
సాక్షి,చంద్రాపూర్: ఇరు రాష్ట్రాలను వణికించిన, అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్.. ఎట్టకేలకు చిక్కింది. తెలంగాణ-మహరాష్ట్ర బార్డర్‌లో మనుషులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఈ పులి. దీని బారిన పడి ఇద్దరు మృత్యువాత చెందారు. అయితే.. భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు చివరికి బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఆ పులిని పట్టేసుకున్నారు.
చంద్రపూర్ బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దానిని ట్రేస్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నించారు. ఈ లోపు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరిని హతమార్చింది అది. నాగ్‌భిడ్ తాలూకాలోని టేక్రి షెట్‌శివార్‌లో డిసెంబర్ 30న ఒక మహిళపై దాడి చేసి చంపింది. ఆ వెంటనే 31 డిసెంబర్ 2022న బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ భుజ్ షెట్‌శివార్‌లో నివసించే మరో మహిళను దాడి చేసి చంపింది.
ఈ ఘటనల నేపథ్యంలో బ్రహ్మపురి అటవీశాఖ ప్రాంతంలో అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే టోర్గావ్ వ్యవసాయ శివారులో మహిళను చంపిన ఘటనా స్థలంలో మళ్లీ పులి కనిపించింది. చంద్రాపూర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లొంకర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, దీపేష్ మల్హోత్రా మార్గదర్శకత్వంలో బ్రహ్మపురి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సబ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, షూటర్ బి.ఎమ్. వంకర్ తదితరులు పులిపై మత్తు ఇంజక్షన్ ప్రయోగించారు. అనంతరం బంధించి పులిని జూకు తరలించారు. ఈ పరిణామం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment