సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయాందోళనలతో టెస్టుల కోసం వెళ్లే బాధితులను పరీక్ష కేంద్రాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సకాలంలో వెలువడని ఫలితాలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులైనా ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు కోవిడ్ పరీక్ష ఫీజులను అమాంతం పెంచి నిలువునా దోచుకుంటున్నాయి. వారం, పది రోజుల క్రితం వరకు రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఇప్పుడు ఏకంగా రూ,750 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని కేంద్రాలు రూ.1500 వరకు తీసుకుంటున్నాయి. నగరంలో ప్రస్తుతం ఇదో దందాగా మారింది. కొద్దిపాటి జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నా కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంంతో జనం తప్పనిసరిగా పరీక్షలకు వెళ్లాల్సివస్తోంది.
చదవండి: Corona: తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది..
అక్కడా పడిగాపులే...
నగరంలోని సుమారు 200కుపైగా బస్తీ దవాఖానాలు, మరో 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అన్ని ఏరియా ఆస్పత్రులతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వంటి అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ పరి«ధిలో రోజుకు 50వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అంచనా. ఒక్కో ఆరోగ్య కేంద్రం వద్ద ప్రతిరోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫలితాల వెల్లడిలో మాత్రం తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. బాధితుల తాకిడి, డిమాండ్ మేరకు పరీక్షలు నిర్వహించే సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో, ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనివార్యంగా మారింది.
కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఫలితాల కోసం 48 గంటల పాటు నిరీక్షించాల్సివస్తే మరికొన్ని చోట్ల మూడు రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో బాధితులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సాధారణ జలుబు, జ్వరమో, కోవిడ్ లక్షణాలో తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలో, వద్దో తెలియడం లేదు’ అని సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు.
చదవండి: కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి
‘తమకు తెలియకుండానే కుటుంబ సభ్యులను కూడా వైరస్‌కు గురి చేసినట్లవుతుంద’ని పద్మారావునగర్‌కు చెందిన మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సిబ్బంది కొరత కారణంగానే కొన్ని చోట్ల ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతోందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ‘ప్రతి రోజూ వందలాది మంది నుంచి నమూనాలను సేకరించే క్రమంలో సిబ్బంది సైతం కోవిడ్ బా రిన పడుతున్నారు’అని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు ఒకరు తెలిపారు,
రెండోసారి తప్పనిసరి కాదు..
కోవిడ్ పరీక్షల కోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ‘సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఒమిక్రాన్ బారిన పడినవారు వారం పాటు ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే చాలు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకపోతే ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. మరోసారి పరీక్షలు అవసరం లేదు’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శివరాజ్ తెలిపారు.
వైరస్ ఏదో చెప్పేస్తామంటూ..
బాధితుల అవసరాన్ని, ఆపదను ప్రైవేట్ లాబ్‌లు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువునా దోచుకుంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ కేంద్రాలు పరీక్ష ఫీజులు పెంచేసి దోచుకుంటున్నాయి. ఈ నెల రెండో వారం వరకు కేవలం రూ.500కే ఆర్టీపీసీఆర్ నిర్వహించిన లాబ్‌లలో ఇప్పుడు రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు పెంచారు. వైరస్ ఏ రకం వేరియంటో కూడా తమ పరీక్షల్లో తేలుతుందని, డెల్టా రకమా? ఒమిక్రానా? చెప్పేస్తామని మరికొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు రూ,1500 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నాయి.
ఇంటి వద్దకు వచ్చి నమూనాలు సేకరిస్తే అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో వారం, పది రోజుల్లో ఫీజులు మరింత పెరగవచ్చు’ అని సికింద్రాబాద్‌కు చెందిన ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు ఇలా వేల రూపాయల్లో ఖర్చు చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లోనూ 24 గంటల తర్వాతే ఫలితాలు వెలువడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment