దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటం.. వేటగాళ్లు పులులను వేటాడి.. వాటి అవశేషాలను విదేశీ మార్కెట్‌లో భారీ రేటుకు అమ్ముకుంటుండటంతో పులులు కూడా అంతరించిపోయే జాబితాలో చేరిపోయాయి. అయితే, భారత ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు చేపట్టిన ప్రత్యేక చర్యలతో ఇటీవల పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పులుల సంఖ్య పెరుగుతున్నా.. మరోవైపు పెద్దసంఖ్యలో అవి మృత్యువాత పడుతుండటం ఆందోళన రేపుతోంది. వేటగాళ్లు పంజా విసురుతుండటం, విషాహారానికి లోనవుతుండటం, ఆహారాన్వేషణలో అడవిని వీడి జనావాసాల్లోకి వస్తుండటం పులులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని చిమూర్ అడవిలో ఒక ఆడ పులి తన ఇద్దరు కూనలతో కలిసి మృత్యువాత పడింది. చంద్రపూర్ ప్రాంతంలో పులి, దాని రెండు పిల్లలు ఆకస్మికంగా మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది. పులుల మృతికి కారణమేమిటన్నదానిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై అయ్యోపాపమంటూ జంతుప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment