ముంబై : సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. చేరికలు, అలకలు, రాజీనామాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థులు పార్టీలు మారుతూ.. అధిష్టానాలకు షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఆడియో టేపు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం అశోక్ శంకర్రావ్ చవాన్ ఓ కార్యకర్తతో తన రాజీనామ విషయం గురించి మాట్లాడుతున్నట్లుగా చెప్పబడుతున్న ఓ ఆడియో టేప్ ప్రస్తుతం చర‍్చనీయాంశంగా మారింది. చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి గాను కాంగ్రెస్ పార్టీ వినాయక్ బాగ్దేను బరిలో నిలిపింది. దీని గురించి జరిగిన చర్చనే ప్రస్తుతం ఆడియో టేప్‌లో ఉంది. దీనిలో అశోక్‌గా చెప్పబడుతున్న వ్యక్తి చంద్రపూర్ సీటు విషయంలో పార్టీ నిర్ణయం తనకు ఎంతో బాధ కల్గించిందని వాపోయారు. పైగా ప్రస్తుతం పార్టీలో ఎవరూ తన మాట వినడం లేదని.. అందుకే రాజీనమా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఫోన్ కాల్ సంభాషణను అశోక్ చవాన్ ఖండించారు. ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలో తన పేరును ఇరికించాలనుకోవడం భావ్యం కాదని తెలిపారు. అంతేకాక ఏ విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అయితే చంద్రపూర్ సీటు విషయంలో ఫిర్యాదులు ఉన్న మాట వాస్తవమే కానీ.. దాని గురించి బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా లేనని అశోక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment