చంద్రపూర్: కరోనా వ్యాక్సిన్‌లు ప్రజలందరూ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం మహారాష్ట్రలోని చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ టీకా బంపర్ లక్కీ డ్రాను ప్రకటించింది. పైగా ఈ లక్కీ డ్రాలో ఎల్‌ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు నుండి వాషింగ్ మెషీన్ల వరకు మంచి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు అని తెలిపింది. అంతేకాదు నవంబర్ 12 నుంచి 24 వరకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్‌ల వద్ద వ్యాక్సిన్‌లు తీసుకున్నవాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.
(చదవండి: విమానాలకు రన్‌వేగా..)
ఈ మేరకు మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించడంతోనే ఈ లక్కీ డ్రా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌర కమీషనర్ రాజేష్ మోహితే కూడా ఇతర అధికారులను, ప్రజలను తమ సమీపంలోని సివిక్-రన్ ఇనాక్యులేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే వ్యాక్సిన్‌లు తీసుకున్నవారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పైగా పౌరసరఫరాల శాఖ ఆరోగ్య విభాగం సుమారు 21 కేంద్రాల్లో టీకాలు వేసే సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రయ విక్రయలు చేసేవాళ్లు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజలతో నిత్యం సంప్రదింపులు చేసే వాళ్లు, తదితరులు కనీసం ఒక్కడోస్ అయిన తీసుకుంటేనే నగరంలోని మార్కెట్‌లోకి అనుమతిస్తామని లేకుంటే అనుమతించేదే లేదని మోహితే చెప్పారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
(చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!)
Comments
Please login to add a commentAdd a comment