తెలంగాణ ఏర్పడ్డాకే వైద్యరంగంలో పురోగతి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పడ్డాకే వైద్యరంగంలో పురోగతి

Published Thu, Jun 15 2023 7:16 AM | Last Updated on Thu, Jun 15 2023 1:04 PM

పురస్కారాలు అందుకున్న ఉద్యోగులతో  మంత్రి ఐకేరెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి తదితరులు - Sakshi

పురస్కారాలు అందుకున్న ఉద్యోగులతో మంత్రి ఐకేరెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి తదితరులు

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర మంత్రి అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పదేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధిపై స్టాళ్లు ఏర్పాటు చేసి వివరించారు. గర్భిణుల్లో రక్తహీనతను నివారించడానికి రెండో విడత న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి పలువురికి కిట్లు అందజేశారు.

ఏఎన్‌ఎంలకు బీపీ ఆపరేటర్లు, ఆశ కార్యకర్తలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో మంత్రి, కలెక్టర్‌ రూ.23.75 కోట్లతో చేపట్టిన 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, రూ.50 లక్షలతో చేపట్టిన 30 పడకల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.166 కోట్లతో వైద్యకళాశాల మంజూరైందని, జూన్‌ నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 24మంది సీనియర్‌ రెసిడెన్స్‌ డాక్టర్లు నియమించగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 22మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించినట్లు తెలిపారు.

వైద్యకళాశాల మొదటి ఏడాది 330 పడకలతో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. మాతృత్వ మరణాలను అరికట్టేందుకు జిల్లాలో ‘అనీమియా సే నిర్మల్‌ ముక్త్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జేవీడీఎస్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దేవేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పలువురికి రాష్ట్ర స్థాయి పురస్కారాలు
జిల్లాలో వైద్యారోగ్యశాఖలో విశిష్ట సేవలందించిన పలువురికి పురస్కారాలు అందజేశారు. ఉత్తమ మెడికల్‌ ఆఫీసర్లుగా మమత (జిల్లా ప్రసూతి ఆస్పత్రి), శ్రీనివాస్‌ (సోన్‌ పీహెచ్‌సీ), గంగాదాస్‌ (జిల్లా ఆయుష్‌ విభాగం), స్టాఫ్‌నర్స్‌ విభాగంలో స్వర్ణలత (ముజ్గి పీహెచ్‌సీ), మాణిక్య వీణ (జిల్లా ఆస్పత్రి), ఫార్మసిస్ట్‌ విభాగంలో ఎస్‌.శ్రీనివాసాచారి (జిల్లా ఆస్పత్రి), వేణుగోపాల్‌ (డీఎంహెచ్‌వో కార్యాలయం), ఉమాదేవి (ఆయుష్‌ విభాగం), భాగ్యరేఖ (ఏఎన్‌ఎం), సంతోష్‌కుమార్‌ (ల్యాబ్‌ అసిస్టెంట్‌), శ్రీనివాస్‌ (ఆరోగ్యమిత్ర), రాజశ్రీ (ఆశ కార్యకర్త), రమేశ్‌ (ల్యాబ్‌టెక్నీషియన్‌) మంత్రి, కలెక్టర్‌ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement