ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు చూసి చూడనట్లుగా ఉన్న ఈకామర్స్ దిగ్గజం ఇటీవల ఉద్యోగుల పని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అయితే, యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం.. గత ఏడాది నుంచి సంస్థ ఉద్యోగుల్ని తొలగించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. మరి వారానికి ఎంతమంది ఉద్యోగులు కార్యలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బహుశా! కోవిడ్-19 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి పరిమితమైన ఉద్యోగులే ఆఫీస్‌కు రావాల్సి ఉంటుందని సమాచారం.
ఈ సందర్భంగా అమెజాన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యలయాల నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు సహచర ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార వృద్ది జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టే ఉద్యోగులు ఆఫీసుల్లో ఇతర ఉద్యోగులకు కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీంతో సంస్థ తీసుకునే రోజువారీ నిర్ణయాలు నేరుగా ఉద్యోగులతో చర్చించే వెసులు బాటు కలుగుతుందని తెలిపారు.
అమెజాన్‌లో తొలగింపులు
అయినప్పటికీ, అమెజాన్‌లో ఉద్యోగులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది అమెజాన్ 27,000 మందిని ఇంటికి సాగనంపింది. తన కార్పొరేట్ వర్క్ ఫోర్స్‌లో అధిక శాతం వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరింది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సియోటల్‌లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే దేశీయ టెక్ కంపెనీలు సైతం
మరోవైపు దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో,హెచ్‌సీఎల్‌లు ఉద్యోగులు ఆఫీస్ రావాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వర్క్ ఫోర్స్ కార్యాలయాలకు రానుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఆర్‌వో) మిలింద్ లక్కడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment