రాహుల్.. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇటీవల ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకున్నాడు. సాయంత్రానికి నెగెటివ్ అని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పాజిటివ్ అని మరో మెసేజ్ వచ్చింది. దీంతో ఏది నిజమో తెలియక ఆయన ఆందోళనలో పడిపోయాడు. తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. మూడురోజుల తర్వాత పాజిటివ్ అంటూ ఫలితం వచ్చింది. ఆ మూడురోజులూ ఆయన ఎంతో ఆందోళనకు గురయ్యాడు.
డాక్టర్ కృష్ణ్ణకాంత్ (పేరు మార్చాం)కు, ఆయన భార్యకు ఇద్దరికీ తీవ్రమైన జలుబు, కాస్తంత జ్వరం ఉండటంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. అందులో ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షకు ఇచ్చారు. రెండ్రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో ‘ఇన్‌డిటర్‌మినేట్’(అనిశ్చయత) అని వచ్చింది. తర్వాత మూడో రోజు పాజిటివ్ అంటూ మరో రిపోర్టు పంపారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండగా కొందరి పరీక్షా ఫలితాల్లో ఆలస్యం, గందరగోళం చోటు చేసుకుంటుండడంతో అనుమానితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్‌ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడవుతుండగా కొన్ని కేసుల్లో పాజిటివ్ అని ఒకసారి రిపోర్టు వచ్చిన కాసేపటికే నెగిటివ్ అంటూ మరో రిపోర్టు వస్తోంది. అలాగే ముందు నెగిటివ్ అని చెప్పి తర్వాత పాజిటివ్ అంటున్నారు. ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో సైతం కొన్ని సందర్భాల్లో ఇలాంటి గందరగోళం చోటు చేసుకుంటున్నా.. చాలావరకు కేసుల్లో రెండు మూడు రోజులకు కానీ ఫలితం రావడం లేదు. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో బాధితులు చాలాచోట్ల ప్రై వేట్ లేబరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1,500 వరకు వసూలు చేస్తుండటంతో జేబులు గుల్లవుతున్నాయి.
25 వేల టెస్టుల సామర్థ్యమున్నా...
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 ఆర్టీపీసీఆర్ లేబరేటరీలు ఉన్నాయి. వాటిల్లో రోజుకు 25 వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. అయినా రోజుకు 10 వేల వరకు ఫలితాలు వెయిటింగ్‌లో ఉంటున్నాయి. ఆయా లేబరేటరీలపై సరైన పర్యవేక్షణ కొరవడడంతోనే పరీక్షల నిర్వహణలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున లేబరేటరీలను పూర్తిస్థాయి సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణ సమయంలో కూడా సామర్ధ్యం మేరకు టెస్టులు జరగడం లేదు. జిల్లాల్లోని లేబరేటరీల్లో ఒక్కోచోట రోజుకు 300 వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఆ స్థాయిలో చేస్తే రెండు మూడు రోజుల ఆలస్యం ఉండదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. చాలా లేబరేటరీలు 2 షిఫ్టులు కూడా పనిచేయడం లేదని సమాచారం. ఇంత కీలక సమయంలో ఇటువంటి అంశాలపై అధికారులు దృష్టి్ట పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సరిపడ సిబ్బంది కూడా లేక..
మరోవైపు సెకండ్ వేవ్‌లో నియమించుకున్న ల్యాబ్ టెక్నీషియన్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆ తర్వాత కాలంలో తొలగించడం వల్ల కూడా ఇప్పుడు కీలక సమయంలో పనిచేసేవారు లేకుండా పోయారు. దీంతో తప్పుల తడక రిపోర్టులు, రెండు మూడు రోజుల ఆలస్యంతో నివేదికల వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఆలస్యపు రిపోర్టుల వల్ల పాజిటివా నెగెటివా తెలియక అనుమానితులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. ఇతరులకు అంటిస్తున్నారు. కొందరికి పాజిటివ్ అయినా తెలియక మందులు వాడకపోవడంతో సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా నెలకొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment