ఆన్‌లైన్ అంతంతే!
డిస్కంలో 11 శాతం మించని ఆన్‌లైన్ చెల్లింపులు
ఈ సేవా, ఈఆర్‌ఓ కేంద్రాలపైనే ఆధారపడుతున్న ప్రజలు
అవగాహన లేనందునే: నిపుణులు
సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌పీడీసీఎల్)లో ఆన్‌లైన్ బిల్లింగ్ అంతంత మాత్రంగానే నమోదవుతోంది. వినియోగదారులు ఇంటి నుంచే నేరుగా విద్యుత్ బిల్లు చెల్లించే అవకాశాన్ని డిస్కం కల్పించినప్పటికీ..ఆన్‌లైన్ బిల్లింగ్ ప్రక్రియపై ఇప్పటికీ చాలా మందికి అవగాహక లేదు. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్న వారు సైతం ఇప్పటికీ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్‌ఓ), ఈ సేవా కేంద్రాలపైనే ఆధారపడుతుండటం విశేషం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 40 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో గృహ, వాణిజ్య కనెక్షన్లు 36 లక్షలు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల రూపంలో ప్రతి నెలా వీటి నుంచి రూ.440–445 కోట్లు సమకూరుతోంది. డిస్కం ఖాతాలోకి ఆన్‌లైన్ ద్వారా 11 శాతం మాత్రమే రెవెన్యూ వచ్చి చేరుతోంది. రంగారెడ్డి నార్త్ సర్కిల్‌లో ఆన్‌లైన్ బిల్లింగ్ రికార్డుస్థాయిలో 20.5 శాతం నమోదవుతుండగా, హైదరాబాద్ నార్త్ సర్కిల్‌లో 17 శాతం, హైదరాబాద్ సెంట్రల్, సౌత్‌లో 12 శాతం, రంగారెడ్డి ఈస్ట్ సర్కిల్లో 6 శాతం, రంగారెడ్డి సౌత్‌లో అత్యల్ప ంగా రికార్డవుతోంది.
వాట్సాప్ సర్వీసుపై కొరవడిన నిఘా:
క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే 1912 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. ఇందులో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కూడా వీలు పడటం లేదు. అత్యవసర సమయంలో ఫోన్ చేస్తే క్షేత్రస్థాయి అధికారులు ఎత్తడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల సత్వర పరిష్కారం కోసం పోలీసుశాఖ సహా జీహెచ్‌ఎంసీ, జలమండలి ఇప్పటికే వాట్సాప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కీలకమైన విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు దీనిపై దృష్టి సారించక పోవడం గమనార్హం. రూ.50 వేలకుపైగా బకాయి పడిన వినియోగదారుల పేర్లు, సర్వీసు నెంబర్ వగైరా వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్న అధికారులు, వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయక పోవడంతో బిల్లు చెల్లించిన వినియోగదారుల వివరాలు కూడా బకాయిదారుల జాబితాలో కన్పిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఇలా..
ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత గుగూల్‌లోకి వెళ్లాలి. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ క్లిక్ చేస్తే మెనూ డిసిప్లే అవుతోంది. ఆన్‌లైన్ సర్వీసులో బిల్ పేమెంట్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత బిల్‌డెస్క్, పే యువర్ మనీ, సిట్రూస్ ఆప్షన్స్ వస్తాయి. జిల్లా, ఈఆర్‌ఓ, సర్వీసు నెంబర్, యూనిక్ సర్వీసు నెంబర్ యాడ్ చేయాలి. క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డు ఆప్షన్స్‌లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. చెల్లించాల్సి మొత్తాన్ని ఎంటర్ చేసి, ఆ తర్వాత సబ్‌మిట్ చేయాలి. కార్డ్ నెంబర్, తేదీ, నెల, సంవత్సరం, పేరు వగై రా వివరాలన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇలా చెల్లించిన విద్యుత్ బిల్లు నేరుగా డిస్కం ఖాతాలోకి వెళ్తుంది. ఇందుకు చెల్లించే సర్వీస్ టాక్స్ ఈసేవ కేంద్రాల్లో చెల్లించే దాంతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో సమయం ఆదా అవడంతో పాటు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం ఉండదు.