుతం వాహనం కొలతలు, ఇంజన్ సామర్థ్యం ఆధారంగా ఆటో పరిశ్రమపై నాలుగు శ్లాబుల ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. చిన్న కార్లపై (నాలుగు మీటర్లలోపు పొడవు ఉన్నవి) 12 శాతం ఎక్సైజ్ పన్నుంటే... అంతకు మించిన పొడవున్న పెద్ద కార్లపై 24 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇవన్నీ 1500 సీసీ సామర్థ్యంలోపున్నవే. ఈ సామర్థ్యం దాటిన వాటిపై పన్ను ఇంకా అధికంగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి చక్కని అవకాశం... జీడీపీలో తయారీ రంగం నుంచి 45 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతమున్న భిన్న రకాల పన్నుల వ్యవస్థను స్థిరీకరణ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. - యోచిరో యునో, హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ పన్నుల భారం తగ్గుతుంది... వాహన పరిశ్రమపై అధిక పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీతో ఈ భారం తగ్గి, సులభతరమైన, పారదర్శక విధానం వస్తుంది. సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుదలతో పోటీపడగల అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా అవతరిస్తుంది. - రాకేష్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది దేశ ఆర్థిక రంగాన్ని మరింత బలమైన, ఓపెన్ మార్కెట్‌గా జీఎస్టీ చేయగలదు. అంతర్జాతీయంగా మరింత పోటీపడేలా చేస్తుంది. - పవన్ ముంజాల్, చైర్మన్, ఎండీ, హీరోమోటోకార్ప్ ఈ- కామర్స్ వృద్ధికి విఘాతం: పరిశ్రమ మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) జీఎస్టీ నిబంధన ఈ కామర్స్ పోర్టళ్ల (మార్కెట్ ప్లేస్ మోడల్) అభివృద్ధికి పెద్ద విఘాతమని, చిన్న వర్తకులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామర్స్ సంస్థలు తమ వేదిక ద్వారా... వినియోగదారులు ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే మొత్తం నుంచి టీసీఎస్ రూపంలో కొంత మినహాయించాల్సి ఉంటుంది. విక్రయదారులు తమ పన్నులో ఇది సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే, దీని కారణంగా తక్కువ లాభంపై పనిచేసే చిన్న వ్యాపారస్తులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని విశ్లేషకుల అంచనా. దీంతో ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా వ్యాపారం చేసే వారిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని అంటున్నారు. అయితే, ఈ కామర్స్ రంగానికి జీఎస్టీ మంచి ఉత్ప్రేరకమని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. టీసీఎస్‌పై పునఃపరిశీలన అవసరం ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ సంస్కరణల స్ఫూర్తి అమలులో కనిపించాలి. ప్రస్తుత చిక్కుముళ్ల స్థానంలో కొత్త అడ్డంకులను సృష్టించరాదు. - కునాల్ భాయ్, సీఈవో, స్నాప్‌డీల్ సంస్కరణలకు జోష్: ఫిచ్ న్యూఢిల్లీ: ‘వాణిజ్య పరంగా ఉన్న అడ్డంకులను జీఎస్టీ తొలగిస్తుంది. ఇదొక కీలక సంస్కరణ. ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీర్ఘకాలంలో అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. అయితే, స్వల్ప కాలంలో ద్రవ్యలోటు పరంగా ఏమంత ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందడంతో కీలక సంస్కరణల విషయంలో ప్రభుత్వ సామర్థ్య పరంగా సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయిందని అభివర్ణించింది. జీఎస్టీ అమలుతో ప్రభుత్వానికి అధిక పన్ను ఆదాయం సమకూరుతుందా అన్నది వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. పన్ను రేటును ఎంత నిర్ణయిస్తారు వంటి ఎన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తన నివేదికలో ఫిచ్ తెలిపింది.