జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి? | How the GST Bill will impact various sectors and stocks | Sakshi
Sakshi News home page

జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?

Published Fri, Aug 5 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?

జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?

సందేహాలున్నాయి: నాస్కామ్
బిల్లింగ్, రివర్స్ చార్జీపై స్పష్టతకు డిమాండ్

న్యూఢిల్లీ: జీఎస్‌టీ బిల్లు 2017 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో... క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాలు సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సాఫ్ట్‌వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ ప్రకటించింది. దిగుమతి చేసుకునే సేవలపై విధించే రివర్స్ చార్జీ... ఎగుమతుల్ని దెబ్బతీసేలా ఉండరాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో జీఎస్‌టీ ఆమోదంపై హర్షం ప్రకటిస్తూ... నూతన బిల్లు పన్నుల వ్యవస్థను గాడిలో పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, దీన్ని మరింత పారదర్శకంగా మార్చాలని కోరింది.

 నాస్కామ్ అభ్యంతరాలు
దేశవ్యాప్తంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రం వద్ద నమోదు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం.

క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాల కారణంగా ఐటీ రంగం ఎగుమతి పోటీతత్వంపై ప్రభావం పడుతుంది. 

ఎగమతి చేసే సేవల కోసం దిగుమతి చేసుకునే సర్వీసులపై విధించే రివర్స్ చార్జీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పన్ను రూపంలో చెల్లింపులతో మూలధనం వినియోగించుకునే వీలు లేకుండా పోతుంది. 

 బిల్లులో ఏమున్నదో చూడాలి
‘ఎగుమతి ఆధారిత కంపెనీలు దిగుమతి చేసుకునే సేవలపై (ఈఆర్‌పీ లెసైన్స్, మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ) సేవాపన్ను పడుతుంది. అయితే, తర్వాత ఈ పన్ను రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇది సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు రివర్స్ చార్జీ కేవలం సేవలపైనే ఉంది. జీఎస్‌టీతో ఇది సరుకులకూ విస్తరిస్తుంది. అయితే, ఏవి సరుకులు, ఏవి సేవలు అనే దానిపై ఏం చెప్పారో చూడాల్సి ఉంది’ -  సలోనీ రాయ్, డెలాయిట్ సీనియర్ డెరైక్టర్

వినియోగదారుడు.. పరిశ్రమకూ మేలే
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల మాట

న్యూఢిల్లీ: జీఎస్‌టీతో సరఫరా వ్యవస్థ స్థీరీకరణ చెందుతుందని, సరుకుల రవాణా భారం తగ్గుతుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారులు పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ మరింత సులభంగా మారుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమ) తెలిపింది. లావాదేవీల ఖర్చు, రవాణా వ్యయం తగ్గడం ద్వారా స్థానిక తయారీ రంగం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొంది.

 పెద్ద ఎత్తున ప్రయోజనం..
పన్ను రేటు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఇది క్రమంగా వినియోగదారుడికి బదిలీ అవుతుంది. సరఫరా వ్వవస్థ్థీరీకరణకు, రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు మా వంటి బ్రాండెడ్ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. - మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్

 వినియోగదారుడికి లాభం..
ధరల పరంగా వినియోగదారుడికి ప్రయోజనం. పరిశ్రమకు సానుకూల పరిణామం.
- ఎరిక్ బ్రగాంజా, హెయర్ ఇండియా ప్రెసిడెంట్

వృద్ధి పెరుగుతుంది: మూడిస్
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలు దేశ ఆర్థిక వృద్ధికి అనుకూలమని, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. అయితే, రెవెన్యూ న్యూట్రల్ శ్రేణికి అనుగుణంగా పన్ను రేట్లున్నపుడే ఇది సాధ్యమని స్పష్టం చేసింది. రెవెన్యూ న్యూట్రల్ శ్రేణి అంటే... కొత్త పన్ను వ్యవస్థను అమలు చేసినా కేంద్రం, రాష్ట్రాలు ప్రస్తుతం వస్తున్న ఆదాయం కోల్పోకుండా ఉండేంత స్థాయి. అదే సమయంలో ఇతర వివాదాస్పద సంస్కరణల్లో ప్రగతి నిదానంగా ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందడం... సంస్కరణల్లో ప్రగతి... కాస్త నిదానంగా రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంటుందన్న తమ అంచనాల ప్రకారమే జరుగుతున్నట్లు మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మారీ డిరోన్ అన్నారు. .

ఒకే పన్నుతో ‘ఆటో’ జోరు...
స్వాగతమన్న ఆటోమొబైల్స్

జీఎస్‌టీ విషయంలో ఆటోమొబైల్ రంగం యావత్తూ సానుకూలంగా స్పందిం చింది. ప్రస్తుత భిన్న రకాల పన్నుల వ్యవస్థ స్థిరీకరణ చెందుతుందని ఈ రంగం అభిప్రాయపడింది. ఆటోమోటివ్ పరిశ్రమ ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో లబ్ధి పొందుతుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుగాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రస్తుతం వాహనం కొలతలు, ఇంజన్ సామర్థ్యం ఆధారంగా ఆటో పరిశ్రమపై నాలుగు శ్లాబుల ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. చిన్న కార్లపై (నాలుగు మీటర్లలోపు పొడవు ఉన్నవి) 12 శాతం ఎక్సైజ్ పన్నుంటే... అంతకు మించిన పొడవున్న పెద్ద కార్లపై 24 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇవన్నీ 1500 సీసీ సామర్థ్యంలోపున్నవే. ఈ సామర్థ్యం దాటిన వాటిపై పన్ను ఇంకా అధికంగా ఉంది.

 ఆటోమొబైల్ రంగానికి చక్కని అవకాశం...
జీడీపీలో తయారీ రంగం నుంచి 45 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతమున్న భిన్న రకాల పన్నుల వ్యవస్థను స్థిరీకరణ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది.
- యోచిరో యునో, హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్

 పన్నుల భారం తగ్గుతుంది...
వాహన పరిశ్రమపై అధిక పన్నులు విధిస్తున్నారు. జీఎస్‌టీతో ఈ భారం తగ్గి, సులభతరమైన, పారదర్శక విధానం వస్తుంది. సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుదలతో పోటీపడగల అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా అవతరిస్తుంది.
- రాకేష్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, హ్యుందాయ్ మోటార్ ఇండియా 

 భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది
దేశ ఆర్థిక రంగాన్ని మరింత బలమైన, ఓపెన్ మార్కెట్‌గా జీఎస్‌టీ చేయగలదు. అంతర్జాతీయంగా మరింత పోటీపడేలా చేస్తుంది.
- పవన్ ముంజాల్, చైర్మన్, ఎండీ, హీరోమోటోకార్ప్

ఈ- కామర్స్ వృద్ధికి విఘాతం: పరిశ్రమ
మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) జీఎస్‌టీ నిబంధన ఈ కామర్స్ పోర్టళ్ల (మార్కెట్ ప్లేస్ మోడల్) అభివృద్ధికి పెద్ద విఘాతమని, చిన్న వర్తకులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామర్స్ సంస్థలు తమ వేదిక ద్వారా... వినియోగదారులు ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే మొత్తం నుంచి టీసీఎస్ రూపంలో కొంత మినహాయించాల్సి ఉంటుంది. విక్రయదారులు తమ పన్నులో ఇది సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే, దీని కారణంగా తక్కువ లాభంపై పనిచేసే చిన్న వ్యాపారస్తులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని విశ్లేషకుల అంచనా. దీంతో ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా వ్యాపారం చేసే వారిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని అంటున్నారు. అయితే, ఈ కామర్స్ రంగానికి జీఎస్‌టీ మంచి ఉత్ప్రేరకమని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

టీసీఎస్‌పై పునఃపరిశీలన అవసరం
ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. జీఎస్‌టీ సంస్కరణల స్ఫూర్తి అమలులో కనిపించాలి. ప్రస్తుత చిక్కుముళ్ల స్థానంలో కొత్త అడ్డంకులను సృష్టించరాదు.   - కునాల్ భాయ్, సీఈవో, స్నాప్‌డీల్

సంస్కరణలకు జోష్: ఫిచ్
న్యూఢిల్లీ: ‘వాణిజ్య పరంగా ఉన్న అడ్డంకులను జీఎస్‌టీ తొలగిస్తుంది. ఇదొక కీలక సంస్కరణ. ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీర్ఘకాలంలో అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. అయితే, స్వల్ప కాలంలో ద్రవ్యలోటు పరంగా ఏమంత ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.  బిల్లు ఆమోదం పొందడంతో కీలక సంస్కరణల విషయంలో ప్రభుత్వ సామర్థ్య పరంగా సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయిందని అభివర్ణించింది. జీఎస్‌టీ అమలుతో ప్రభుత్వానికి అధిక పన్ను ఆదాయం సమకూరుతుందా అన్నది వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. పన్ను రేటును ఎంత నిర్ణయిస్తారు వంటి ఎన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తన నివేదికలో ఫిచ్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement