Chandrapur
-
ఎన్నికల వింత హామీ.. రేషన్ కార్డుపై విదేశీ మద్యం!
రాబోయే లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీ పోరును తలపిస్తున్నాయి. రాజకీయ నేతలు వీలైనన్ని వాగ్దానాలు చేస్తూ, హామీలనిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఎన్నికల వింత వాగ్దానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన వనితా రౌత్ తనను ఎంపీని చేస్తే, రేషన్ కార్డులపై విదేశీ మద్యం అందజేస్తానని, నిరుద్యోగ యువతకు మద్యం కాంట్రాక్టులు కేటాయిస్తానని హామీనిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వనితా రౌత్ చేస్తున్న వాగ్దానాలను ఇంతకు ముందు ఏ అభ్యర్థి కూడా చేసివుండరు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే ప్రతి గ్రామంలో బార్లను తెరుస్తానని, తనకు వచ్చే ఎంపీ నిధులతో పేదలకు ఉచితంగా మద్యం అందిస్తానని కూడా ఆమె చెబుతున్నారు. దీనికి ముందు వనితా రౌత్ 2019లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే 2019లోనే చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ అసెంబ్లీ నుంచి కూడా ఎన్నికల్లో పోటీకి చేశారు. ఆ సమయంలోనూ ఆమె ప్రజలకు ఇటువంటి హామీలనే ఇవ్వడం విశేషం. -
భయపెట్టి.. హతమార్చి.. చివరికిలా..
సాక్షి,చంద్రాపూర్: ఇరు రాష్ట్రాలను వణికించిన, అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్.. ఎట్టకేలకు చిక్కింది. తెలంగాణ-మహరాష్ట్ర బార్డర్లో మనుషులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఈ పులి. దీని బారిన పడి ఇద్దరు మృత్యువాత చెందారు. అయితే.. భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు చివరికి బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఆ పులిని పట్టేసుకున్నారు. చంద్రపూర్ బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దానిని ట్రేస్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నించారు. ఈ లోపు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరిని హతమార్చింది అది. నాగ్‌భిడ్ తాలూకాలోని టేక్రి షెట్శివార్లో డిసెంబర్ 30న ఒక మహిళపై దాడి చేసి చంపింది. ఆ వెంటనే 31 డిసెంబర్ 2022న బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ భుజ్ షెట్శివార్లో నివసించే మరో మహిళను దాడి చేసి చంపింది. ఈ ఘటనల నేపథ్యంలో బ్రహ్మపురి అటవీశాఖ ప్రాంతంలో అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే టోర్గావ్ వ్యవసాయ శివారులో మహిళను చంపిన ఘటనా స్థలంలో మళ్లీ పులి కనిపించింది. చంద్రాపూర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లొంకర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దీపేష్ మల్హోత్రా మార్గదర్శకత్వంలో బ్రహ్మపురి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, షూటర్ బి.ఎమ్. వంకర్ తదితరులు పులిపై మత్తు ఇంజక్షన్ ప్రయోగించారు. అనంతరం బంధించి పులిని జూకు తరలించారు. ఈ పరిణామం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు
చంద్రపూర్: కరోనా వ్యాక్సిన్లు ప్రజలందరూ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం మహారాష్ట్రలోని చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ టీకా బంపర్ లక్కీ డ్రాను ప్రకటించింది. పైగా ఈ లక్కీ డ్రాలో ఎల్ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు నుండి వాషింగ్ మెషీన్ల వరకు మంచి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు అని తెలిపింది. అంతేకాదు నవంబర్ 12 నుంచి 24 వరకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ల వద్ద వ్యాక్సిన్లు తీసుకున్నవాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) ఈ మేరకు మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించడంతోనే ఈ లక్కీ డ్రా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌర కమీషనర్ రాజేష్ మోహితే కూడా ఇతర అధికారులను, ప్రజలను తమ సమీపంలోని సివిక్-రన్ ఇనాక్యులేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పౌరసరఫరాల శాఖ ఆరోగ్య విభాగం సుమారు 21 కేంద్రాల్లో టీకాలు వేసే సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రయ విక్రయలు చేసేవాళ్లు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజలతో నిత్యం సంప్రదింపులు చేసే వాళ్లు, తదితరులు కనీసం ఒక్కడోస్ అయిన తీసుకుంటేనే నగరంలోని మార్కెట్లోకి అనుమతిస్తామని లేకుంటే అనుమతించేదే లేదని మోహితే చెప్పారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
అయ్యోపాపం.. ఎంత విషాదం!
దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటం.. వేటగాళ్లు పులులను వేటాడి.. వాటి అవశేషాలను విదేశీ మార్కెట్లో భారీ రేటుకు అమ్ముకుంటుండటంతో పులులు కూడా అంతరించిపోయే జాబితాలో చేరిపోయాయి. అయితే, భారత ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఇటీవల పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పులుల సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు పెద్దసంఖ్యలో అవి మృత్యువాత పడుతుండటం ఆందోళన రేపుతోంది. వేటగాళ్లు పంజా విసురుతుండటం, విషాహారానికి లోనవుతుండటం, ఆహారాన్వేషణలో అడవిని వీడి జనావాసాల్లోకి వస్తుండటం పులులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని చిమూర్ అడవిలో ఒక ఆడ పులి తన ఇద్దరు కూనలతో కలిసి మృత్యువాత పడింది. చంద్రపూర్ ప్రాంతంలో పులి, దాని రెండు పిల్లలు ఆకస్మికంగా మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది. పులుల మృతికి కారణమేమిటన్నదానిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై అయ్యోపాపమంటూ జంతుప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
‘నా మాట లెక్క చేయడం లేదు.. రాజీనామా చేస్తా’
ముంబై : సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. చేరికలు, అలకలు, రాజీనామాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థులు పార్టీలు మారుతూ.. అధిష్టానాలకు షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఆడియో టేపు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం అశోక్ శంకర్రావ్ చవాన్ ఓ కార్యకర్తతో తన రాజీనామ విషయం గురించి మాట్లాడుతున్నట్లుగా చెప్పబడుతున్న ఓ ఆడియో టేప్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి గాను కాంగ్రెస్ పార్టీ వినాయక్ బాగ్దేను బరిలో నిలిపింది. దీని గురించి జరిగిన చర్చనే ప్రస్తుతం ఆడియో టేప్‌లో ఉంది. దీనిలో అశోక్‌గా చెప్పబడుతున్న వ్యక్తి చంద్రపూర్ సీటు విషయంలో పార్టీ నిర్ణయం తనకు ఎంతో బాధ కల్గించిందని వాపోయారు. పైగా ప్రస్తుతం పార్టీలో ఎవరూ తన మాట వినడం లేదని.. అందుకే రాజీనమా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఫోన్ కాల్ సంభాషణను అశోక్ చవాన్ ఖండించారు. ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలో తన పేరును ఇరికించాలనుకోవడం భావ్యం కాదని తెలిపారు. అంతేకాక ఏ విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అయితే చంద్రపూర్ సీటు విషయంలో ఫిర్యాదులు ఉన్న మాట వాస్తవమే కానీ.. దాని గురించి బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా లేనని అశోక్ తెలిపారు. -
చంద్రాపూర్ గ్యాంగ్ ‘డబ్బుల్’గేమ్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చంద్రాపూర్ ముఠా డబుల్ గేమ్ బయటపడింది. మంచిర్యాల జిల్లాలోని శివ్వారంలో వేటగాళ్ల ఉచ్చుకు జనవరి 8న బలైన పెద్దపులి ఘటనను ఆసరా చేసుకొని ఈ ముఠా మోసానికి ఒడిగట్టింది. టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ పేరుతో వచ్చిన చంద్రాపూర్ గ్యాంగ్ పులిచర్మాన్ని కొనుగోలు చేయడం అటుంచి, ఆ చర్మంపై డబ్బులు పెట్టి పూజ చేస్తే రెండింతలవుతాయని నమ్మించి రూ. 6 లక్షలు కాజేసి పరారైంది. గోదావరి ఖనికి చెందిన పూర్ణ, ఆసిఫాబాద్‌కు చెందిన పాండు, టీహెచ్ఈఏ అధ్యక్షుడిగా చెప్పుకునే నందు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. పులి చర్మం విక్రయించే నిందితులను, అటవీ అధికారుల ను మోసం చేసి డబ్బులతో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. శివ్వారానికి చెందిన సాయి లు, తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజంలను పులిచర్మంతో మందమర్రికి రప్పించారు. మం దమర్రికి చెందిన అంజయ్య, కొమురయ్య, నర్సయ్య, అంజయ్య కుమారుడు సాగర్లతో మాట్లాడి పూజలకు ఏర్పాటు చేయించారు. ‘పులి చర్మం అమ్ముకునే బదులు దాన్ని దగ్గరుంచుకుని స్వామీజీతో పూజలు చేస్తే డబ్బులు రెట్టింపవుతాయి’ అని వారికి ఆశ చూపారు. రూ.10 లక్షలు తెచ్చుకోమని చెప్పారు. వీరం తా అప్పులు చేసి రూ.6 లక్షలు సమకూర్చుకున్నారు. నందు అండ్ గ్యాంగ్ డబుల్ గేమ్ ఆడుతూ ‘పులి చర్మాన్ని పట్టిస్తాం’ అంటూ అటవీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. 24న పూజలు.. అదేరోజు పరారీ జనవరి 24న అంజయ్య ఇంట్లో స్వామి అవతారమెత్తిన నందు, పాండు, పూర్ణ పులిచర్మంపై రూ. 6 లక్షలు ఉంచారు. కొద్దిసేపటికి డబ్బుతో ఉడాయించారు. పారిపోతూ అంజయ్య ఇంట్లో పులిచర్మం విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి బాధితులను అదుపులోకి తీసుకున్నారు. తాము పులిచర్మాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చినవారిగా నమ్మించి, పులిచర్మాన్ని ప్రభుత్వానికి పట్టించామని థామస్ మీడియా ముందు చెప్పడం గమనార్హం. నిందితులు విచారణలో చెప్పి న నిజాలతో అధికారులు అవాక్కయ్యారు. కాగా ‘టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్’ పేరుతో ఓ వెబ్సైట్ నడుస్తోంది. దీనిలో ఉం చిన నంబర్‌కు ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. పోలీసులు వీరి కాల్‌డేటా ఆధారంగా పట్టుకునే యత్నంలో ఉన్నారు. -
భల్లూకాన్ని బంధించారు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎలుగుబంట్ల హల్చల్ మత్తుమందు ఇచ్చి పట్టుకున్న సిటీ హంటర్ నవాబ్ నెల రోజుల్లో మూడు ఆపరేషన్లు సిటీబ్యూరో: సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ ఉత్తరాదిలో నెల రోజుల వ్యవధిలో మూడు ఆపరేషన్లు పూర్తి చేశారు. బిహార్‌లోని గయ ఫారెస్ట్ డివిజన్‌ను గడగడలాడించిన గజరాజును గత నెల ఆఖరి వారంలో మట్టుపెట్టాడు. ఆ తరువాత అదే ప్రాంతంలో విరుచుకుపడిన 16 ఏనుగుల్లో 15 గజాలను తరి మేసి... మరోదాన్ని బంధించారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ పరిధిలో జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఎలుగుబంట్లలో ఒక దానిని గురువారం బంధించారు. చంద్రాపూర్ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే ఆహ్వానం మేరకు మంగళవారం హుటాహుటిన అక్కడకు వెళ్లి భల్లూకాల పనిపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను షఫత్ అలీ ఖాన్ శుక్రవారం ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. పవర్ ప్రాజెక్ట్ ఏరియాలోకి ప్రవేశించి... చంద్రాపూర్ సమీపంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు అడవికి దగ్గరగా ఉంటుంది. సువిశాలమైన ఈ ప్రాజెక్టు ప్రాంగణంలో సిబ్బంది క్వార్టర్స్, జనావాసాలు, పాఠశాల ఉన్నాయి. గత వారం అటవినుంచి దారి తప్పి వచ్చిన రెండు భల్లూకాలు ప్రాజెక్టు ఏరియాలో ప్రవేశించి ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో రంగంలోకి దిగిన చంద్రాపూర్ ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే మంగళవారం షఫత్ అలీ ఖాన్ సహాయం కోరుతూ ఫోన్ చేయడంతో తక్షణం స్పందించిన ఆయన హుటాహుటిన చంద్రాపూర్ చేరుకున్నారు. బుధవారం అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎలుగుబంట్లు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి ట్రాంక్వలైజింగ్కు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టు ప్రాంగణంలోని పాత క్వార్టర్స్‌లో ఎలుగుబంట్లు సేదతీరుతున్నట్లు గుర్తించిన ఆయన ఆ ప్రాంతంలోనే ట్రాంక్వలైజ్ చేయాలని నిర్ణయించుకుని అందుకు అవసరమైన పరికరా లు, పశువైద్యుడితో అక్కడకు చేరుకున్నారు. పాత క్వార్టర్స్‌లో ‘దొరికింది’... గురువారం మధ్యాహ్నం ఓ ఎలుగును గుర్తించి, మత్తుమందు ఇచ్చి బంధించారు. దీనిపై అలీ ఖాన్ మాట్లాడుతూ... ‘ఇటు ప్రజలకు, అటు ఎలుగుబంటికీ ఎలాంటి హాని లేకుండా ఆపరేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగాం. భల్లూకానికి పూర్తి అనువైన ప్రాంతంలో ట్రాంక్వలైజ్ చేయడం కాస్త కష్టమే అయ్యింది. ట్రాంక్వలైజ్ చేసిన తర్వాత... దానికి మత్తు ఎక్కడానికి కొంత సమయం ఉంటుంది. అప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా దాడి చేసి చంపేస్తుంది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్న ఆ ఎలుగుబంటి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు గుర్తించాం. మత్తు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెడతాం. మరో ఎలుగుబంటి కోసం సెర్చ్ నడుస్తోంది’ అని వివరించారు. -
గడ్చిరోలి, చంద్రపూర్‌లను తెలంగాణలో విలీనం చేయండి
గడ్చిరోలి, న్యూస్‌లైన్: ఓ వైపు ప్రత్యేక విదర్భ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ధర్మారావ్‌బాబా ఆత్రం డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా విదర్భ డిమాండ్ చాలా పాతదని, అయితే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు. అయితే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలన్న అత్రమ్ వ్యాఖ్యలు విదర్భతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం స్వచ్చంద సంస్థలతోపాటు బీజేపీ ఓవైపు ఉద్యమం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌నాయకుడు విలాస్ ముత్తెంవార్ ప్రత్యేక విదర్భ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఎన్సీపీ కూడా మద్దతు పలికింది. అయితే ఇటీవలే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైతే ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యమన్నారు. దీనిపై పరోక్షంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యం కాకపోతే గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. ఇలాచేస్తే తెలంగాణాతో పాటు ఈ రెండు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబై ఈ జిల్లా నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో రాజధానిలో బతుకుతెరువుకోసం ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే తెలంగాణలో విలీనం చేస్తే రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ మారతుందన్నారు. ఈ జిల్లాల నుంచి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా మారితే రాకపోకలకు ఇబ్బందులు ఉండవన్నారు.