ఇక బిల్లింగ్ లేని షాపింగ్!
• వస్తువుల్ని గుర్తించి బిల్లు తీసుకునే టెక్నాలజీ...
• అమెరికాలో అమెజాన్ కొత్త స్టోర్
• అదే దిశగా ఇతర దిగ్గజాల ప్రయత్నాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపులోకి వెళ్లేటపుడు మీ మొబైల్‌ని అక్కడుండే కియోస్క్‌పై ఒకసారి ఉంచి... లోపలికి వెళ్ళిపోయారనుకోండి. ఇక లోపలికెళ్లి కావాల్సినవి బ్యాగులో వేసుకుని... ఎవ్వరితో పనిలేకుండా... ఎలాంటి బిల్లింగ్ లేకుండా బయటకు బ్యాగు పట్టుకుని ఎంచక్కా వచ్చేశారనుకోండి!! ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి!!. ఇది కేవలం ఊహలకే పరిమితం కాదు. ప్రయోగాల దశ నుంచి అమలుకు కూడా వచ్చేసింది. తొలిసారిగా అమెరికాలోని తన సొంత స్టోర్‌లో అమెజాన్ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.
ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వివరాలు చూడండి...
ఇపుడు చాలా షాపుల్లో ప్రధాన సమస్య బిల్లింగే. ఎంతమంది వచ్చినా పెద్ద దుకాణాలైతే ఐదారు బిల్లింగ్ కౌంటర్లుంటాయి. జనం ఎక్కువ కనక క్యూలో నిల్చోక తప్పదు. చాలామంది కొనుగోలుదారులను చికాకు పరిచే అంశమిదే. వారాంతాల్లో అయితే క్యూలు మరీ పెద్దగా ఉంటాయి. అందుకే అమెజాన్ వంటి సంస్థలు దీన్ని టెక్నాలజీతో పరిష్కరించడానికి నడుం కట్టాయి.
‘అమెజాన్ గో’తో ఆరంభం...
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్... రిటైల్ రంగంలో ఈ టెక్నాలజీ సంచలనానికి తెరలేపుతూ ‘అమెజాన్ గో’ పేరిట అమెరికాలోని సీటెల్‌లో ఓ దుకాణం తెరిచింది. ఈ షాప్‌లో బిల్లింగ్ కౌంటర్లుండవు. వినియోగదారు ఔట్‌లెట్‌లోకి వెళ్లగానే తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ‘గో’ యాప్‌ను తెరిచి ఎంట్రెన్స్‌లోని కియోస్క్‌పై స్కాన్ చేయాలి. ఆ తరవాత లోపలికి వెళ్లి కావాల్సిన వస్తువులు తీసుకుని బ్యాగులో వేసుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలానే కంప్యూటర్ విజన్, సెన్సార్ ఫ్యూషన్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీని కంపెనీ వాడింది. అరల నుంచి కస్టమర్ ఏ ఉత్పత్తి తీసినా, అక్కడే తిరిగి పెట్టినా ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది. కస్టమర్ దగ్గరున్న వస్తువుల్ని ఇట్టే తెలుసుకుంటుంది. ఇవన్నీ వర్చువల్ కార్ట్‌లో నమోదవుతాయి. షాప్ నుంచి బయటకు వస్తున్నపుడే... ఎగ్జిట్ వద్ద వినియోగదారు తాలూకు అమెజాన్ ఖాతా నుంచి చెల్లింపులు పూర్తయిపోతాయి. ఎలాంటి బిల్లింగ్ సమస్యా లేకుండా బయటకు వచ్చేయొచ్చు. అదీ కథ.
లైన్లు ఉండకూడదనే..
‘‘క్యూ లైన్లు, చెక్ ఔట్లు లేకుండా కస్టమర్లకు షాపింగ్ అనుభూతి కల్పించాలన్న ఆలోచన నాలుగేళ్ల కిందటే వచ్చింది. అవసరమున్నవి తీసుకొని వెళ్లిపోయేలా జస్ట్ వాకౌట్ టెక్నాలజీతో స్టోర్‌ను డిజైన్ చేయాలనుకున్నాం. దానికి ప్రతీకే అమెజాన్ గో. ప్రస్తుతానికి ఈ సేవలు సంస్థ ఉద్యోగులకు మాత్రమే అందిస్తున్నాం. 2017 ప్రారంభం నుంచీ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఇలాంటివి 2,000 స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది మా ఆలోచన’’ అని అమెజాన్ వెల్లడించింది. యూకేలోనూ అమెజాన్ గో ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది.
అదే బాటలో వాల్‌మార్ట్...
అమెజాన్ మాదిరే క్రోగర్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు కూడా ఈ–కామర్స్, డిజిటల్ విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. అమెరికన్ రిటైల్ దిగ్గజం క్రోగర్... ఇప్పటికే పలు ఔట్‌లెట్లలో స్కాన్–బ్యాగ్–గో టెక్నాలజీని పరీక్షించింది. వాల్‌మార్ట్‌కు చెందిన రిటైల్ చైన్ సామ్స్ క్లబ్... స్మార్ట్‌ఫోన్ ఆధారిత స్కాన్ అండ్ గో టెక్నాలజీని వాడుతోంది. కస్టమర్ తాను తీసుకున్న వస్తువుల్ని యాప్‌లోని బార్‌కోడ్ రీడర్‌తో స్కాన్ చేయాలి. యాప్ నుంచే క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లించాలి. ఎగ్జిట్ డోర్ దగ్గరున్న స్టోర్ ఉద్యోగికి స్మార్ట్‌ఫోన్లో డిజిటల్ బిల్లు చూపిస్తే చాలు. ఈ టెక్నాలజీలన్నీ వినియోగంలోకి వస్తే... అవి భారత్‌కు రావటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!!.